సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?

అర్జున్ తెందూల్కర్ ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేశాడు.

అర్జున్ అరంగేట్రం తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానులు అర్జున్‌ను ఆయన తండ్రి, క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పోల్చుతున్నారు. సచిన్ క్రికెట్ నైపుణ్యాలతో అర్జున్ నైపుణ్యాలను పోల్చుతూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో అడుగులు వేస్తున్న యువ పేస్ బౌలర్ అర్జున్‌ను దిగ్గజంతో పోల్చడం ఎందుకు సరికాదో అనే విషయాన్నిక్రీడా రచయిత సురేశ్ మీనన్ వివరించారు.

ఐపీఎల్‌లో అర్జున్ తెందూల్కర్ స్థాయిలో శిక్షణ పొందిన క్రికెటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు.

తెందూల్కర్ కుటుంబంలో పుట్టినందుకు అర్జున్‌కు ఆ స్థాయి శిక్షణ అనివార్యం. ఒక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిష్టించిన తండ్రి అడుగుజాడలను అనుసరించాలంటే ఆ కుమారుడికి గుండె ధైర్యం చాలా ఉండాలి.

పియానిస్ట్‌గా ఎంతో పేరు సాధించిన మోజార్ట్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్‌గా మరొకరు కంపోజర్, టీచర్‌గా తమ కెరీర్‌లను ఎంచుకున్నారు.

తాము ఎంచుకున్న రంగంలో ఏదైనా పొరపాటు చేస్తే మోజార్ట్ కుమారులిద్దరూ సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

కానీ, అర్జున్ తెందూల్కర్‌కు అంత అదృష్టం లేదు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో అర్జున్ తన బౌలింగ్‌లో 31 పరుగులు సమర్పించుకున్నప్పుడు ‘బంధుప్రీతి’ అనే పదం ఎక్కువగా చర్చల్లోకి వచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను అర్జున్ అద్భుతంగా సంధించాడు. 20 పరుగులను కాపాడే ప్రయత్నంలో కేవలం ఆ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించాడు. అప్పుడు ఆయన ప్రదర్శన గురించి చాలా తక్కువ స్పందనలు వచ్చాయి.

23 ఏళ్ల ఎడమచేతి వాటం మీడియం పేసర్ అయిన అర్జున్ తెందూల్కర్, జాతీయ స్థాయిలో ఇంకా వేగవంతమైన, ఆసక్తి రేపే బౌలర్‌ కాకపోవచ్చు.

ఆన్రిచ్ నోర్జే, జోఫ్రా ఆర్చర్ వంటి అత్యంత వేగవంతమైన బౌలర్లను ఆడటానికి అలవాటుపడిన బ్యాట్స్‌మెన్‌కు అర్జున్ బౌలింగ్ వేగం అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చు.

కానీ, తన సొంత పేస్‌తో ఎదిగేందుకు అర్జున్‌కు కొంత సమయం అవసరం.

అర్జున్ తండ్రి సచిన్ తెందూల్కర్ 16 ఏళ్ల వయస్సులోనే దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 19 ఏళ్ల నాటికే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించాడు. క్రికెట్‌లో అందరి కంటే ఎక్కువగా మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేశాడు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం ఎవరికీ అంత సులభం కాదు.

క్రికెట్‌లో మరో దిగ్గజ క్రీడాకారుడు అయిన డాన్ బ్రాడ్‌మన్ కుమారుడు తన పేరును కొన్నేళ్ల పాటు బ్రాడ్‌సెన్‌గా మార్చుకున్నాడనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డాన్ కుమారుడు క్రికెటర్ కూడా కాదు. అయినప్పటికీ ఆయన తండ్రి పేరు ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో పేరు మార్చుకున్నారు.

ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన తండ్రి అడుగుజాడల్లో నడవడం ఒకరకంగా ఆశీర్వాదం, మరోరకంగా శాపం కూడా.

తొలుత అంతా బాగానే ఉంటుంది. కానీ, ఆ యువతరం తమపై పెరిగిన అంచనాలకు అనుగుణంగా జీవించాల్సి ఉంటుంది. అర్జున్ తెందూల్కర్ ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోగలడా?

అర్జున్ కెరీర్ తగినంత డ్రామాతో మొదలైంది. గత డిసెంబర్‌లో గోవా తరఫున ఆడుతూ సెంచరీతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను మొదలు పెట్టాడు అర్జున్. ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు డగౌట్‌లో కూర్చొని ఈ ఏడాదే అరంగేట్రం చేసిన అర్జున్ తాను వేసిన తొలి ఓవర్‌లోనే దాదాపు వికెట్ తీసినంత పని చేశాడు.

