బడ్జెట్ 2026: కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండొచ్చు? భారత ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుందా?

నిర్మలా సీతారామన్, వార్షిక బడ్జెట్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(ఆదివారం) పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

భారత్ ఈ ఆర్థిక సంవత్సరాన్ని 7.3 శాతం ఆర్థిక వృద్ధితో ముగించింది. అంతేకాదు, జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది, జపాన్‌ను అధిగమించి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.

రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగా ఉంది, రాబోయే నెలల్లో రిజర్వ్ బ్యాంకు లక్ష్యం కంటే కూడా తక్కువగా ఉంటుందని అంచనా.

దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఆధారమైన వ్యవసాయోత్పత్తి బలంగా ఉంది. ధాన్యం ఉత్పత్తి బాగుంది, ప్రభుత్వ గోదాముల్లో తగినంత నిల్వ ఉంది, ఇవి గ్రామీణ ఆదాయాలను పెంచుతున్నాయి.

గత సంవత్సరం ఆదాయపు పన్ను కోత, వినియోగంపై జీఎస్టీ సరళీకరణ కూడా వినియోగదారుల డిమాండ్‌ను పెంచాయి, వ్యయాన్ని ప్రోత్సహించాయి.

ఈ అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం కలయికను 'గోల్డిలాక్స్' దశగా అభివర్ణించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరైన వేగంతో, మంచి ఉద్యోగ వృద్ధితో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను వివరించడానికి అమెరికన్ ఆర్థికవేత్త డేవిడ్ షుల్మాన్ ఈ పదాన్ని ఉపయోగించారు.

కానీ, ఈ బలమైన గణాంకాలు కొన్ని సవాళ్లను దాచిపెడుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, ఈయూ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ ఇటీవల ఈయూతో ఎఫ్‌టీఏపై సంతకం చేసింది.

ఎఫ్‌టీఏలు సాయపడతాయి, కానీ..

దేశంలో నిరుద్యోగం తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ అస్థిరమైన గిగ్ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

దశాబ్దాలుగా ప్రతి త్రైమాసికంలో వేల ఉద్యోగాలను సృష్టించే దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ కంపెనీలు 2025లో మొదటి 9 నెలల్లో కేవలం 17 మందికి మాత్రమే కొత్త ఉద్యోగాలిచ్చాయి. ఇది ఉద్యోగాల మార్కెట్‌లోని బలహీనతకు స్పష్టమైన సంకేతం.

1990ల నుంచి దేశంలో మధ్యతరగతికి ఊపిరినిచ్చిన సాఫ్ట్‌వేర్ రంగంలో నియామకాలు తగ్గిపోవడాన్ని, ఏఐ కారణంగా దేశంలోని విస్తారమైన బ్యాక్-ఆఫీస్ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న సవాళ్లను ఎత్తిచూపుతోంది.

వైట్ కాలర్ ఉద్యోగాలు మందగిస్తుండగా, శ్రమశక్తి ఆధారిత పరిశ్రమలు కూడా ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో భారత్ 2026లోకి ప్రవేశిస్తోంది.

అయితే, వాణిజ్యాన్ని వైవిధ్యపరచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగానే కదిలింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది. వీటిలో ఇటీవలి యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం ఒకటి. అయితే, ఎగుమతులపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.

హెచ్ఎస్‌బీసీ రీసర్చ్ ప్రకారం, " ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. మిగిలిన ప్రపంచానికి ఎగుమతులు కొద్దిగానే పెరిగాయి".

ఎఫ్‌టీఏలు దీర్ఘకాలంలో సహాయపడతాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే అమెరికాయేతర మార్కెట్లలో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భారత్ పోటీ పడగలదా అనేది నాణ్యత, ధర, ఉత్పత్తి పరిమాణం వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

భారత్, వార్షిక బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కార్పొరేట్ పెట్టుబడులేవీ?

భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ మరొక దీర్ఘకాలిక సమస్యపై ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు: బలహీనమైన ప్రైవేట్ పెట్టుబడులు.

భారత్‌లో కార్పొరేట్ పెట్టుబడులు 2012 నుంచి అంతంతమాత్రంగానే ఉన్నాయని, జీడీపీలో అవి దాదాపు 12 శాతం దగ్గరే నిలిచిపోయాయని జేపీ మోర్గాన్‌కు చెందిన జహంగీర్ అజీజ్ ఇటీవల 'హౌ ఇండియాస్ ఎకానమీ వర్క్స్' పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

"కార్పొరేట్ ఇండియా వరుసగా, 13 ఏళ్లుగా పెట్టుబడులు పెట్టకపోతుండడంపై ప్రభుత్వం ఎందుకు అడగడం లేదనేదే ఇక్కడ ప్రశ్న" అని అన్నారు.

