You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- రచయిత, సిండీ సుయ్
- హోదా, బీబీసీ న్యూస్, తైపీ
గత ఏడాది ఫిబ్రవరి 17న హాలీడే కోసం తైవాన్ వెళ్లిన ఒక హాంకాంగ్ యువజంట, అక్కడ ఆనందంగా గడపలేకపోయింది.
అక్కడి నుంచి రావాల్సిన ముందు రోజు రాత్రి ఆ జంట తైపీలోని నైట్ మార్కెట్లో ఒక భారీ పింక్ సూట్‌కేస్ కొని తీసుకొచ్చింది.
వారు బస చేసిన హోటల్ సీసీటీవీ ఫుటేజిలో ఇద్దరూ సూట్‌కేసుతో తిరిగి తమ గదికి రావడం కనిపించింది. ఆ జంటలో 20 ఏళ్ల యువతి పూన్ హ్యూ-వింగ్ కనిపించడం అదే చివరిసారి.
తర్వాత ఉదయం ఫుటేజిలో, గదిని చెక్ అవుట్ చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ 19 ఏళ్ల చాన్ టోంగ్-కై మిగతా లగేజిలతోపాటూ ఆ పెద్ద సూట్‌కేస్ కూడా తీసుకెళ్తూ కనిపించాడు.
కానీ అతడితో కలిసి ఆ గదిలోకి వచ్చిన పూన్ ఏమైందో మాత్రం తెలీలేదు.
చాన్ తర్వాత ఆ సూట్‌కేస్‌తో తైపీ సబ్‌వే స్టేషన్లో తిరగడం కనిపించింది. అదే సాయంత్రం అతడు విమానంలో తిరిగి హాంకాంగ్ కూడా వచ్చేశాడు.
పూన్ తండ్రి తైవాన్‌లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన నెల తర్వాత, కొత్త తైపీ నగరంలో నది పక్కనే ఉన్న రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలో పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది.
"దుర్వాసన వచ్చింది. కానీ, అక్కడ మృతదేహం ఉండవచ్చని ఎవరూ ఊహించలేకపోయారు. కొన్నిసార్లు నదిలో చచ్చిన చేపలు తేలుతుంటాయి. అప్పుడు చాలా దుర్గంధం వస్తుంది. ఇది అదే అనుకున్నాం" అని స్థానికుడు చౌ చెప్పారు.
ఈ కేసుకూ హాంకాంగ్ నిరసనలకు సంబంధం ఏంటి?
నేరస్థుల అప్పగింతలను అనుమతించే వివాదాస్పద బిల్లు ఆధారంగా నిందితుడు చాన్‌ను తమకు అప్పగించాలని తైవాన్ కోరడంతో, హాంకాంగ్ అధికారులు అతడిని అప్పగించాలనుకున్నారు. ఆ బిల్లు ప్రకారం నిందితులను తైవాన్, అంటే చైనాకు పంపించాలి.
అంతకు ముందు బ్రిటిష్ వలస పాలకులు తైవాన్ లేదా చైనాతో ఎలాంటి అప్పగింతల ఒప్పందాలు చేసుకోలేదు. దాంతో ఈ ఒప్పందన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
చైనా మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న న్యాయ వ్యవస్థ కారణంగా 'ఒకే దేశం, రెండు వ్యవస్థల' సూత్రం ప్రకారం ఏర్పడిన హాంకాంగ్ న్యాయ స్వయంప్రతిపత్తికి ఈ బిల్లు ముప్పు తెస్తుందని జనం భయపడ్డారు.
తైవాన్ కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. చాన్‌ను అప్పగించాలని చేసిన అభ్యర్థనను హాంకాంగ్ ప్రభుత్వం బిల్లును తొలగించడానికి ఒక సాకుగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.
దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆ బిల్లును ఉపసంహరించారు. కానీ చాన్ కేసు మాత్రం అనిశ్చితిలో ఉండిపోయింది.
తైపీ హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది?
ఈ కేసు గురించి హాంకాంగ్ హైకోర్ట్ విడుగల చేసిన పత్రాల ప్రకారం చాన్, పూన్ 2017లో కలిశారు. తర్వాత ప్రేమలో పడ్డారు.
ఇద్దరూ తైవాన్ వెళ్లినపుడు పూన్ ఐదు వారాల గర్భవతి. చాన్ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. విమానం టిక్కెట్లు, హోటల్‌కు కూడా అతడే చెల్లించాడు.
