You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టారు - ప్రెస్ రివ్యూ
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు పుట్టారని సాక్షి తెలిపింది.
షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే(22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు.
తక్కువ బరువు కారణంగా ఆడపిల్లలిద్దరూ పుట్టిన కాసేపటికే మరణించారు.
మిగతా నలుగురు శిశువులకు ఇంటన్సెవ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు.
అతడు చాలా దగ్గరగా వచ్చాడు.. అందుకే అలా చేశా: యామీ గౌతమ్
అస్సాం అభిమాని తనపై గౌరవంతో వేస్తున్న గమోసా(శాలువా)ను తిరస్కరించి, దాన్ని అవమానించలేదని, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని బాలీవుడ్ నటి యామీ గౌతమ్ చెప్పారని ఈనాడు తెలిపింది.
తాజాగా అస్సాంలోని గువాహతి విమానాశ్రయంలో, అనుమతి తీసుకోకుండానే ఓ అభిమాని యామీ మెడపై అస్సాం వాసులు గౌరవసూచకంగా ఇచ్చే గమోసాను వేయడానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె కోపంతో తిరస్కరించారు. దీంతో అస్సాం వాసుల మనోభావాలను యామీ బాధపెట్టారనే విమర్శలు వచ్చాయి.
ఆమె ట్విటర్లో స్పందిస్తూ- "అక్కడ నా ప్రతిస్పందన కేవలం ఆత్మరక్షణకు సంబంధించింది మాత్రమే. ఓ మహిళగా ఎవరైనా నాకు అతి దగ్గరగా వస్తే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా స్పందించేందుకు నాకు, ప్రతి అమ్మాయికి హక్కుంది. ఇతరుల మనోభావాలను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. తప్పుగా ప్రవర్తిస్తే ఖండించడం ముఖ్యం" అని చెప్పారు.
జనాభా లెక్కల సేకరణలో కులగణన లేనట్లే
జనాభా లెక్కల సేకరణలో కులాల వారీగా లెక్కలు తేల్చాలన్న కొన్ని రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందని ఈనాడు రాసింది. కులాలవారీగణన లేకుండానే 2021 జనాభా వివరాల సేకరణకు రంగం సిద్ధం చేస్తోందని చెప్పింది.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు(ఎన్‌ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాలు(ఓబీసీలు), మిగిలిన కులాల వివరాలను సేకరించడం లేదు.
ఈ విషయంలో మహారాష్ట్ర, బిహార్ శాసనసభలు చేసిన డిమాండ్లను తిరస్కరించినట్లే ఒడిశాలోని పాలక బిజూ జనతాదళ్ లోక్‌సభలో చేసిన డిమాండ్‌నూ కేంద్రం తోసిపుచ్చింది.
'సామాజిక-ఆర్థిక కులగణన(ఎన్‌ఈసీసీ)' సమాచారాన్ని వినియోగించేందుకు వీలు కల్పించాలని దేశవ్యాప్తంగా ఓబీసీల ఉపవర్గీకరణకు నియమితమైన జాతీయ కమిషన్ చేసిన అభ్యర్థననూ కేంద్రం తిరస్కరించింది. కులాల వారీగా వివరాలు సేకరిస్తే జనాభా లెక్కల సేకరణ ప్రాథమిక ఉద్దేశానికే విఘాతం కలుగుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
2021 జనగణన రెండు దశల్లో జరుగనుంది. తొలిదశ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మొదలు కానుంది. ఇళ్లసంఖ్యను లెక్కించడం, జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను తాజాపరచడం లాంటివి ఈ దశలో ఉంటాయి.
2021 తొలినాళ్లలో రెండోదశ ప్రారంభమవుతుంది.
ఎన్‌పీఆర్ అమలును జగన్ నిలిపేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్) ప్రక్రియ మీద స్టే కాదు, దాని అమలును ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిలిపేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ భయంతో జగన్ అమలు చేయాలని చూస్తే బాయ్‌కాట్ చేస్తామని ఆయన చెప్పారు. జగన్‌ను గెలిపించింది అల్పసంఖ్యాక, బలహీన వర్గాలని, సంపన్నులు కాదని, ఇది గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆదివారం సాయంత్రం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జమియత్ ఉలమా గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సింహగర్జన బహిరంగ సభ జరిగింది.
సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ- జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇన్నిరోజుల సమయం తీసుకొనేవారు కాదని, రెండు నిమిషాల్లో ఎన్‌పీఆర్ అమలును రద్దు చేసేవారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఈ అంశంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ మధ్య ఎలాంటి భేదం లేదని, ఎన్‌పీఆర్ జరిగిందంటే దిల్లీలో కూర్చుని కూడా ఎన్‌ఆర్‌సీ చేసేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఏఏతో ముస్లింల పౌరసత్వం రద్దుకాదని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని ఒవైసీ కొట్టిపారేశారు. ఎన్‌ఆర్‌సీ హైదరాబాద్‌లో అమలు చేస్తే పది లక్షల మందికి పౌరసత్వం రద్దు అవుతుందన్నారు.
దిల్లీ హింసపై ప్రధాని మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్‌ఆర్‌సీకి తీర్మానం చేయకపోతే రాజీనామా: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ- అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
- 'నా బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను' -అంకిత్ శర్మ తల్లి
- దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే
- "పసి బిడ్డలను చెత్త కుండీలో పడేయడం నిషిద్ధం"
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- దిల్లీ హింస: పోలీసుల పాత్రపై వినిపిస్తున్న ప్రశ్నలకు బదులిచ్చేదెవ్వరు?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)