You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?
- రచయిత, తెరెజా పుల్టరోవా
- హోదా, బీబీసీ ఫ్యూచర్
మొదటిసారి చూసినప్పుడు అవి గాలికి ఊగిపోతూ ప్రపంచంలో ఉండే ఇతర గోధుమ కంకులులాగానే అనిపిస్తాయి. అయితే ఈశాన్య చైనాలోని విస్తారమైన పొలాలను పరిశీలించినప్పుడు అవి సాధారణమైన మొక్కలేమి కావని తెలుస్తుంది. అవి అంతరిక్షంలో తయారైనవి మరి!
ఈ వెరైటీ గోధుమలను లువైయూన్ 502 రకంగా వ్యవహరిస్తుంటారు. చైనాలో పండిస్తున్న గోధుమల్లో రెండో పెద్ద రకం ఇదే.
భూమి ఉపరితలానికి 200 మైళ్లు (340 కి.మీ.) పైన ఉండే కక్ష్యలోకి తీసుకువెళ్లి తిరిగి తెచ్చిన విత్తనాల నుంచి వచ్చిన పంట ఇది.
తక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగి, మాగ్నటిక్ శక్తి రక్షణ లేని, భూమికి దూరంగా ఉండే ఆ అనుపమానమైన ప్రాంతానికి వాటిని తీసుకువెళ్లారు.
వాటి డీఎన్ఏలో స్వల్పమైన మార్పులు చేశారు. అందువల్ల వాటిలో కొత్త లక్షణాలు కలిగాయి. కరవును ఎదుర్కొనే, కొన్ని రకాల తెగుళ్లను తట్టుకొనే శక్తి కలిగింది.
స్పేస్ క్రాఫ్ట్‌లు, స్పేస్ స్టేషన్లలో పెంచుతున్న ముఖ్యమైన ఆహార పంటల కొత్తరకం వెరైటీలకు ఇవి ఉదాహరణల లాంటివి. భూమి చుట్టూ తిరిగే ఇలాంటి కేంద్రాల్లో పండించే పంటల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
అవి మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఉంటాయి. అక్కడ కాస్మిక్ కిరణాల దాడి తీవ్రంగా ఉంటుంది. ఆ కారణంగా వాటిలో మార్పులు సంభవిస్తాయి. దాంతో ఈ ప్రక్రియను స్పేస్ మ్యుటజెనెసిస్‌గా వ్యవహరిస్తున్నారు.
కొన్ని రకాల మ్యుటేషన్ల కారణంగా మొక్క అసలు పెరగదు. మరికొన్ని రకాల మ్యుటేషన్ల వల్ల మాత్రం వాటికి ప్రయోజనం కలుగుతుంది.
కొన్ని దృఢంగా మారి తీవ్రంగా ఉండే ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకోగలుగుతాయి. మరికొన్ని ఒక్క మొక్క నుంచే ఎక్కువ పంటను ఇవ్వగలిగేవిగా ఉంటాయి. కొన్ని అతి త్వరగా పెరుగుతాయి. ఇంకొన్నింటికి తక్కువ నీరు అవసరం పడుతుంది.
అంతరిక్షంలో పెరిగిన ఆ మొక్కల విత్తనాలను భూమిపైకి తిరిగి తీసుకొచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా స్క్రీనింగ్ చేస్తారు. వాటిని నాటుతారు. వచ్చిన పంట నుంచి ఇక్కడికి పొలాలకు అనువైన విధంగా ఉండే విత్తనాలను అభివృద్ధి చేస్తారు.
వాతావరణంలో మార్పులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం తీవ్ర ఒత్తిడికి లోనయింది. సరఫరా గొలుసులు బలహీనం కావడం ఈ ఇబ్బందులకు మరో కారణం. అందువల్ల ఏ ప్రాంతంలో వేటిని భుజిస్తారో ఆ ప్రాంతంలో వాటిని పండించాలన్న అవసరం ఏర్పడింది.
ఇలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కొని, నూతన పరిస్థితులను అనుకూలింపజేసుకోవడానికి పంటలకు ఈ తరహా స్పేస్-బ్రీడింగ్ లేదంటే స్పేస్ మ్యుటజెనెసిస్ అనే విధానం ఉపయోగపడుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.
