డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: గని కూలిన ఘటనలో 200 మంది మృతి

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గనిలో ప్రమాదం, భారీ వర్షాలకు కుప్పకూలిన గని

ఫొటో సోర్స్, Hassan Lali / BBC

    • రచయిత, పాల్ ఎన్జే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

తూర్పు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గని కూలిన ఘటనలో 200 మంది మరణించారని తిరుగుబాటుదారుల ప్రతినిధులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా రుబాయా పట్టణంలోని గని బుధవారం కూలిపోయిందని దక్షిణ కివు ప్రాంత తిరుగుబాటు గవర్నర్ ప్రతినిధి లుముంబా కంబరే ముసియా చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మహిళలు, పిల్లలు కూడా పని చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగించే కోల్టాన్ అనే ఖనిజాన్ని ఈ గనిలో తవ్వుతున్నారు.

ఈ ప్రాంతంలో గనుల నిర్వహణ సరిగ్గా లేదని మాజీ సూపర్‌వైజర్ ఒకరు బీబీసీతో చెప్పారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన వివరించారు.

నేల పెళుసుగా ఉండటం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన అన్నారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు, మైనింగ్ సంస్థలో ఉద్యోగులు కాని కార్మికులు ఉన్నారు.

ప్రాణాలతో బయటపడిన వారిలో 20 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సమీప బంధువును కోల్పోయిన ఓ వ్యక్తి దిగ్బ్రాంతి చెందినట్లు చెప్పారు. ఇది తమ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు.

"ఆయన ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రాణాలు కోల్పోతారనుకోలేదు" అని బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గాయపడి చికిత్స పొందుతున్న వారిని గవర్నర్ ఎరాస్టో బహతి ముసంగా పరామర్శించారు. నార్త్ కివులో భూభాగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎం23 తిరుగుబాటుదారులు ఎరాస్టో బహతిని గవర్నర్‌గా నియమించారు.

నార్త్ కివులో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న పట్టణాల్లో రుబాయా ఒకటి. ఎం23 తిరుగుబాటుదారులకు కాంగో పక్కనే ఉన్న రువాండా మద్దతిస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గనిలో ప్రమాదం, భారీ వర్షాలకు కుప్పకూలిన గని

ప్రపంచ మొత్తం కోల్టాన్ నిల్వల్లో 15 శాతం, కాంగోలోని మొత్తం కోల్టాన్ నిల్వల్లో సగ భాగం రుబాయాలోని గనులలో ఉన్నాయి.

ఈ ఖనిజంలో టాంటలం ఉంటుంది. దీనిని వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎక్కువ సామర్థ్యంతో పని చేసే కెపాసిటర్ల తయారీలో ఉపయోగిస్తారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది.

2025 జులైలో బీబీసీ బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గని కార్మికులు ఎలాంటి రక్షణ లేకుండానే చేతులతోనే ఖనిజాన్ని తవ్వుతున్నారు.

అప్పట్లో ఈ ప్రాంతంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చుట్టూ పెద్ద గోతులు ఉన్నాయి.

2024 నుంచి ఈ ప్రాంతంలో గనులను ఎం23 తిరుగుబాటుదారులు నియంత్రిస్తున్నారు. తమ లాభాల కోసం ఈ గ్రూపు మైనింగ్ రంగం మీద పన్నులు విధించిందని ఐక్యరాజ్య సమితి ఆరోపించింది.

దీనిపై స్పందన కోసం బీబీసీ కిన్షాసాలో ఉన్న కాంగో ప్రభుత్వ ప్రతినిధుల్ని సంప్రదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)