కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?

    • రచయిత, జేమ్స్ గళ్లఘర్
    • హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి

కరోనావైరస్ ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు సంఖ్య 4.6లక్షలు దాటింది. గత ఏడాది డిసెంబర్‌ చివరి వారంలో చైనాలో బయటపడ్డ కోవిడ్‌-19ను అరికట్టడానికి ఆరు నెలలు దాటినా సమగ్రమైన చికిత్సను కనుక్కోలేకపోయారు.

మరి ఈ మహమ్మారిని అరికట్టేందుకు మందు ఎప్పుడు వస్తుంది? ఈ పరిశోధన ఎంత దూరంలో ఉంది? దీనికి ప్రత్యామ్నాయాలున్నాయా?

ఇప్పటి వరకు ఎలా చికిత్స చేస్తున్నారు?

ఇప్పటి వరకు మందులేని ఈ వ్యాధిని అడ్డుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు ప్రయత్నాలు చేశారు.

అందుబాటులో ఉన్న మందులతో కరోనాను కట్టడి చేయవచ్చేమోనని ప్రయత్నించారు. దాదాపు 150కి పైగా డ్రగ్స్‌ను పరీక్షించి చూశారు.

మెరుగైన చికిత్సను కనుక్కునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాలిడారిటీ ట్రయల్స్‌ పేరుతో కోవిడ్‌-19 కోసం ట్రయల్స్‌ నిర్వహించింది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 5,000మందితో ప్రపంచంలోనే అతిపెద్ద రికవరీ ట్రయల్‌ నిర్వహించామని ప్రకటించింది.

ఎలాంటి మందులు పని చేస్తాయి?

కరోనాపై ఎలాంటి మందులు పని చేసే అవకాశం ఉందో పరిశీలించేందుకు వైద్యరంగ నిపుణులు మూడు మార్గాలు ఎంచుకున్నారు.

  • మొదటిది యాంటీ వైరల్‌ డ్రగ్స్‌‌ను వాడటం.
  • రెండోది వ్యాధి నిరోధక ఔషధాలను వాడటం.
  • ఇక మూడోది.. అప్పటికే వ్యాధిబారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి తీసుకున్న యాంటీబాడీస్‌ను ప్రయోగించడం.

ఇప్పుడున్నవాటిలో మెరుగైన మందు ఏది?

ఒకప్పుడు ఎబోలా కోసం రెమ్‌డెసివిర్‌ మంచి మెడిసిన్‌ అనుకున్నారు. కానీ దాని తర్వాత ఆ వ్యాధికి మరింత మెరుగైన డ్రగ్స్‌ తయారయ్యాయి.

అయితే కరోనా వైరస్‌ మీద ప్రయోగించిన వాటిలో అత్యంత మెరుగైన ఫలితాలను చూపించినదానిగా రెమ్‌డెసివిర్‌ను గుర్తించారు.

తాను చైనాను సందర్శించి అక్కడి చికిత్సలు పరిశీలించాక ఈ మందు అత్యంత ప్రభావంతమైనదిగా భావిస్తున్నానని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్‌ బ్రూస్‌ ఐల్వార్డ్‌ అన్నారు.

ఇతర రకాల కరోనావైరస్‌ల మీద సమర్ధవంతంగా పని చేసిన ఈ రెమ్‌డెసివిర్‌, కోవిడ్‌-19 మీద కూడా అంతే సమర్ధవంతంగా పని చేస్తుందని భావిస్తున్నారు. చికాగోలో జరిగిన పరీక్షలకు సంబంధించి లీకైన ఫలితాలలో ఈ డ్రగ్‌ ప్రభావవంతమైన డ్రగ్‌గా తేలినట్లు తెలుస్తోంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

హెచ్‌ఐవీ ట్రీట్‌మెంట్ కరోనాకు పని చేస్తుందా ?

మొదట్లో హెచ్‌ఐవీకి వాడే లోపినావిర్‌, రిటోనావిర్‌ మందులు పని చేయొచ్చని భావించారు. కానీ పరీక్షలు చేసిన తర్వాత అది నిజం కాదని తేలింది.

లేబరేటరీలలో అవి పని చేస్తునట్లు అనిపించినా, మనుషుల మీద జరిగిన ప్రయోగాలలో అవి సానుకూల ఫలితాలు చూపలేదు. అయితే ఈ పరీక్షలను తీవ్రస్థాయిలో బాధపడుతున్న(మరణపు అంచుల్లో ఉన్నవారిపై) కోవిడ్‌-19 రోగులపై పరీక్షించారు. కానీ, అప్పటికే మందులు పనిచేయలేని స్థాయి పరిస్థితి చేరుకుందని తేలింది.

మలేరియా మందుతో ఎంత వరకు ఉపయోగం?

ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు యూకే నిర్వహించిన రెండు రకాల పరీక్షల్లో మలేరియా డ్రగ్‌ ఎలా పని చేస్తుందో పరీక్షించారు. క్లోరోక్విన్‌కు అనుబంధమైన హైడ్రాక్సి క్లోరోక్విన్‌లో యాంటి వైరస్‌, రోగ నిరోధక అంశాలు ప్రభావం చూపించవచ్చని భావించారు.

దీని పని తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాంటి వాళ్లు చేసిన ప్రకటనలు అందరి దృష్టీ ఈ డ్రగ్‌ మీద పడేలా చేసింది. అయితే దీని ప్రభావం మీద పూర్తిస్థాయి ఆధారాలు ఇంకా లభించలేదు. రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌కు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మెడిసిన్‌గా పని చేస్తుంది. ఇది కరోనా చికిత్సల కొంత వరకు ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడగా, దీనికి గట్టి ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.

రోగ నిరోధక ఔషధాలు ఏ మేరకు పని చేస్తాయి?

వ్యాధి నిరోధక శక్తి ఓవర్‌ రియాక్ట్‌ అయినా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ఒళ్లంతా మంటలు పుట్టే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తితో వైరస్‌ మీద దాడి చేయించడం కొంత వరకు మంచితే .

కానీ డోస్‌ ఎక్కువైతే అది శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినడానికి, ఒక్కోసారి మరణానికి కూడా దారి తీయొచ్చు. తక్కువ మంటను కలిగించే ఇంటర్‌ఫెరాన్‌ బీటాను సాలిడారిటీ ట్రయల్స్‌ లో వాడుతున్నారు. ఇంటర్‌ ఫెరాన్‌ అనేది వైరస్‌ మీద పోరాడటానికి మనిషి శరీరంలో ఏర్పడే ఒక రసాయనం.

డెక్సామెథాసోన్‌తో ప్రాణాలు నిలబడతాయా?

మొట్టమొదటిసారిగా యూకేలోని ది కార్డిఫ్‌ అండ్‌ వేల్ హెల్త్‌ బోర్డు 180 కరోనా పేషెంట్ల మీద ఈ స్టెరాయిడ్‌ రసాయనాన్ని ప్రయోగించింది. వాస్తవానికి ఈ పరీక్షల ఫలితాలు తేల్చడానికి ఆరు నుంచి పన్నెండువారు పడుతుందని, కానీ తాము 15 రోజుల్లోనే దీని ప్రభావాన్ని గుర్తించగలిగామని కార్డిఫ్‌ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌కు చెందిన క్రిస్టోఫర్‌ ఫెగాన్‌ వెల్లడించారు.

యూకేవ్యాప్తంగా కూడా డెక్సామెథాసోన్‌ డ్రగ్‌ వాడకం మొదలైందని, 240,000 డోసుల డ్రగ్‌ను సిద్ధంగా ఉంచామని యూకే హెల్త్‌ సెక్రటరీ మాట్‌ హాంకాక్‌ ప్రకటించారు.

కోలుకున్న వారి రక్తం పని చేస్తుందా?

ఒక్కసారి వైరస్‌ బారినపడి కోలుకున్నవారి రక్తం నుంచి తీసిన యాంటీబాడీస్‌తో చికిత్స చేయవచ్చా అన్న కోణంలో కూడా పరిశోధనలు కొనసాగాయి. దీనినే ప్లాస్మా థెరపీ అంటున్నారు. కొన్వాలసెంట్ ప్లాస్మాతో ఈ తరహాలో 500మందికి అమెరికా చికిత్స చేయగా, ప్రపంచంలోని పలు దేశాలు కూడా ఇప్పుడిప్పుడే ఈ విధానంవైపు మళ్లుతున్నాయి.

చికిత్సకు ఎంత కాలం పడుతుంది?

కరోనావ్యాధి చికిత్సకు మందు ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్స్‌ ఫలితాలు రాబోయే కొద్దినెలల్లో వచ్చేందుకు అవకాశం ఉంది.

ఇక వైరస్‌ను మన దరిచేరనీయకుండా చేసే వ్యాక్సిన్‌ ఎలా పని చేస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే వైద్యులు ఇప్పటికే సిద్ధంగా ఉన్న మందులు కరోనాపై ప్రభావం చూపుతాయా లేదా అన్నదే పరిశీలిస్తున్నారు.

కానీ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేవారు మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా కొత్తగా చేస్తున్న ప్రయోగం. కరోనా కోసం ఇప్పటికే సిద్ధమైన కొన్ని డ్రగ్స్‌ను లేబరేటరీలలో పరీక్షించారు. కానీ మనషుల మీద ఇంకా ప్రయోగించలేదు.

ప్రస్తుతానికి స్వల్ప వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి పారసెటమాల్‌ తదితర మందులు, తీవ్రంగా ఉన్నవారికి ఆసుపత్రులలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌‌తో చికిత్స అందిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)