"స్పేస్ మ్యుటజెనెసిస్ విధానం అందమైన ఉత్పరివర్తకాల (మ్యుటేషన్లు)ను సృష్టిస్తుంద" ని ప్రముఖ స్పేస్ మ్యుటజెనెసిస్ రంగ నిపుణుడు లియు లుక్సియాంగ్ అన్నారు. ఆయన బీజింగ్‌లో ఉన్న చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ పరిధిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ స్పేస్ మ్యుటజెనెసిస్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు.
ఉదాహరణకు చైనాలో పెంచే ప్రామాణిక గోధుమ రకాల కన్నా లుయువాన్ 502 రకం 11% అధిక దిగుడులు ఇస్తోంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలుగుతోంది. గోధుమకు సాధారణంగా ఆశించే తెగుళ్ల నుంచి తట్టుకోగలుగుతోంది. ఈ వివరాలను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థే ఇర్రాడియేషన్ ఆధారిత టెక్నికల్ పద్ధతుల ద్వారా కొత్త రకాల పంటల విధానం రూపకల్పనకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేస్తోంది.
"లుయుయాన్ 502 నిజంగా ఓ విజయ గాధ. అత్యధిక దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉంది. ఏ ప్రాంతాన్నయినా అనువుగా మార్చుకుంటుంది. పలు రకాల పరిస్థితుల్లోనూ పండించడానికి అనువుగా ఉంటుంది" అని లియు చెప్పారు.
ఈ అనుకూలత కారణంగానే లుయుయాన్ 502 రకం విత్తనాలు చైనా రైతుల వద్ద పెద్ద హిట్ అయ్యాయి. రకరకాల వాతావరణ పరిస్థితులు, నానావిధ భౌగోళిక స్వరూపాలు ఉన్న చైనాలో అన్ని చోట్లా ఇది ఆదరణ పొందింది.
గత 30 ఏళ్లుగా చైనాలో 200కుపైగా స్పేస్-మ్యూటెడ్ క్రాప్ వెరైటీలను సృష్టించారు. అందులో లుయుయాన్ 502 రకం గోధుమ విత్తనాలు ఒక రకం మాత్రమేనని లియు తెలిపారు.
చైనా శాస్త్రవేత్తలు గోధుమలతో పాటు వరి, మొక్క జొన్న, సోయా బీన్, పప్పుజాతి పంట అయిన ఆల్ఫాల్ఫా, నువ్వులు, పుచ్చ, టమోటా, క్యాప్సికం లా ఉండే స్వీట్ పెప్పర్ , ఇతర రకాల కూరగాయలను అంతరిక్షంలో పండించారు.
1987 నుంచి స్పేస్ మ్యుటజెనెసిస్‌పై చైనా ప్రయోగాలు చేస్తోంది. ఈ టెక్నిక్‌లను నిరంతరం వినియోగిస్తున్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
అప్పటి నుంచి డజన్ల కొద్దీ అంతరిక్ష ప్రయోగాలు జరిపి భూ కక్ష్యలోకి వివిధ రకాల పంటల విత్తనాలను తీసుకెళ్లింది.
చైనా శాస్త్రవేత్తలు రోదసీలో పండించిన పంటను తొలిసారిగా 1990లో విడుదల చేశారు. అది యుజియావో 1 అనే స్వీట్ పెప్పర్. చైనాలో సంప్రదాయంగా పండే స్వీట్ పెప్పర్ రకాల కన్నా ఇది పెద్ద కాయలను ఇచ్చింది. తెగుళ్లను సమర్థంగా తట్టుకొందని లియు వివరించారు.
ఇటీవలి కాలంలో చైనా ప్రపంచ స్థాయి రోదసీ శక్తిగా ఎదుగుతోంది. అందువల్ల భూ కక్ష్యలోకి వేలాది విత్తనాలను పంపించగలగడం దానికి సాధ్యమవుతోంది.
2006లో షిజియాన్ 8 ఉపగ్రహం ద్వారా అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 250 కిలోలు (551పౌండ్లు)కన్నా ఎక్కువగా విత్తనాలను పంపించింది. ఇందులో 152 జాతుల విత్తనాలు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి.
ఈ ఏడాది మే నెలలో 12,000 విత్తనాలు అంతరిక్షంలో ఉన్న కేంద్రం నుంచి తిరిగి వచ్చాయి. ఇందులో రకరకాల గడ్డి విత్తనాలు, ఓట్స్, అల్ఫాల్ఫా, శిలీంధ్రాలు ఉన్నాయి.
