You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ఈ అర్ధరాత్రి దాటితే కార్మికులను చేర్చుకునేది లేదన్న ప్రభుత్వం :ప్రెస్ రివ్యూ
గడువులోగా విధుల్లో చేరని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
కార్మికులు గడువు(నవంబరు 5 మంగళవారం అర్ధరాత్రి)లోగా విధుల్లో చేరకపోతే మిగిలిన ఐదు వేల బస్సులకు కూడా ప్రైవేటు పర్మిట్లు ఇస్తామని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కేసును విచారిస్తున్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని తెలిపింది.
ఒకవేళ తీర్పు మరోలా ఉంటే.. ఆర్టీసీగానీ, తాముగానీ సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వం చెప్పింది. అదే జరిగితే సాగేది అంతంలేని పోరాటమేనని, అప్పుడు కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది.
విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దానిని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా, వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలను ఇబ్బందులపాలు చేయడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇచ్చాక.. తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేసింది.
ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ప్రగతి భవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమ్మె విషయంలో, కోర్టు విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ భేటీలో చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.
ముూడేళ్ళలో 50 వేల కోట్ల కోత
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సిన నిధులపై కేంద్రం కోతల పరంపరను కొనసాగిస్తోందని ప్రజాశక్తి తెలిపింది. పన్నుల వాటాల్లోనే కాకుండా, ఇవ్వాల్సిన గ్రాంట్లలోనూ భారీగా కోతలు విధిస్తోందని, ఇలా మూడేళ్ల కాలంలో 50 వేల కోట్ల రూపాయల మొత్తానికి కోత పడిందని చెప్పింది.
ఈ పరిస్థితి కేంద్రం నుంచి కచ్చితంగా నిధులు వస్తాయన్న అంచనాతో రూపొందిస్తున్న రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని ఎలా అధిగమించాలన్న అంశంపై ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది.
2016-17 నుంచి 2018-19 వరకు కేంద్రం నుంచి 2,02,797 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 1,53,212 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనా కన్నా 49,585 కోట్లు తక్కువగా వచ్చినట్లు అధికారులు తేల్చారు. గత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 32 వేల కోట్ల రూపాయల మేర రావాల్సిన నిధులు రాలేదు.
ఇటీవల సంవత్సరాల్లో ఒక్క 2015-16లో మాత్రమే బడ్జెటలో చూపిన దాని కన్నా ఎక్కువ నిధులు వచ్చాయి. ఆ ఏడాది దాదాపు 350 కోట్ల రూపాయలు అదనంగా వచ్చాయి. ఆ తరువాత సంవత్సరం నుంచి నిధుల విడుదలలో కోతలు ప్రారంభమైనాయి.
2016-17లో కేంద్రం నుంచి 51 వేల కోట్ల వరకు రావాల్సి ఉండగా, 49 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. 2017-18లో 66 వేల కోట్ల వరకు రావాల్సి ఉరడగా, 15వేల కోట్లు తక్కువగా 51 వేల కోట్లు వచ్చాయి.
2018-19 సంవత్సరంలో మరింత ఎక్కువగా కోత పడింది. 84 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేయగా కేవలం 52 వేల కోట్లు మాత్రమే వచ్చాయి.
ఈ ఏడాది 96 వేల కోట్ల రూపాయల వరకు వస్తాయని అధికారులు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఏడు నెలలు పూర్తయినా కేవలం ఇప్పటివరకు 23 వేల కోట్లు మాత్రమే వచ్చాయి.
ఇక మిగిలిన ఐదు నెలల కాలంలో 20 వేల కోట్ల రూపాయల మించి అదనంగా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని కూడా కలుపుకున్నా ఈ ఏడాది 40 నుంచి 45 వేల కోట్ల రూపాయల కన్నా కేంద్రం నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.
గంజాయికి బానిసలై స్మగర్లుగా మారిన విద్యార్థులు
గంజాయికి బానిసైన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు స్మగ్లర్లుగా అవతారమెత్తారని సాక్షి రాసింది.
శ్రీకాకుళానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన అమర్‌నాథ్ (కారు డ్రైవర్) వేలూరులోని విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారని, వీరంతా అక్కడ చదువుతున్న సమయంలోనే గంజాయికి బానిసలయ్యారని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ డి.ప్రసాద్ సోమవారం నెల్లూరులో చెప్పారు.
మత్తుకు బానిసైన వీరు గంజాయి తామే సరఫరా చేస్తే, తమ అవసరాలు తీరడంతో పాటు అధికంగా డబ్బులొస్తాయని భావించి స్మగ్లర్లుగా అవతారమెత్తారని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలోని తమ స్నేహితుడి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాన వేలూరుకు తరలించేవారని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ.3 వేలకు కొని వేలూరులో రూ.25 వేలకు విక్రయిస్తున్నారని, రెండేళ్లుగా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందని చెప్పారు.
ప్రేయసి పరీక్ష ఫీజు కోసం బైక్ దొంగతనం
ప్రేమించిన అమ్మాయి పరీక్ష ఫీజు కోసం ఓ యువకుడు దొంగగా మారాడని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఆ యువకుడు ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం లేదు. అతడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తన పరీక్ష ఫీజు కోసం తంటాలు పడుతుంటే సాయం చేసేందుకు దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ సోమవారం వెలుగుచూసింది.
పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. చంద్రగిరి మండలంలోని కేఎంఎం కళాశాల వద్ద విద్యార్థి భరత్ తన యమహా బైకుకు తాళాలు పెట్టి మరిచిపోయి తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. తిరిగొచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. చోరీ జరిగినట్లు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అనుమానం వచ్చి బైక్ రికార్డులు అడగ్గా అతడి వద్ద లేవు. అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్ తనది కాదని బీఎన్ కండ్రిగ మండలం నీర్పాకోటకు చెందిన అఖిల్ తన వద్ద రూ.15 వేలకు తనఖా పెట్టాడని చెప్పాడు. అఖిల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ప్రేమించిన అమ్మాయి పరీక్ష ఫీజు కోసమే బైక్‌ను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అఖిల్‌ని అరెస్టు చేసి.. సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు.
శ్మశానం కావాలంటూ శవయాత్ర
శ్మశానం కావాలని కోరుతూ చిత్తూరు జిల్లాలో శవంతో యాత్ర నిర్వహించారని ఈనాడు తెలిపింది.
తవణంపల్లి మండలం నలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన లోకయ్యశెట్టి(63) సోమవారం మరణించారు. ఆయన మృతదేహాన్ని ఖననం చేయడం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ పరిధిలోని శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశాన స్థలం ఆక్రమణకు గురై ఉండటంతో ఖననం చేయలేక మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చిత్తూరులోని జిల్లా కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించారు.
తర్వాత మృతదేహాన్ని ఖననం చేయడానికి వారు గోతిని తవ్వడం మొదలుపెట్టడంతో పోలీసులు అధికారులు అక్కడకు చేరుకున్నారు.
మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేయిస్తామని, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని నరిశెట్టిపల్లికి తరలించారు.
ఇవి కూడా చదవండి
- బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. ప్రైజ్‌మనీతో ఏం చేయబోతున్నారు...
- "విమానం టాయిలెట్లో సీక్రెట్ కెమెరా, పైలెట్లు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు"
- అంతరిక్షంలో ఎక్కువ ఇబ్బంది పడేది పురుషులా.. మహిళలా?
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు.. ఐదో తేదీలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మరో ఐదు వేల రూట్లు ప్రైవేటుకు: కేసీఆర్
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను ఎలా చంపారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)