వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి

    • రచయిత, భరణి భరద్వాజ్
    • హోదా, బీబీసీ కోసం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో దుర్మరణం చెంది ఉండకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఇంత కీలకంగా మారి ఉండేవారే కాదేమో.

2009లో ఆయన మొదటిసారి కడప నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తండ్రి జీవించి ఉంటే ఆయనతోనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ, మహా అయితే ఇప్పుడు మూడోసారి లోక్‌సభకు పోటీ చేసి ఉండేవారు. ఇంకా మాట్లాడితే, కేంద్రంలో మంత్రి అయి ఉండేవారు.

నమ్మినదానికోసం నిలబడే తత్వం

రాజకీయాలు కొత్తగా ఉండాలని, భిన్నంగా ఉండాలని నమ్ముతున్న కొత్త తరం నాయకులకు ప్రతినిధిగా కనిపిస్తారు జగన్. ఇప్పటి వరకు ఆయన అధికారంలో లేరు కాబట్టి ఆయన పాలనా దక్షత గురించి చెప్పుకునే అవకాశం ఇంకా రాలేదు. కానీ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చునని నమ్మే నాయకుడిలాగా కనిపిస్తారు. ఎవరినైనా సరే ఎదిరించి నిలబడే తత్వం కలిగిన వ్యక్తిలా కనిపిస్తారు. కష్టాన్ని నష్టాన్ని భరించి ముందుకు సాగే తత్వం ఆయనది.

రాజకీయాల్లోకి ప్రవేశించిన కొద్ది మాసాలకే తండ్రిని కోల్పోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీతో వైరం తెచ్చుకోవడం, కేసుల్లో ఇరుక్కోవడం, 16 మాసాలు జైలు జీవితం గడపాల్సి రావడం... ఇవేవీ జగన్మోహన్ రెడ్డి సంకల్పాన్ని బలహీనపరిచినట్టు కనిపించదు.

తండ్రి మరణంతో రాష్ట్ర రాజకీయాల్లోకి...

జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో 1972 డిసెంబర్ 21న జన్మించారు. పులివెందులలో కొంత కాలం, ఆ తరవాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో పాఠశాల విద్య అభ్యసించారు. బీకామ్ పట్టభద్రులు. ఆయన చెల్లెలు షర్మిల కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు.

2009లో కడప నుంచి 15వ లోక్‌సభకు ఎన్నిక కావడంద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన కుటుంబం చాలా కాలంగా రాజకీయాలతో ముడిపడిందే. మొదట ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే లోక్‌సభకు ఎన్నికయ్యారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరినీ పలకరించాలని జగన్ అనుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించడం కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 'ఓదార్పు యాత్ర' ప్రారంభించారు. ఈ యాత్ర నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆదేశించింది. అయితే జగన్ ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా 'ఓదార్పు యాత్ర' కొనసాగించారు. 'ఇది తన వ్యక్తిగత వ్యవహారం' అన్నారు.

దీంతో కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోయాయి.

వైసీపీ ఏర్పాటు

2010 నవంబర్ 29న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 45 రోజుల్లోగా తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని 2010 డిసెంబర్ 7న పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించారు. ఇందులో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు. ఆ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5,45,043 ఓట్ల భారీ మెజారిటీతో జగన్ విజయం సాధించారు.

జగన్ మీద అనేక కేసులు దాఖలయ్యాయి. జైలులో కూడా ఉండవలసి వచ్చింది.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన జగన్

ఆ దశలోనే యూపీఏ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా జగన్ జైలులోనే నిరాహార దీక్ష చేశారు. 125 గంటల నిరాహార దీక్ష తరవాత ఆయనకు రక్తంలో చక్కెర శాతం, రక్తపోటు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేర్చింది.

జగన్ తల్లి, అప్పుడు శాసన సభ్యురాలైన విజయమ్మ కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు. జైలు నుంచి విడుదలైన తరవాత జగన్ తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. జగన్, విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు.

యాత్రలతో ప్రజలతో మమేకం

2014లో శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవిచూడవలసి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలోని మొత్తం 175 శాసనసభా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 67 సీట్లే గెలుచుకోగలిగింది. జగన్ ప్రతిపక్ష నాయకుడయ్యారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 2017నవంబర్ 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌లో "ప్రజా సంకల్ప యాత్ర" పేర పాదయాత్ర ప్రారంభించారు. "రావాలి జగన్, కావాలి జగన్" నినాదాలతో ఈ యాత్ర 13 జిల్లాల్లోని 125 అసెంబ్లీ నియోజకవర్గాలలో 430 రోజులు సాగి 2019 జనవరి 9న ముగిసింది. ఈ యాత్ర 3648 కిలోమీటర్ల మేర సాగింది.

తండ్రి మరణానంతరం ఆ దుఃఖంలో మరణించిన వారిని ఓదార్చేందుకు ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా 3648 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాద యాత్ర.. ఇవి రెండూ ఆయనకున్న ప్రజాకర్షణకు నిదర్శనంగా నిలిచాయి.

కాంగ్రెస్‌లోనే ఉండి కేంద్ర మంత్రిగా, ఆ తరువాత అవకాశాన్ని బట్టి ముఖ్యమంత్రిగా కూడా పని చేసే అవకాశాన్ని కూడా కాదనుకుని మాట మీద నిలబడటం కోసం కేసులు ఎదుర్కోవడానికి కూడా వెనుకాడని తత్వం సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలా తక్కువగా ఉంటుంది.

పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే ఎన్నికలు ఎదుర్కొని చాలా స్వల్ప శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరంగా ఉండిపోవడం, పార్టీ తరఫున ఎన్నికై అధికార పక్షానికి 23 మంది శాసన సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులు వలసపోయినా కింది స్థాయి నాయకత్వం, పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా ఉండే నాయకత్వాన్ని అందించగలగడం జగన్మోహన్ రెడ్డి విశిష్టత.

దేశమంతటా ఇప్పుడు రాజకీయ పార్టీలను చికాకు పరుస్తున్న పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఖరి కచ్చితంగా ప్రశంసించదగ్గది. ఇతర పార్టీల తరఫున గెలిచి తరువాత తన పార్టీలోకి మారదల్చుకున్న వారందరికీ జగన్మోహన్ రెడ్డి ఒక షరతు విధించారు. వేరే పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి, దాన్ని ఆమోదింపచేసుకున్న తరువాతే తన పార్టీలో చేరాలన్న నియమం అది. ఇప్పటి వరకూ ఆయన దాన్ని కచ్చితంగా పాటిస్తూ రావడం విశేషం. ఇది దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలకూ ఆదర్శంగా నిలిచే చర్య.

వయసు రీత్యా రాజకీయంగా చాలా భవిష్యత్తు ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)