షెంజవ్ 13 మిషన్‌లో భాగంగా చైనాకు చెందిన తియాన్హే స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యోమగాములు వీటిని అక్కడికి తీసుకెళ్లారు. ఆరు నెలల అనంతరం ఇక్కడికి తిరిగి తెచ్చారు.
చైనీయులు చంద్రుని కక్ష్యలోకి కూడా ఒక దఫా వరి విత్తనాలను పంపించారు. 2020 నవంబరులో చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దించిన ఛాంగే-5 మిషన్ ద్వారా ఇవి వెళ్లాయి. ఆ విత్తనాలు చంద్రుని చుట్టూ తిరిగి వచ్చాయి.
చైనా వార్తా కథనాల ప్రకారం.. ఆ చంద్ర వరి విత్తనాలను భూమి పైకి తెచ్చి ప్రయోగ శాలలో పెంచినప్పుడు విజయవంతంగా ధాన్యాలను అందించాయి.
దీనిపై లియు మాట్లాడుతూ "చైనాకు ఉన్న పటిష్ఠమైన అంతరిక్ష కార్యక్రమాల ద్వారా మేం లబ్ధిపొందుతున్నాం. రికవర్‌బుల్ శాటిలైట్లు, హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారంలు, మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్‌లను ఉపయోగించుకొని అంతరిక్షంలోకి విత్తనాలను పంపగలుగుతున్నాం. ఏడాదికి రెండు సార్లు ఇలా చేయగలుగుతున్నాం. ఆ అంతరిక్ష సౌకర్యాలను పంటల అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాం" అని వివరించారు.
కొన్నిసార్లు కేవలం నాలుగు రోజుల పాటు అంతరిక్ష యాత్ర ఉన్నా విత్తనాలను పంపిస్తున్నారు. మరికొన్ని సార్లు నెలల తరబడి కొనసాగే యాత్రల్లోనూ తీసుకెళ్లుతున్నారు.
ఇలాంటి అసాధారణ వాతావరణం ఉన్నప్పుడు విత్తనాలు. మొక్కల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మొదటగా..అత్యంత శక్తివంతమైన సోలార్, కాస్మిక్ రేడియేషన్ కారణంగా విత్తనంలోని జన్యుపరమైన పదార్థం దెబ్బతింటుంది. ఆ కారణంగా ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి. క్రోమోజోముల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ భవిష్యత్తు తరాలకు వారసత్వంగా వెళ్తాయి.
అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండే వాతావరణం వల్ల కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. మైక్రోగ్రావిటీగా పిలిచే ఇలాంటి వాతావరణంలో మొలకెత్తి, పెరిగే మొక్కల్లో కణాల ఆకారం మారుతుంది. ఆ కణంలోపలి అమరిక, స్వరూపం కూడా మార్పులకు లోనవుతుంది.
చాలా సందర్భాల్లో చైనా శాస్త్రవేత్తలు విత్తనాలను అంతరిక్షంలోకి పంపిస్తుంటారు. తిరిగి వాటిని భూమి మీదకు తెచ్చిన తరువాత ఇక్కడి నేలపైనే మొలకెత్తిస్తుంటారు. ఆ నారు ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుందో పరిశీలన జరుపుతారు. సంప్రదాయ విత్తనాల బదులు వీటిని ఎక్కడ విత్తితే ప్రయోజనకరంగా ఉంటుందో అధ్యయనం చేస్తారు.
ఈ విత్తనాల ద్వారా ఎలాంటి మార్పులు కలిగాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తారు. గింజ, కాయలు పెద్దగా ఉండడం, నీటి అవసరాలు తక్కువగా ఉండడం, పోషకాహార విలువలు అధికంగా ఉండడం, అతి ఎక్కువ, తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలగడం, తెగుళ్లను ఎదుర్కోగలగడం వంటి మార్సులు ఉన్నాయా అని చూస్తారు.
కొన్ని సందర్భాల్లో జరిగే అసాధారణ మ్యుటేషన్లు పంట దిగుబడులు, తెగుళ్లను తట్టుకోవడం విషయమై సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి.