ప్రతీ సక్సెస్‌ను మీడియాలో రెండింతలు చేసి చూపిస్తారని, ప్రతీ ఫెయిల్యూర్‌కు రెండింతల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం అర్జున్‌కు తెలుసు.

ప్రతీ తండ్రి తన కుమారుడు తనను మించి ఎదగాలని ఆశిస్తాడు. క్రీడల్లో కొన్నిసార్లు ఇది నిజం అవుతుంది కూడా.

జార్జ్ హెడ్లీని మరో బ్రాడ్‌మన్‌గా పిలుస్తారు. ఆయన కుమారుడు రాన్ హెడ్లీ వెస్టిండీస్ తరఫున రెండు టెస్టులు ఆడాడు. తర్వాత ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రాన్‌కు ఇంగ్లండ్‌లో డీన్ జన్మించాడు. ఇంగ్లండ్ తరఫున డీన్ 15 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. హెడ్లీ అనే ఇంటిపేరు రెండు తరాల పాటు క్రికెట్‌లో వినిపించింది.

భారత్‌లో సీనియర్ పటౌడీ నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన భారత్‌తో పాటు ఇంగ్లండ్‌కు కూడా ఆడారు. ఆయన కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీని అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్లలో ఒకరిగా పరిగణిస్తారు. ఒకసారి మన్సూర్‌ను తన తండ్రితో పోల్చి చెప్పాలని అడిగిప్పుడు, ఆయన ‘‘మా నాన్న మంచి బ్యాట్స్‌మన్ కావొచ్చు, కానీ, నేనొక మంచి ఫీల్డర్’’ను అని అన్నారు.

లాలా అమర్‌నాథ్ కుమారులు సురీందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్‌లు కూడా భారత్ తరఫున ఆడారు. ఈ ముగ్గురిలో మోహిందర్ అమర్‌నాథ్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా నిలిచారు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లు అయిన ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్), మెల్కమ్ మార్షల్, మైఖేల్ మోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, జోయల్ గార్నర్ (వెస్టిండీస్)‌ల బౌలింగ్‌ను ఎదుర్కొంటూ మోహిందర్ అమర్‌నాథ్ ఒకే సీజన్‌లో 11 టెస్టుల్లో 62 సగటుతో 1,182 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. మోహిందర్ అమర్‌నాథ్ తండ్రి లాలా అమర్‌నాథ్ తన కెరీర్‌లో ఇలాంటి గణాంకాలను ఎప్పడూ నమోదు చేయలేదు. కానీ, ఆయనొక దూకుడైన ఆటగాడిగా, ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు.

దాదాపు 15 ఏళ్ల పాటు భారత క్రికెట్ బ్యాటింగ్ భారాన్ని మోసిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కుమారుడు రోహన్ గావస్కర్ తన తండ్రి వారసత్వాన్ని మోయడంలో ఒత్తిడిని అనుభవించారు.

ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన రోహన్ గావస్కర్, బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారత్ తరఫున కేవలం 11 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అయితే, సునీల్ కంటే రోహన్ అటాకింగ్ గేమ్ ఆడేవాడు.

ఇటీవలి కాలంలో క్రికెట్‌లో ఆసక్తి రేకెత్తించిన తండ్రీ కొడుకుల ద్వయం వెస్టిండీస్‌కు చెందిన చందర్‌పాల్‌ ద్వయం. శివ్‌నరైన్ చందర్‌పాల్ వెస్టిండీస్ తరఫున 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేశాడు. ఆయన కుమారుడు తగెనరైన్ చందర్‌పాల్ వెస్టిండీస్ తరఫున ఓపెనర్‌గా ఆరు టెస్టులు ఆడాడు. ఒక డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

వారిద్దరూ కలిసి గయానా తరఫున 11 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు. తగెనరైన్ అరంగేట్ర మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 42, 29 పరుగులు చేయగా, శివ్‌నరైన్ తొలి మ్యాచ్‌లో వరుసగా 8, 108 పరుగులు సాధించాడు.

26 ఏళ్ల తగెనరైన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నాకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి మా నాన్న. నాకు సాధ్యమైనది మాత్రమే నేను చేయగలను. నేను మా నాన్నలా ఆడలేను. నేను నేనుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని అన్నాడు.

అలాగే, అర్జున్ తెందూల్కర్ కూడా తాను చేయగలిగినంత మాత్రమే చేయగలడు. అతని నుంచి అభిమానులు సచిన్ లాంటి ఇన్నింగ్స్‌లు, రికార్డులను ఆశించడం నిజంగా అవివేకం. సచిన్ తరహాలో ఆడాలని అర్జున్‌ను కోరడం అన్యాయం.

(క్రీడా రచయిత అయిన సురేశ్ మీనన్ సచిన్ తెందూల్కర్, బిషన్ బేడీలపై పుస్తకాలు రాశారు)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)