ఫిబ్రవరి 16న హోటలుకు తిరిగి వచ్చిన ఇద్దరూ సూట్‌కేసును ఎలా సర్దాలి అనేదానిపై గొడవపడ్డారు. తర్వాత అది సద్దుమణిగినా, ఫిబ్రవరి 17 తెల్లవారుజామున ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు.
ఇద్దరూ కోపంగా అరుచుకుంటున్నప్పుడు "కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి తన మాజీ బాయ్‌ఫ్రెండ్" అనే విషయాన్ని పూన్ బయటపెట్టింది. మరో వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియోను కూడా ఆమె అప్పుడు తనకు చూపించిందని చాన్ చెప్పాడు.
దాంతో చాన్ కోపంగా పూన్ తలను గోడకేసి కొట్టాడు. ఆమె గొంతు పిసికాడు. ఆమె చనిపోయేవరకూ ఇద్దరూ నేలపై పది నిమిషాలపాటు పెనుగులాడారు.
తర్వాత పూన్ మృతదేహాన్ని పింక్ సూట్‌కేసులో కుక్కిన చాన్, ఆమె వస్తువులన్నీ నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో సర్దేశాడు.
ఉదయం, హోటల్ దగ్గర ఉన్న చెత్తకుండీలో పూన్ వస్తువులు పడేసిన చాన్, మృతదేహం ఉన్న సూట్‌కేసును తనతో తీసుకెళ్లాడు.
ఝువే స్టేషన్‌కు వెళ్లిన చాన్ డాన్షూయ్ నది పక్కనే ఉన్న రోడ్డుపై సూట్‌కేసును లాక్కుంటూ వెళ్లాడు. ఆ దారిలో ఒక చోట పొదలు దట్టంగా ఉండడంతో మృతదేహాన్ని తీసి వాటి లోపల పడేశాడు.
సూట్‌కేసు ఇంకెక్కడో పడేశాడు. కానీ పూన్ ఏటీఎం కార్డు, డిజిటల్ కెమెరా, ఐఫోన్ మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు.
తైపీ నుంచి వచ్చేసే ముందు ఆమె ఏటీఎం కార్డుతో 20 వేల తైవాన్ డాలర్లు(46 వేల రూపాయలు), హాంకాంగ్ వచ్చాక అదే కార్డుతో మూడు సార్లు 19,200 హాంకాంగ్ డాలర్లు(లక్షా 74 వేల రూపాయలు) డ్రా చేశాడు.
నేరం ఎలా బయటపడింది?
పూన్ కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన రెండ్రోజుల తర్వాత మార్చి 13న హాంకాంగ్ పోలీసులు చాన్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత మనీ లాండరింగ్ నేరానికి సంబంధించి నాలుగు ఆరోపణల్లో అతడిపై కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో పూన్‌ను హత్య చేశానని ఒప్పుకున్న చాన్, ఆమె శవాన్ని ఎక్కడ పడేశాడో చెప్పాడని కోర్టు పత్రాల్లో వివరించారు.
"నేను, మరో 30 మంది పోలీసులు మూడు గంటలు వెతికిన తర్వాత ఆమె మృతదేహం దొరికింది. మేం మొదట సూట్‌కేసు కోసం వెతికాం. ఆ మృతదేహం ఇంకా సూట్‌కేసులోనే ఉందనుకున్నాం. కానీ మాకు ఆమె శవం కనిపించింది. చాన్ ఆమెను ముక్కలుగా చేయలేదు. సన్నగా, పొట్టిగా ఉండే పూన్ మృతదేహాన్ని అతడు అలాగే సూట్‌కేసులో కుక్కేశాడు" అని అప్పటి ఝువై పోలీస్ అధికారి లియూ గ్వాన్-వూ చెప్పాడు.
మృతదేహం కుళ్లిపోయినా, దానిపై పోలీసులకు ఎలాంట గాయాలూ కనిపించలేదు.
హాంకాంగ్‌లో చాన్ మనీలాండరింగ్ కేసులో నేరాన్ని అంగీకరించాడు. దాంతో, అతడికి 29 నెలల జైలు శిక్ష విధించారు. కానీ హైకోర్ట్ అతడి శిక్షను మూడో వంతుకు తగ్గించింది.
