సీఎం కేసీఆర్ ఇంట్లో రోజూ చికెన్, గుడ్లే తింటున్నాం: కేటీఆర్ - ప్రెస్ రివ్యూ

చికెన్ తింటే కరోనా వస్తుందనే ఆందోళనలకు తెరదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లో రోజూ చికెన్, గుడ్లు తింటున్నాం అని స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

'నేను ముఖ్యమంత్రిగారి ఇంట్లోనే ఉంటున్నా. మా ఇంట్లో పిల్లలతోసహా మేమంతా ప్రతిరోజు చికెన్‌, గుడ్లు తింటున్నాం'

'ముఖ్యమంత్రిగారింట్లో ఎవరూ అనారోగ్యం బారిన పడలేదు. మరి మీకెందుకు దిగులు? చికెన్‌వల్ల కరోనా వ్యాధి వ్యాపిస్తుందన్నది శుద్ధ అబద్ధం' అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారని కథనంలో రాశారు.

చికెన్‌, కోడిగుడ్లపై జరుగుతున్న దుష్ప్రచారాలు, అపోహలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ఇప్పటివరకు చికెన్‌, గుడ్ల వల్ల ఏ ఒక్కరికీ ఆరోగ్య సమస్య తలెత్తలేదని, జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమేనని ఆయన కొట్టిపారేశారు.

శుక్రవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో చికెన్‌, ఎగ్‌ మేళాను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ సహచర మంత్రులు కూడా చికెన్‌, కోడిగుడ్లు ఆరగించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

పోలవరం పూర్తికి గడువు జూన్ 2021

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌మోహనరెడ్డి అధికారులను ఆదేశించినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు పనుల గురించి వివరించారు.

అధికారులతో సీఎం మాట్లాడుతూ గతంలో ప్రణాళిక, సమన్వయం, కార్యాచరణ లోపాలతో నిర్మాణం వేగంగా సాగలేదన్నారు. ఈసారి వర్షాకాలంలోనూ పనులు జరిగేలా చూడాలన్నారని ఈనాడు రాసింది.

ఈ ఏడాది జూన్ నాటికి స్పిల్ వే నిర్మాణం పూర్తి చేసి కాఫర్ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తి చేయాలని, నదీ ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించి ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

స్పిల్ వే నిర్మాణానికి సమాంతరంగా కాఫర్ డ్యాం నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. 2021 సీజన్‌కు ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పినట్లు ఇందులో వివరించారు.

కాఫర్ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తి చేస్తే గోదావరిలో 41.15 మీటర్ల మేర నీరు ఉంటుందని.. దీనివల్ల వెంటనే 17 వేలకు పైగా కుటుంబాలను తరలించాలని అధికారులు సీఎంకు తెలిపారు.

ఆ మేరకు సహాయ పునరావాస పనులపై దృష్టి పెట్టాలని ప్రాధాన్యక్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని ఈనాడు కథనంలో చెప్పింది.

కరెంట్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ పచ్చ జెండా

తెలంగాణలో కరెంట్‌ చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పచ్చజెండా ఊపినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

2019-20, 2020-21 సంవత్సరాలకు గాను వార్షిక ఆదాయ అవసరాలను (ఏఆర్‌ఆర్‌) ఈఆర్‌సీలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు.

ఆ తర్వాత టారిఫ్‌ ప్రతిపాదనలను ప్రత్యేకంగా సమర్పిస్తే... చర్చించి, చార్జీలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కథనంలో రాశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు 19 పైసల లోటు ఉందని, ప్రభుత్వ సబ్సిడీతో డిస్కమ్‌లు నెట్టుకురాలేవని అధికారులు చెప్పారు.

డిస్కమ్‌లు వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13,647 కోట్ల దాకా బకాయి ఉన్నాయని కేసీఆర్‌కు నివేదించారు. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ) విధానం అమలుతో ఏ వారం కరెంటు కోసం ఆ వారానికి సరిపడా డబ్బులు ముందే కడుతున్నామని గుర్తు చేసినట్లు ఆంధ్రజ్యోతి చెప్పింది.

కరెంట్‌ చార్జీలను సవరించకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెప్పారు.

కానీ, కరెంటు చార్జీలు ఎంత మేర పెరుగుతాయన్నదానిపై స్పష్టత లేదు. ప్రధానంగా గృహ వినియోగ కేటగిరీలో (ఎల్‌టీ) చార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. పారిశ్రామిక వర్గాలపై కూడా కొంత భారం పడే అవకాశాలున్నాయి అని కథనంలో రాశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలి విడతలో విద్యుత్‌ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం... ఏడాది కింద మరో 35 శాతం పెంచింది. ఫలితంగా నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల వేతనాలు ఏకంగా 65 శాతం పెరిగాయి.

దీంతో డిస్కమ్‌లు ఉద్యోగుల వేతనాలకే ఏకంగా రూ.2 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కరెంటు బకాయిలు, మరోవైపు ఉద్యోగుల వేతనభారంతో డిస్కమ్‌లు కరెంటు చార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది అని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇద్దరి మృతికి కారణమైన చాటింగ్

ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

గద్వాల జిల్లా వెంకటరమణ కాలనీకి చెందిన రాగ సుధ (29), అదే ప్రాంతానికి చెందిన కార్తీక్‌ (31) డిగ్రీ క్లాస్‌మేట్లు. అప్పట్లో కార్తీక్‌.. తనను ప్రేమించమని సుధను వేధించేవాడు.

తర్వాత సుధకు 2011లో మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. ప్రస్తుతం వారికి ఓ కుమారుడు ఉన్నాడు.

ఏడాది కిందట ఫేస్‌బుక్‌ ద్వారా మళ్లీ సుధకు పరిచయమైన కార్తీక్ ఆమెను పలు రకాలుగా బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడని సాక్షి రాసింది.

గద్వాలలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కార్తీక్‌.. ఈ నెల 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

తమ కుమారుడు కనిపించడం లేదని కార్తీక్‌ తండ్రి నాగేందర్‌ 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే గుర్తు తెలియని యువకుడి శవాన్ని మేళ్లచెర్వు (99ప్యాకేజీ) గుట్టల సమీపంలో పూడ్చినట్లు శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిందని కథనంలో చెప్పారు.

హత్యకు గురైంది కార్తీక్‌ అని సమాచారం. అయితే.. మృతదేహం దగ్గరకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. శనివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

తనను వేధింపులకు గురి చేసిన కార్తీక్‌ చనిపోయాడనే విషయం తెలిసి ఆందోళనకు గురైన రాగ సుధ, ఆ నేరం తనపైకి వస్తుందనే భయంతో శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కథనంలో రాశారు.

చనిపోయే ముందు తండ్రికి ఫోన్ చేసిన ఆమె తన కుమారుడిని బాగా చూసుకోవాలని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది.

సుధ.. సూసైడ్‌ లెటర్‌లో కార్తీక్‌ తన జీవితంలో చిచ్చురేపాడని, అతడిని వదిలిపెట్టవద్దని రాసిందని సాక్షి కథనంలో రాశారు. పరస్పర విరుద్ధ వాదనలు తెరపైకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కార్తీక్‌ను హత్య చేసింది ఎవరు.. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారని సాక్షి కథనం వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)