"డిమాండ్ అంత బలంగా లేకపోవడం, కర్మాగారాలు ఇప్పటికే అదనపు సామర్థ్యంతో ఉండటం వల్ల కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయి" అని అజీజ్ అన్నారు.

ఈ పరిస్థితితో పాటు, భారత్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు డబ్బును ఉపసంహరించుకోవడం, అధిక జీడీపీ వృద్ధి రేటు వెనుక అంతర్గత బలహీనతలు ఉన్నట్లు సూచిస్తోందని రాక్‌ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు.

"భారత్ చాలాకాలంగా విదేశాల నుంచి పరిమిత మూలధనాన్ని మాత్రమే ఆకర్షించగలిగింది. భూమి కొనుగోలు, ఉద్యోగుల నియామకం, తొలగింపును ఖరీదైనదిగా చేయడం, కార్యకలాపాలను కష్టతరం చేసే నిరంతర 'లైసెన్స్ రాజ్' దీనికి కారణం" అని రుచిర్ శర్మ ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

"గతంలో చైనా, ఇటీవలి సంవత్సరాలలో వియత్నాం వంటి వేగవంతమైన, స్థిరమైన వృద్ధిని సాధించిన ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో.. అత్యుత్తమ సంవత్సరాలలో వారి నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జీడీపీలో 4 శాతం మించిపోయాయి. భారత్‌లో ఇది 1.5 శాతానికి మించలేదు. ఇప్పుడు కేవలం 0.1 శాతం మాత్రమే ఉంది" అని తెలిపారు.

ప్రభుత్వం ఇటీవల తన కార్మిక చట్టాలను నవీకరించింది. ఇది వ్యాపారాన్ని మెరుగుపరుస్తుందని కేంద్రం పేర్కొంది. అయితే, ఇది విదేశీ మూలధనాన్ని భారత్‌కు తిరిగి ఆకర్షిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ బడ్జెట్‌లో సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణపై ఆర్థిక మంత్రి దృష్టి సారించే అవకాశం ఉందని హెచ్ఎస్‌బీసీ రీసర్చ్ తెలిపింది .

ఉద్దీపన ప్యాకేజీపై..

హెచ్ఎస్‌బీసీ రీసర్చ్ ప్రకారం, ఈ బడ్జెట్‌లో రెండు కీలక అంశాలపై ఆర్థిక మంత్రి దృష్టి సారించే అవకాశం ఉంది: మరిన్ని సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ.

జపాన్‌లోని నోమురా విశ్లేషకులు సోనల్ వర్మ, ఔరుదీప్ నంది ప్రకారం, "ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) విస్తరణపై దృష్టి ఉండొచ్చు. అంటే, దేశీయ ఉత్పత్తి పెంపు పథకాలు, ఎంఎస్ఎంఈలతో పాటు ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడం".

ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తున్నందున, కస్టమ్స్ సుంకం రేట్లు తగ్గించవచ్చు. రక్షణ రంగంలో మూలధన వ్యయం పెరగొచ్చు. గత నాలుగేళ్లలో రోడ్లు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మోదీ ప్రభుత్వం ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ ప్రకారం, ప్రస్తుత ధోరణి కొనసాగే అవకాశం ఉంది. మూలధన వ్యయం జీడీపీలో దాదాపు 3 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా.

అయితే, గత సంవత్సరం బడ్జెట్ మధ్యతరగతిపై ఒత్తిడిని తగ్గించడంపై దృష్టి పెట్టింది. దీని కోసం, ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీని జీడీపీలో దాదాపు 0.9 శాతం తగ్గించింది. దీని వల్ల పన్ను వసూళ్లు మరింత తగ్గవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో, ద్రవ్య లోటును తగ్గించడం లేదా దాని నియంత్రణపై ప్రాధాన్యం ఉండవచ్చు.

ఖర్చులపై భారీ కోతలు పెట్టకుండా ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు నువామా సెక్యూరిటీస్ ఒక నోట్‌లో తెలిపింది.

"2030-31వరకు ప్రతి ఏడాది అప్పు-జీడీపీ నిష్పత్తిని 1 శాతం తగ్గించే లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆశించడం లేదు, అంటే రుణాల తగ్గింపు ప్రాధాన్యతగా ఉండొచ్చు" అని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)