You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మేకలు కాసే వ్యక్తికి ఏకే-47 తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..’ - ప్రెస్ రివ్యూ
తెలంగాణలోని సిద్దిపేటలో ఓ వ్యక్తి ఏకే-47 తుపాకీతో మరో వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఉండే గుంటి గంగరాజు, సదానందం.. వరుసకు మామాఅల్లుళ్లు.
వీరిద్దరి కుటుంబాల మధ్య ఎనిమిది సిమెంటు ఇటుకల విషయమై మొదలైన చిన్న గొడవ చినికి, చినికి పెద్దదైంది.
ఈ నెల 4న సాయంత్రం సదానందం ఓ కత్తి తీసుకొని వచ్చి గంగరాజు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. స్థానికుల జోక్యంతో గొడవ సద్ధుమణిగింది.
మళ్లీ ఈ నెల 6న రాత్రి 10 గంటలప్పుడు సదానందం ఏకే-47 తుపాకీతో గంగరాజు ఇంటి కిటికీ వద్దకు చేరుకున్నాడు. గంగరాజు ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుండగానే రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. గంగరాజుకు తూటాలు తగల్లేదు. కాల్పుల చప్పుడు విని చుట్టుపక్కల వారు రావడంతో సదానందం పరారయ్యాడు.
పోలీసులు ఆ స్థలం నుంచి రెండు తూటాలు, వాటి క్యాప్‌లు, సదానందం ఇంట్లో తుపాకీ బెల్టు, తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.
రెండేళ్ల క్రితం హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుంచి ఏకే, కార్బన్ తుపాకులు మాయమయ్యాయి. సదానందం ఇంట్లో దొరికిన తుపాకీ బెల్టుపై 'ఏపీపీ' అని ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ కేసు విషయమై హుస్నాబాద్ ఠాణాకు అతడు తరచూ వెళ్తుండేవాడు.
సదానందం సొంత గ్రామం సిద్దిపేట జిల్లాలోని కోహెడ (నాడు కరీంనగర్ జిల్లా). ఓ పదేళ్లు అతడు అదృశ్యమయ్యాడు. ఈ సమయంలో ఎక్కడున్నాడో, ఏం చేశాడో ఎవరికీ తెలియదు. మావోయిస్టులతో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాది క్రితం వరకు సదానందం మేకలు మేపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆ తర్వాత మందను అమ్మేసుకొని కూలీగా మారాడు.
సదానందాన్ని కోహెడలో పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఏకే-47 తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అక్కన్నపేటలో నిర్వహించిన సోదాల్లో కార్బన్ తుపాకీ దొరికింది.
‘ఏపీలో దాదాపు 20 లక్షల తెల్ల రేషన్ కార్డులకు కోత’
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 20లక్షల తెల్ల రేషన్ కార్డులు తొలగించాలని వైసీపీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చిందంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల గుర్తింపునకు నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన సర్వేలో 18లక్షల మంది తెల్లకార్డులు కలిగి ఉండేందుకు అర్హులు కారని క్షేత్రస్థాయిలో తేల్చారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ప్రజాసాధికార సర్వే సమాచారం, వలంటీర్లతో సర్వే నిర్వహించి ప్రభుత్వం కార్డులు వడపోసింది. అంతకుముందే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 1.38 లక్షల కార్డులను ఒక నెల నిలుపుదల చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం కంటే ఎక్కువ ఉంటే బియ్యం కార్డులకు అనర్హులు. అయితే స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, సఫాయి కర్మచారి వర్కర్లుగా పనిచేస్తూ ఎంత వేతనం పొందుతున్నప్పటికీ వారికి ఆదాయం నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
‘వరంగల్‌కు మైండ్‌ట్రీ’
ఎల్‌అండ్‌టీ అనుబంధ ఐటీ సంస్థ మైండ్‌ట్రీ వరంగల్‌లో కేంద్రం ఏర్పాటుకు ముందుకువచ్చినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది.
వరంగల్‌కు మైండ్‌ట్రీ రాకను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెట్రో ప్రారంభంతోపాటు మరో సంతోషకరమైన విషయం అంటూ శుక్రవారం ట్వీట్‌చేశారు.
"ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి.
తెలంగాణలో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఇప్పటికే రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి. తాజాగా మైండ్‌ట్రీ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది.
మైండ్‌ట్రీ సంస్థ.. గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది" అని కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)