You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?
ఒకసారి సిజేరియన్ జరిగాక మళ్లీ సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉంటుందో లేదోనని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్ తరువాత సాధారణ డెలివరీ సాధ్యమేనంటున్నారు వైద్యులు.
దిల్లీలో ఉండే సీమా గుప్తా అనే మహిళ ముగ్గురు పిల్లల తల్లి. ఆమెకు మొదట సాధారణ ప్రసవం అయింది. తరువాత సిజేరియన్, ఆ పైన మళ్లీ నార్మల్ డెలివరీ జరిగింది.
‘సిజేరియన్‌కు, సాధారణ ప్రసవానికి చాలా తేడా ఉంది. నా రెండో కాన్పు సమయంలో సిజేరియన్ జరిగింది. మూడోసారి నేను గర్భం దాల్చినప్పటి నుంచి సమస్య మొదలైంది. నేను మళ్లీ సిజేరియన్ చేయించుకోవాల్సి రావొచ్చని వైద్యులు భావించారు. కానీ, మేం రెండో అభిప్రాయం తీసుకున్నాం.
అదృష్టవశాత్తూ మూడోసారి నార్మల్ డెలివరీ అయ్యాక చాలా సంతోషంగా ఉంది. రెండోసారి సి-సెక్షన్ జరిగాక నా బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోయా. ఉన్నట్టుండి జ్వరం వచ్చేది. బిడ్డకు పాలివ్వలేకపోయేదాన్ని.
కానీ, నార్మల్ డెలివరీ తరువాత మొదటి గంటలోనే నేను బిడ్డకు పాలిచ్చా. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆస్పత్రి నుంచి తిరిగొచ్చాక అన్ని పనులూ చేసుకుంటూ, నా పిల్లల్ని చూసుకోగలిగా’ అంటారు సీమా.
మొదటి డెలివరీ సిజేరియన్ అయితే, రెండోది సాధారణ కాన్పు కావడానికి 60-70 శాతం కేసుల్లో అవకాశం ఉంటుందంటారు డాక్టర్ స్వాతి సిన్హా.
‘ఒకవేళ వైద్యులు సాధారణ డెలివరీని సిఫార్సు చేయకపోతే దానికి కచ్చితంగా కారణాలు అడగాలి. ఒక సిజేరియన్ తరువాత మరో సిజేరియన్ కాస్త ప్రమాదకమరమే. గాయాలు మానకపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది.
సాధారణ ప్రసవం కావాలంటే ఆ దిశగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. అవన్నీ దినచర్యలో భాగమైపోవాలి. అలా చేస్తే సాధారణ ప్రసవం కావడం పెద్ద కష్టమేం కాదు’ అని డాక్టర్ స్వాతి సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)