You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ... ఇమ్రాన్ ఖాన్ చమురు ఆశలు ఆవిరి
పాకిస్తాన్ కరాచీ తీర ప్రాంతంలో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రారంభించినపుడు, అక్కడ భారీగా నిక్షేపాలు లభిస్తాయని ఆశించింది.
కానీ ఈ క్షేత్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రయత్నాలను నిలిపివేస్తున్నట్లు శనివారం పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది.
దీంతో తమ ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
కేక్రా-1 సెక్టార్‌లో ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్( తీరానికి దూరంగా తవ్వకాలు) ఆపేస్తున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది.
సమాచార సంస్థ ఏపీపీ వివరాల ప్రకారం చమురు బావులను అన్వేషిస్తున్న దళం మరికొన్ని రోజుల్లో ఈ బావిని మూసివేయనుంది.
పాకిస్తాన్ ఇంతకు ముందు 17 సార్లు ఈ క్షేత్రంలో చమురు నిక్షేపాలు అన్వేషించేందుకు ప్రయత్నించింది. కానీ అవన్నీ విఫలం అయ్యాయి.
కేక్రా-1 చమురు బావి కరాచీ తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంది. ఇది ఇండస్-జీ బ్లాక్‌లోకి వస్తుంది.
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక ప్రత్యేక సహాయకుడు నదీమ్ బాబర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ "కేక్రా-1లో చమురు అన్వేషణ ఫలితాలు తాము ఆశించినట్లు లేవు" అని చెప్పారు.
పాక్ ప్రధాని ఆశలు ఆవిరి
పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇదే ఏడాది మార్చిలో పాకిస్తాన్‌కు అరేబియా సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు దొరికే అవకాశం ఉందని చెప్పారు.
చమురు, గ్యాస్ అన్వేషణలో పాకిస్తాన్ భారీ నిక్షేపాలకు దగ్గరగా చేరుకుంది, ఇది నిజమైతే దేశ ఆర్థిక సమస్యలన్నీ అంతం అవుతాయని చెప్పారు.
మార్చిలో ఇమ్రాన్ ఖాన్ "పాకిస్తాన్‌కు సహజ వనరులు భారీ స్థాయిలో దొరకాలని, మనమంతా అల్లాను వేడుకోవాలి. ఎక్సాన్‌మొబిల్ నేతృత్వంలోని కన్సార్టియమ్ సముద్ర తీరానికి దూరంగా చేస్తున్న డ్రిల్లింగ్‌తో మన ఆశలన్నీ ఫలించాలి" అన్నారు.
"మన జలాల్లో భారీ నిక్షేపాలు అన్వేషించడానికి మనకు బలమైన అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ తర్వాత మరో లీగ్‌లోకి వచ్చేస్తుంది" అన్నారు.
పాకిస్తాన్ జలక్షేత్రంలో అమెరికా చమురు కంపెనీ ఎక్సాన్‌మొబిల్, ఇటలీ సంస్థ ఈఎన్ఐ చమురు కోసం సంయుక్తంగా తవ్వకాలు జరుపుతున్నాయి. చమురు అన్వేషిస్తున్న ఈ కంపెనీలు సముద్రం అడుగున లోతైన బావిని తవ్వాయి.
పాకిస్తాన్ పెట్రోలియం రిజర్వ్ ఒక సీనియర్ అధికారి "5500 మీటర్ల వరకూ తవ్విన తర్వాత కూడా అందులో ఎలాంటి చమురు నిక్షేపాలూ దొరకలేదు" అన్నారు.
దాంతో, ఇప్పుడు రెండు కంపెనీలు ఈ బావిని మూసివేయాలని నిర్ణయించాయి.
అప్పుడే ఆశలు వదులుకోం
పాకిస్తాన్ జల వనరుల మంత్రి సయ్యద్ అలీ హైదర్ గల్ఫ్ న్యూస్‌తో "మేం చమురు అన్వేషణలతో ఇప్పటివరకూ 18 బావులే తవ్వాం. భారత్ 43 బావులు తవ్వాక వారికి ఫలితం దక్కింది. లిబియాకు 58వ ప్రయత్నంలో చమురు లభించింది. నార్వేలో చమురు దొరుకుతుందని ఎవరికీ ఎలాంటి ఆశలూ లేవు. కానీ అది 1954-63 మధ్యలో 78 బావులు తవ్వింది. భారీ విజయం దక్కించుకుంది" అన్నారు.
ఈ తవ్వకాలకు సుమారు పది కోట్ల డాలర్లు వ్యయం చేశారు. డాన్ వార్తాపత్రిక కథనాల ప్రకారం పెట్రోలియం డివిజన్ అధికారులు ఈ అన్వేషణ డేటాను భవిష్యత్తులో చమురు అన్వేషణల కోసం ఉపయోగించనున్నారు.