ఆ విత్తనాల సాయంతో మరింత మెరుగైన మొక్కలు జన్మించేలా శాస్త్రవేత్తలు పరిశోధన కొనసాగిస్తుంటారు. రైతుల అవసరాలను తీర్చగలుగుతాయన్న నిర్ధరణకు వచ్చే వరకు ఆ విత్తనాలను గణనీయంగా మెరుగుపరుస్తూనే ఉంటారు.
ప్రస్తుతం చైనా స్పేస్ మ్యుటజెనెసిస్ రంగంలో లీడర్ గా ఉంటున్నప్పటికీ, స్పేస్-బ్రీడింగ్ ప్రయోగాల విషయంలో మాత్రం ప్రథమ దేశమేమీ కాదు. అమెరికా, సోవియట్ యూనియన్‌ల శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల క్రితమే ఈ టెక్నిక్స్‌పై మొట్టమొదటగా ప్రయోగాలు చేశారు. క్యారెట్ల కణాలను సోవియట్ ఉపగ్రహం కాస్మోస్ 782 ద్వారా భూ కక్ష్యలోకి పంపించారు.
ఈ విధానం న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ సూత్రాలను అనుగుణంగా ఉంటుంది. ఈ సూత్రం 1920 దశకం చివరి సంవత్సరాల నుంచే అందుబాటులోకి వచ్చింది. లివింగ్ ఆర్గానిజమ్స్ రేడియేషన్‌కు గురయితే వాటి డీఎన్ఏలోని సహజంగా జరిగే ఉత్పరివర్తన ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పడమే న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ సూత్రం సారాంశం.
భూమి మీద అయితే న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ కోసం ఇక్కడ లభించే గామా కిరణాలు, ఎక్స్ రేలు, ఐయాన్ బీమ్స్‌ను ఉపయోగిస్తుంటారు.
అదే స్పేస్ మ్యుటజెనెసిస్ కోసం అయితే భూగోళం చుట్టూ ఉండే కాస్మిక్ కిరణాలు ఉపయోగపడుతాయి. నిజానికి అంతరిక్షంలో కాస్మిక్ కిరణాలు బాంబులు వేసిన రీతిలో దాడులు చేస్తుంటాయి.
భూమి మీద అయితే మనం అత్యంత శక్తివంతమైన కిరణాల నుంచి భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం కారణంగా రక్షణ పొందుతాం. అదే భూ కక్ష్యలో అయితే వ్యోమ నౌకలు, ఉపగ్రహాలు నిత్యం ఆ రేడియేషన్‌కు గురవుతునే ఉంటాయి. ఈ రేడియేషన్ ఎక్కువగా సూర్యుని నుంచే వస్తుంది.
స్పేస్, న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ ఈ రెండింటి కారణంగా కొత్త పంటల అభివృద్ధికి తీసుకునే సమయం సగానికి తగ్గుతుందని ఈ రంగానికి చెందిన నిపుణురాలు శోభా శివశంకర్ చెప్పారు.
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ (ఎఫ్ఏఓ)లు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ గ్రూపు సంస్థకు ఆమె అధిపతిగా ఉన్నారు.
ఆస్ట్రియాలోని వియన్నాకు ఈశాన్యంగా 21 మైళ్లు (35 కి.మీ.) దూరంలో సైబెరిస్డార్ఫ్‌లో ఐఏఈఏ ఆధ్వర్యంలో ఉన్న ఈ న్యూక్లియర్ లాబొరెటరీలు న్యూక్లియర్ మ్యుటజెనెసిస్‌కు గ్లోబల్ హబ్ లాంటిది. ఇది శిక్షణ కేంద్రం కూడా.
సొంతంగా న్యూక్లియర్ సౌకర్యాలు లేని దేశాలకు ఇది సహకరిస్తుంది.
న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ సౌకర్యాలు లేని దేశాలు ఇక్కడికి విత్తనాలు, నారు, మొక్కల కొమ్మలు పంపిస్తే శోభా శివ శంకర్ బృందం వాటిని రేడియేషన్ చేసి ఇస్తుంది.
