కింగ్ కోఠీ ప్యాలెస్‌ను అమ్మేసిన మోసగాడు ముంబయిలో దొరికాడు - ప్రెస్ రివ్యూ

నకిలీ ధ్రువపత్రాలతో కింగ్ కోఠీ ప్యాలెస్‌ను విక్రయించిన మాయగాళ్లలో ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం తెలిపింది.

''హైదరాబాద్‌లోని వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నిజాం వారసత్వ సంపదను కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థకు సుందరం కొల్రుకుడ్రో రవీంద్రన్, పీ సురేశ్ కుమార్ అమ్మేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన రవీంద్రన్ ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. నిజానికి రూ.300 కోట్ల విలువైన ఈ ప్యాలెస్‌ను మూడేళ్ల క్రితమే నజ్రీ బాగ్ ప్యాలెస్ ట్రస్టు నుంచి నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది. అయితే ఈ ముంబై ఆధారిత నిర్మాణ రంగ సంస్థలోనే పనిచేస్తున్న రవీంద్రన్, సురేశ్ కుమార్‌లు.. ప్యాలెస్‌ను నకిలీ డాక్యుమెంట్లతో ఈ ఏడాది జనవరిలో ఐరిస్ హాస్పిటాలిటీ సంస్థకు అమ్ముకున్నారు. జూన్‌లో ప్యాలెస్ పరిశీలనకు వచ్చిన నిహారిక ఇన్‌ఫ్రా అధికారులకు ఇది తెలిసింది. తమ ప్రాపర్టీ మరో సంస్థ పేరున ఉండటాన్ని చూసి తీగ లాగడంతో మాజీ ఉద్యోగుల బాగోతం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, మోసం, నమ్మకద్రోహం, ఫోర్జరీ అభియోగాల కింద కేసు నమోదైంది. ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులనూ జారీ చేశారు.

28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్.. హైదరాబాద్ చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందినది. 1967లో ఈయన అనారోగ్యం కారణంగా చనిపోయారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లోని ప్రధాన భవనంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది'' అని ఆ కథనంలో తెలిపారు.

'జీవన వ్యయంలో విశాఖ బెస్ట్'

ప్రపంచంలోని 352 నగరాల్లో ప్రజల జీవన వ్యయంపై 'నంబియో' సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీకి చెందిన విజయవాడ, విశాఖపట్నం నగరాలు తక్కువ జీవన వ్యయంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని తేలిందంటూ 'సాక్షి' కథనం తెలిపింది.

''మన దేశంలోని నగరాల్లో జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతున్నా, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నివేదికలో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు 350, 351 ర్యాంకులు దక్కగా.. ముంబై 316, ఢిల్లీ 323, బెంగుళూరు 327, పుణె 328, హైదరాబాద్‌ 333, చెన్నై 334, కోల్‌కతాలు 336 ర్యాంకుల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, బేసల్, లాసన్నె, జెనీవా, బెర్న్‌ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

అద్దెల్లో మాత్రం రివర్స్‌

విజయవాడలో జీవన వ్యయం తక్కువగా ఉన్నా అద్దెలు ఎక్కువగా ఉన్నాయి. అద్దెల్లో విజయవాడ సూచీ 5.01 శాతంగా ఉండగా.. విశాఖ నగరానికి 4.07గా వచ్చింది. లక్నో, సూరత్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, కోయంబత్తూర్, జైపూర్‌ నగరాల్లో అద్దె విజయవాడలో కంటే తక్కువగా ఉంది అని ఆ నివేదిక తెలిపింది.

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు తగవు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఎన్‌బీయే తీవ్ర ఆక్షేపణ

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీయే) తీవ్రంగా తప్పుపట్టిందని.. ఎన్‌బీయే అధ్యక్షుడు రజత్ శర్మ ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాశారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''మీడియా/ప్రెస్‌కు, ముఖ్యంగా వార్తలు, వర్తమాన అంశాలు రాసే మీడియాకు రాజ్యాంగంలోని 19(1)(ఎ) కింద వాక్ స్వాతంత్ర్య, భావ వ్యక్తీకరణ హక్కు ఉందన్న సంగతి తెలిసిందే. అలాగే సమాచారాన్ని పొందే హక్కు ప్రజలకు ఉంది. ఈ హక్కుతో పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. స్వతంత్ర, భయానికి తావులేని, గతిశీల మీడియా నిజమైన ప్రజాస్వామ్యానికి చాలా కీలకం. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీడియా స్వతంత్రత, స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తే అది ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను'' అని లేఖలో ఉన్నట్లు తెలిపారు.

ఇసుక మాఫియాలో వైసీపీ నేతలు.. 67 మంది పేర్లతో జాబితా విడుదల చేసిన టీడీపీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యవేక్షణలో ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించిందని టీడీపీ నాయకులు ఆరోపించారని 'ఆంధ్రజ్యోతి' వార్తాకథనం తెలిపింది.

''టీడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారి పేర్లతో జాబితా(చార్జిషీటు)ను టీడీపీ నేతలు విడుదల చేశారు. జాబితాలో మొత్తం 67 మంది పేర్లు పొందుపరిచారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)