తైవాన్‌లో చాన్ చేశాడని చెబుతున్న నేరం గురించి, అతడు విడుదలయ్యే కొన్ని రోజుల ముందు ఈ ఏడాది అక్టోబర్ 18న హాంకాంగ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అతడి నేరం హాంకాంగ్ కోర్టుల న్యాయ పరిధిలోకి రాదని చెప్పింది.
చాన్ నిర్బంధాన్ని పొడిగించడానికి, తైవాన్‌లో చేసిన అతడు చేశాడని చెబుతున్న నేరంపై దర్యాప్తు చేయడానికి స్థానిక అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది.
అతడు ఎవరికీ అక్కర్లేదు, ఎందుకు?
తైవాన్, హాంకాంగ్ మధ్య ఉన్న వివాదాస్పద సంబంధాలతోపాటూ, తైవాన్, చైనాకు ఉన్న బంధాన్ని ఈ కేసు బయటపెట్టింది. తైవాన్ ప్రావిన్స్ ఏదో ఒక రోజు చైనాలో తిరిగి కలుస్తుందని హాంకాంగ్ ప్రజలు భావిస్తున్నారు.
తైవాన్ సౌర్వభౌమాధికారం గురించి, అది చైనాలో భాగమా, కాదా అనే విషయంపై సుదీర్ఘ వివాదం ఉంది. సాధారణంగా ఇలాంటి అప్పగింత ఒప్పందాలు దేశాల మధ్య జరుగుతాయి. అది చాలా సున్నితమైన విషయం.
బుధవారం చాన్ హాంకాంగ్ జైలు నుంచి విడుదలయ్యాడు. భారీగా గుమిగూడిన మీడియాతో చాన్ మాట్లాడాడు. పూన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. సమాజం కూడా తనను క్షమించాలని కోరాడు.
కానీ తైవాన్, హాంకాంగ్ మధ్య మాత్రం ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.
చాన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసిన తైవాన్ అధికారులు, అతడు స్వయంగా లొంగిపోతానంటే మొదట ఒప్పుకోలేదు.
చైనాపై సందేహాలు
తైవాన్ చైనాలో ఒక భాగంగా అనుకునేలా ఇదంతా బీజింగ్ నడిపించిందని ఆ దేశం సందేహించింది. చాన్‌ను అప్పగించే ముందు, మొదట హాంకాంగ్ న్యాయ సహకార ఒప్పందంపై చర్చలు జరపాలని పట్టుబట్టింది.
హాంకాంగ్ అధికారులు దాననిని కొట్టిపారేశారు. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న చాన్‌ను తీసుకువెళ్లాలని, పూన్, ఆమె కుటుంబానికి న్యాయం అందించాలని తైవాన్‌కు చెప్పారు.
"నేను చాలా హత్య కేసులు చూశాను. కానీ ఇలాంటివి, అంటే రాజకీయ వివాదాలు ఉన్న కేసులు ఎప్పుడూ చూడలేదు. ఈ కేసును త్వరగా ముగిస్తారనే అనుకుంటున్నా" అని పోలీస్ లూ చెప్పాడు.
బహుశా, చాన్ కూడా ఈ కేసు త్వరగా ముగియాలని ఎదురుచూస్తున్నాడు. "నేను ఆవేశంలో ఆ తప్పు చేశాను. లొంగిపోయి తైవాన్ వెళ్లడానికి, విచారణ ఎదుర్కున్నాక జైల్లో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అన్నాడు.
"సమాజానికి, హాంకాంగ్ ప్రజలకు నేను ఒకటే చెప్పగలను. నన్ను క్షమించండి. ఒక కొత్త మనిషిగా మారడానికి, సమాజానికి తిరిగి ఏదైనా చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి" అంటున్నాడు చాన్.
ఇవి కూడా చదవండి:
- వోడ్కా, విస్కీ, వైన్, బీర్, పచ్చి గుడ్డు సొన.. ఇవన్నీ కలిపేసి నీళ్లలా తాగేస్తాడు.. చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?
- హాంకాంగ్ - జుహాయ్ మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
- నుస్రత్ జహాన్‌పై లైంగిక వేధింపులు, హత్యకేసులో 16మందికి మరణ శిక్ష
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- తిర్హుత్ ప్రైవేటు రైల్వే: గాంధీ కోసం మూడో తరగతి బోగీలో టాయిలెట్, నెహ్రూ కోసం 'ప్యాలెస్ ఆన్ వీల్స్'
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)