దీనిపై శోభా శివశంకర్ మాట్లాడుతూ "విత్తనాలను రేడియేషన్ చేసి ఇవ్వడానికి కొద్ది నిమిషాల సమయమే పడుతుంది. కానీ ఇందుకు చాలా పరిజ్ఞానం, నైపుణ్యం అవసరం. ఒక్కో రకం విత్తనానికి ఒక్కో తరహా సహన శక్తి ఉంటుంది. విత్తనాలకు చాలా ఎక్కువ డోస్ ఇచ్చినా, వాటిని ఇర్రేడియేటర్‌లో ఎక్కువ సమయం ఉంచినా వాటిని మీరు నాశనం చేసినట్టే. అవి మొలకెత్తవు. తగినంత మోతాదులో రేడియేషన్ ఇవ్వకపోతే వాటిలో ఆశించిన ఉత్పరివర్తనాలు కనిపించవు. ఎలాంటి మార్పులు లేకుండా పాత తరం విత్తనాల్లాగానే ఉంటాయి" అని వివరించారు.
ద జాయింట్ ఎఫ్ఏఓ/ఐఏఈఏ డివిజన్ ఆఫ్ న్యూక్లియర్ అప్లికేషన్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ పరిధిలో ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ గ్రూపు పనిచేస్తోంది. దీన్ని 1964లో ఏర్పాటు చేశారు.
1920 చివరి నాటికి ఎక్స్ రే కిరణాలను ఉపయోగించి గోధుమలు, జొన్నలు, వరి, ఓట్స్, బార్లీ విత్తనాల్లో మ్యుటేషన్లు తీసుకురావడంపై ప్రయోగాలు జరిగాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా వృక్ష శాస్త్రజ్ఞుల్లో ఆసక్తి రేకెత్తించాయి.
1950 నాటికి చాలా అభివృద్ధి చెందిన దేశాలు న్యూక్లియర్ బ్రీడింగ్ కార్యక్రమాలను ప్రారంభించాయి. కేవలం ఎక్స్‌రేల ద్వారానే కాకుండా అల్ట్రా వయొలెట్ కిరణాలు, గామా కిరణాలతో ప్రయోగాలను ప్రారంభించాయి.
"ఆ సమయంలో యూరోప్, ఉత్తర అమెరికాలో చాలా ప్రయత్నాలు జరిగాయి. న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ సాయంతో చాలా రకాల కొత్త విత్తనాలను రూపొందించి విడుదల చేశారు. అయితే గత రెండు మూడు దశాబ్దాలుగా చాలా దేశాలు ఈ విధానానికి స్వస్తి పలికాయి. ముఖ్యంగా అమెరికా ట్రాన్స్‌జెనిక్ టెక్నాలజీ వైపు మళ్లింది. ల్యాబుల్లో.. మొక్క జెనోమ్‌లోకి పరాయి విత్తనం డీఎన్ఏను జొప్పించడమే ఈ టెక్నాలజీ" అని శోభా శివశంకర్ చెప్పారు.
అలాగని న్యూక్లియర్ మ్యుటజెనెసిస్ విధానం పూర్తిగా అదృశ్యమేమీ కాలేదు. ఆసియా పసిఫిక్ దేశాల్లో దీని ఒరవడి కొనసాగుతోంది. చైనా దీనికి నాయకత్వం వహిస్తుండడంతో పాటు విశ్వాసాన్ని పెంచుకుంటూపోతోంది.
కొత్త విత్తనాల విషయమై మ్యుటెంట్ క్రాప్ వెరైటీస్ పేరుతో ఐఏఈఏ నిర్వహిస్తున్న డాటా బేస్‌కు నిత్యం వివరాలను అందిస్తునే ఉంది. ఈ డాటాబేస్‌లో ప్రస్తుతం 3,300 రకాల నూతనంగా అభివృద్ధి చేసిన పంటల సమాచారం ఉంది.
శోభా శివశంకర్ అభిప్రాయం ప్రకారం చాలా పేద ఆసియా దేశాలు మ్యుటజెనెసిస్ విధానానికి అంటిపెట్టుకొని ఉండడానికి ట్రాన్స్‌జెనిక్ టెక్నాలజీలు చాలా ఖరీదైనవి కావడమే ప్రాథమిక కారణంగా కనిపిస్తోంది. పశ్చిమ దేశాలు ఈ విధానాన్ని పూర్తిగా వదులుకున్నా ఆసియా దేశాలు ఇంకా కొనసాగిస్తుండడానికి ప్రాక్టికల్ కారణాలు కూడా ఉన్నాయి.