ఈ తవ్వకాలు జరుగుతున్నప్పుడు భూకంపానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేశారు. అవి చాలా ప్రయోజనకరమైనవిగా కనిపించాయి.
సముద్రంలో చమురు అన్వేషించడం చాలా సమస్యలతో కూడిన క్లిష్టమైన పని. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం చాలా ప్రమాదకరం. భారత్ దేశంలోని ప్రముఖ చమురు బావి 'బాంబే హై' నుంచి 40కి పైగా ప్రయత్నాలు చేశాక చమురు లభించింది.
పాకిస్తాన్ కేక్రా-1 క్షేత్రంలో ఇటలీ కంపెనీ ఈఎన్ఐ జనవరిలో చమురు కోసం తవ్వకాలు ప్రారంభించింది. దానితోపాటు అమెరికా ప్రముఖ కంపెనీ ఎక్సాన్‌మొబిల్, పాకిస్తాన్ గ్యాస్ కంపెనీలు పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్(ఓజీడీసీఎల్) ఇందులో కలిసి ఈ అన్వేషణలో పాల్గొన్నాయి.
1963 నుంచీ పాక్ అన్వేషణ
మొదట సేకరించిన డేటా ప్రకారం ఇక్కడ చమురు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పారు. తవ్వకాలు ప్రారంభించినప్పుడు చమురు లభించే అవకాశం 13-15 శాతం ఉంది. ఏదైనా క్షేత్రంలో చమురు లేదా గ్యాస్ లభించే గరిష్ట అవకాశాలు 20 శాతం మాత్రమే ఉంటాయి.
చమురు, గ్యాస్ కోసం పాకిస్తాన్ అన్వేషించడం ఇది మొదటిసారి కాదు. 1963లో ఒక అమెరికా కంపెనీ పాక్ జలాల్లో మొట్టమొదటి బావిని తవ్వింది. కానీ ఆ బావిలో ఏం దొరకలేదు.
పాకిస్తాన్ తమ జలక్షేత్రంలో చమురు కోసం చివరిగా 2005లో ప్రయత్నించింది. నెదర్లాండ్స్ కంపెనీ షేల్ 2005లో ఆ బావి తవ్వింది. కానీ అందులో కూడా హైడ్రోకార్బన్ నిక్షేపాలేవీ లభించలేదు.
ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ చమురు అన్వేషణ విఫలమైంది. దీనిని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఆయన ఈ బావిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ అన్వేషణ ఫలిస్తుందని ఆయన ఇప్పటికే సంబరాలు కూడా చేసుకున్నారు.
"అల్లా తలుచుకుంటే ఈ నిక్షేపాలు ఎంత భారీగా ఉంటాయంటే, పాకిస్తాన్‌కు చమురు కొనాల్సిన అవసరమే ఉండదు" అని అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ గత ఆగస్టులో అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆయన అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. దీనిని ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా చెబుతున్నారు.
పడిపోతున్న రూపాయి విలువ
శనివారం పతనమైన పాకిస్తాన్ రూపాయి విలువ ఒక డాలరుకు 150 రూపాయలుగా నిలిచింది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఆరు బిలియన్ డాలర్ల రుణం తీసుకోడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం తర్వాత రూపాయి విలువ పడిపోతూ వస్తోంది.
పాకిస్తాన్ రూపాయి పతనం కొనసాగుతుందని, కానీ అత్యంత దారుణమైన స్థితి ఇంకా ముందుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పాకిస్తాన్ తమ చమురు అవసరాల కోసం చమురు దిగుమతులపైనే ఆధారపడింది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ అవసరాల్లో 85 శాతం చమురు బయటి నుంచే కొంటోంది. స్వయంగా 15 శాతం ముడి చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.
పాకిస్తాన్ తన విదేశీ కరెన్సీ నిల్వల్లో ఒక పెద్ద భాగాన్ని చమురు కొనుగోళ్లకే ఖర్చు చేయాల్సి వస్తోంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రస్తుతం పాకిస్తాన్ కరెంట్ అకౌంట్ లోటు 18 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
- ‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’: ఉబర్
- లోక్-సభ ఎన్నికలు 2019- 'మోదీ భారత్'లో హామీలు నెరవేరాయా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- ‘యుద్ధం వస్తే ఇక మీ దేశం అంతమైనట్లే.. ఇంకెప్పుడూ అమెరికాను బెదిరించొద్దు’ : డోనల్డ్ ట్రంప్
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- వాట్సాప్: సోషల్ మీడియాను సురక్షితంగా వాడుకోవడం ఎలా?
- భయంకరమైన పీడకలలకు రూపం ఇస్తే..
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)