"ఉదాహరణకు యూఎస్‌లోని ఇండస్ట్రియల్ ఫార్మింగ్ రంగం కేవలం కొన్ని అంశాలకే ప్రాధాన్యం ఇస్తుంది. పురుగులు, కలుపు మొక్కల నివారణపైనే దృష్టి పెడుతుంది. ఈ విషయంలో ట్రాన్స్‌జెనిక్ టెక్నాలజీ బాగా పనిచేస్తుంది. అయితే ఆసియా దేశాల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం" అని ఆమె వివరించారు.
చాలా భిన్నమైన వాతావరణాల్లో పనిచేసే చిన్న రైతుల కోసం ఆసియాలోని బ్రీడర్లు విత్తనాలను తయారు చేస్తుంటారు. వాటిలో ఏదో ఒకటి రెండు లక్షణాలను మార్చడం ద్వారా వారి అవసరాలు తీరవు.
"వారికి మిశ్రమ లక్షణాలు ఉన్న విత్తనాలు కావాలి. వాతావరణానికి అనుకూలమైనవి ఉండాలి. వేడిని, కరవును తట్టుకోగలిగనవి, సారంలేని భూములు, చౌడు నేలల్లో పెరిగేవి కావాలి. ట్రాన్స్‌జెనిక్ టెక్నాలజీ ద్వారా ఈ లక్షణాలు అన్నింటినీ సాధించలేమన్నది నా అభిప్రాయం" అని శోభా శివశంకర్ తెలిపారు.
వ్యవసాయ పంటల జెనెటిక్ పూల్ ను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు చేయడంపైనా చైనా దృష్టి సారించింది.
లియు ఆయన బృందం అభిప్రాయం ప్రకారం 2050నాటికి భూగోళంపై అదనంగా రెండు బిలియన్ల మంది నివసిస్తారు. వారిని పోషించడానికి ప్రపంచం అదనంగా 70% మేర కీలక ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జనాభా అధికంగా పెరగనుండగా ఆహార ధాన్యాల కొరత ముప్పు కూడా ఇక్కడే ఎక్కువగా ఉండనుందని వారు చెప్పారు.
ఐఏఈఏ అభిప్రాయం ప్రకారం న్యూక్లియర్, స్పేస్ మ్యుటజెనెసిస్ విధానాల ద్వారా ఒక్క చైనాయే 800కుపైగా వెరైటీలను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువచ్చింది. అసలు పంటల విత్తనాలతో పోల్చితే వీటిలో అన్ని రకాల ముఖ్యమైన లక్షణాలను మెరుగు పరచడం విశేషం.
కానీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. భూమి మీద ఉన్న ప్రయోగశాలల్లో అలాంటి సౌకర్యాలే ఉన్నప్పడు విత్తనాలను అంతరిక్షానికి పంపించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
విత్తనాలను అంతరిక్షంలోకి పంపిస్తే ఖర్చు అధికమని లియు అంగీకరించారు. ప్రయోగశాలల్లోని ఇర్రేడియేటర్స్‌లో ఉంచే విధానంతో పోల్చితే భారం ఎక్కువేనని చెప్పారు. అయితే అంతరిక్ష యాత్రల వల్ల స్పష్టమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఆశ్చర్యకరమైన ఫలితాలను తరచూ ఇస్తుంటాయని చెప్పారు.
"గామా కిరణాల ద్వారా కన్నా స్పేస్ మ్యుటజెనెసిస్ ద్వారా ప్రయోజనకరమైన మ్యుటేషన్లు చాలా త్వరత్వరగా రావడాన్ని మేం వాస్తవంగా చూశాం. స్పేస్‌లో రేడియేషన్ సాంద్రత కొంతవరకు తక్కువగానే ఉంటుంది. అయితే అక్కడికి పంపే విత్తనాలు ఎక్కువ సమయం పాటు రేడియేషన్ ప్రభావానికి గురవుతాయి. దీన్ని మేం లీనియర్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ద పార్టికల్స్ అని వ్యవహరిస్తుంటాం. మొత్తంగా అంతరిక్షంలో జీవ సంబంధ ప్రభావాలు అధికంగా ఉంటాయి. ప్రయోగశాలల్లోని ఇర్రాడియేషన్ విధానం ద్వారా కన్నా విత్తనాలకు స్పేస్‌లో తక్కువ నష్టం జరుగుతుంది" అని లియు వివరించారు.
దీనిపై ఆయన మరికొంత అదనపు సమాచారం ఇచ్చారు. "ల్యాబ్‌లో ఉండే ఇర్రేడియేటర్ ద్వారా విత్తనాలకు అధిక డోస్‌లో ఐయోనైజింగ్ అందుతుంది. కొద్ది సెకండ్ల కాలంలోనే 50-400 గ్రేస్ మేర డోసులు అందుతాయి. మరోవైపు వారం రోజుల పాటు సాగే అంతరిక్ష యాత్రలో విత్తనాలకు కేవలం 2 మిల్లీగ్రేస్ రేడియేషన్ మాత్రమే ఉంటుంది. ఆ కారణంగా ఇర్రేడియేటర్ నుంచి తెచ్చిన విత్తనాలను నేలపై నాటినప్పుడు 50 శాతం బతకవు. అదే స్పేస్‌కు వెళ్లి తిరిగి వచ్చినవైతే మొత్తం మొలకెత్తుతాయి" అని వివరించారు.
" ఈ విధానాలన్నీ చాలా వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో సహకరిస్తాయి. విత్తనాలను అంతరిక్షంలోకి పంపడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. వాటిపై అంతగా ఆధారపడలేం" అని చెప్పారు.
స్పేస్‌లో ఆహార పంటల పెంపకంపై ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆసక్తి మళ్లీ మొదలయినట్టు కనిపిస్తోంది.
ఉదాహరణకు భూమి చుట్టూ పరిభ్రమణం చేసే ఆర్బిటింగ్ గ్రీన్ హౌస్‌లను నిర్వహించే ప్రణాళికలు ఉన్నాయని 2020 నవంబరులో అమెరికాకు చెందిన కమర్షియల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీ నానోరాక్స్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి చిన్న ఉపగ్రహాలను పంపించిన అనుభవం ఆ సంస్థకు ఉంది.
వారి లక్ష్యం ఏమిటి? వాతావరణ మార్పులు దారుణంగా ఉంటున్నందున ప్రపంచానికి అవసరమయ్యే కొత్త పంటలను అభివృద్ధి చేయడమే దాని ఆశయం.
ఈ ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో చేతులు కలిపింది. ఆ దేశానికి ఉన్న సాగు యోగ్య భూమి చాలా తక్కువ. అంటే దానర్థం అవసరమైన ఆహార పదార్థాలను అది దిగుమతి చేసుకుంటోంది.
అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చిన విత్తనాలన్నీ సూపర్ ప్లాంట్‌లుగా ఎదగలేదు. 2020లో యూరోపిన్ శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి లెట్ట్యూస్ విత్తనాలను పంపించారు. వాటిని తిరిగి తీసుకువచ్చి భూమిపై నాటినప్పుడు అప్పటికే ఉన్న మొక్కలతో పోల్చితే చాలా ఆలస్యంగా పెరిగాయి.
అంతరిక్ష యాత్రకు వెళ్లే ఆస్ట్రోనాట్‌లు రోదసీలో తమంతట తాము ఆహారం పొందే విధంగా అవసరమైనవాటిని పెంచడంపైనే ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
ఉదాహరణకు ఐఎస్ఎస్‌లో ఆస్ట్రోనాట్‌లు 2015 నుంచి రొమైన్ లెట్ట్యూస్‌లను పెంచుతున్నారు. వాటినే తింటున్నారు.
2020లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం భుజించడానికి అవి చాలా సురక్షితమైనవి. దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండే వారికి విలువైన న్యూట్రియెంట్లను అందించగలుగుతుంది.
ఆస్ట్రోనాట్‌ల ఆహారం కోసం మొక్కలను పెంచడం చాలా ఘనమైన ప్రయత్నం. చంద్రునిపైకి మానవులను పంపించడం, కుజుడు వంటి ఇతర గ్రహాలను చుట్టుముట్టడానికి ప్రపంచంలోని పలు స్పేస్ ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. కానీ భూమిపైనే ఉండిపోయే మనలాంటి వారి కోసం కూడా ఈ స్సేస్ ఫుడ్ అంతకన్నా ఎక్కువగా ఉపయోగ పడే అవకాశం ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
- వ్లాదిమిర్ పుతిన్‌కు క్యాన్సర్ అన్న వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నారంటే..
- పతనమవుతున్న రూపాయి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం - భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు?
- ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)