You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్యపై రగులుతున్న కశ్మీరం
- రచయిత, సమీర్ యాసిర్
- హోదా, బీబీసీ కోసం
ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన జమ్మూ కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తోంది. బాధితురాలు గుజ్జర్ ఆదివాసీ సముదాయానికి చెందినది కాగా, నిందితుల్లో అత్యధికులు పోలీసులున్నారు.
సాధారణంగా ఎక్కడైనా రేప్ వంటి ఘోరాలు జరిగితే నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయి. కానీ జమ్మూలో మాత్రం కేసులో అరెస్టైన నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఇద్దరు రాష్ట్ర మంత్రులే వీధుల్లోకొచ్చారు.
ఆ మంత్రులు జాతీయ జెండాలు చేతబట్టుకొని మరీ నిందితులకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ఇది బాగా వివాదాస్పదమైంది.
అసలేం జరిగింది? చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసింది ఎవరు? ఈ కేసు దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలేంటి? వీటిపై శ్రీనగర్ నుంచి జర్నలిస్టు సమీర్ యాసిర్ బీబీసీ కోసం రాసిన కథనం ఇది...
అది జనవరి 17వ తేదీ ఉదయం. ముహమ్మద్ యూసఫ్ పుజ్వాలా తన ఇంటి ముందు కూర్చుని ఉన్నారు.
ఇంతలో పక్కింటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పుజ్వాలా వద్ద ఆగాడు.
ఆయాసపడుతూ పిడుగులాంటి వార్త చెప్పారు.
కనిపించకుండా పోయిన పుజ్వాలా ఎనిమిదేళ్ల కుమార్తె శవం సమీపంలోని అడవిలో దొరికిందని తెలిపాడు.
అసలేం జరిగింది?
పుజ్వాలాది ముస్లింలలో గుజ్జర్ సముదాయానికి చెందిన కుటుంబం. హిందువుల ప్రాబల్యం అధికంగా ఉండే జమ్మూ నగరానికి తూర్పున సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రసనా గ్రామంలో నివాసముంటున్నారు.
గుజ్జర్ సముదాయానికి చెందిన ప్రజలకు గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తి.
హిమాలయ పరిసరాల్లో గొర్రెలు, బర్రెలు, గుర్రాలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.
వీరి ఎనిమిదేళ్ల కూతురు జనవరి 10న కనిపించకుండా పోయింది.
మేత కోసం అడవికి వెళ్లిన గుర్రాలను ఇంటికి తోలుకొచ్చేందుకు వెళ్లింది.
గుర్రాలు ఇంటికొచ్చాయి. కానీ బాలిక రాలేదు.
అడవికెళ్లిన బిడ్డ తిరిగి వస్తుందని సాయంత్రం వరకు తల్లి నసీమా ఎదురుచూసింది.
ఎంతకూ రాకపోయేసరికి ఆ విషయాన్ని తన భర్త పుజ్వాలాకు చెప్పింది.
వెంటనే ఇరుగుపొరుగు వారి సాయంతో చిన్నారి కోసం వెతికారు.
టార్చిలైట్లు, లాంతర్లు పట్టుకుని అడవిలో రాత్రంతా గాలించారు. అయినా జాడ దొరకలేదు.
రెండు రోజుల తర్వాత అంటే జనవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని పుజ్వాలా చెప్పారు.
పైగా 'ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో పారిపోయి ఉంటుంది' అని తిలక్ రాజ్ అనే పోలీసు అధికారి హేళనగా మాట్లాడడంతో తన మనస్సు చివుక్కుమందని ఆయన తెలిపారు.
నిందితుల్లో పోలీసు అధికారులు
బాలిక అదృశ్యం ఘటన గురించి ఆ నోటా, ఈ నోటా గుజ్జర్లందరికీ తెలిసిపోయింది. దాంతో వారు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
దాంతో చిన్నారి జాడ కనిపెట్టేందుకు ప్రభుత్వం ఇద్దరు పోలీసు అధికారులను నియమించింది.
వారిలో ఒకరు 28 ఏళ్ల దీపక్ ఖజూరియా. నిజానికి ఈ కేసులో అతను కూడా నిందితుడే.
కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. అంతటా వెతికారు, కానీ రెండు ప్రాంతాలకు మాత్రం వెళ్లలేదు.
"సంజీ రామ్ నివాసం (బాలిక హత్యకు ప్రణాళిక రచించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఇల్లు)తో పాటు గ్రామంలోని ఆలయంలో పోలీసులు వెతకలేదు" అని జాన్ తెలిపారు.
ఏడు రోజుల తర్వాత చిన్నారి శవం దొరికింది.
"నా బిడ్డను తీవ్రంగా హింసించి చంపేశారు. కాళ్లు విరిచేశారు. గోళ్లు నల్లగా కమిలిపోయాయి. చేయి, వేళ్లపై పచ్చని, ఎర్రని గుర్తులు ఉన్నాయి " అంటూ తల్లి నసీమా బోరున విలపించారు.
కొన్నేళ్ల క్రితం పుజ్వాలా ఇద్దరు కూతుళ్లు ఓ ప్రమాదంలో చనిపోయారు. దాంతో తన బావమరిది కూతురైన ఈ చిన్నారిని వారు దత్తతకు తీసుకున్నారు.
ఇప్పుడు ఈ పాప కూడా లేకుండాపోవడంతో ఆ దంపతులు బోరుమన్నారు.
"నా చిట్టితల్లికి భయంకరమైన నరకం చూపించారని నాకు తెలుసు" అని 52 ఏళ్ల పుజ్వాలా చెమర్చిన కళ్లతో బీబీసీకి చెప్పారు.
పాప పేరు తలచుకుంటూ బిగ్గరగా రోదించసాగింది.
"రేప్ చేసి, హింసించి చంపారు"
జనవరి 23న అంటే, పాప శవం దొరికిన 6 రోజుల తర్వాత జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.
అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిదేళ్ల పాపకు మత్తుమందులు ఇచ్చారు. దాంతో ఆమె సృహ కోల్పోయింది. ఒక ఆలయంలో ఆమెను కొన్ని రోజులు నిర్బంధించారు.
"ఆ తర్వాత చిన్నారిపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు. తీవ్రంగా హింసించారు. చివరికి చంపేశారు" అని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నివేదికలో పేర్కొన్నారు.
"హింసను తట్టుకోలేక ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరిన సమయంలో బండరాయితో రెండుసార్లు తలపై కొట్టి చంపేశారని" దర్యాప్తు అధికారులు తెలిపారు.
60 ఏళ్ల సంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ అధికారి దీనంతటికీ సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.
స్థానిక ఆలయానికి సంరక్షుడిగా ఉన్న సంజీరామ్‌కు సురేందర్ వర్మ, ఆనంద్ దత్తా, తిలక్ రాజ్, ఖజురియా అనే పోలీసు అధికారులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
సంజీరామ్ కుమారుడు విశాల్, మేనల్లుడు రెండుసార్లు ఆ చిన్నారిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఖజురియా సహా మరికొందరు పోలీసులు ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడానికి ముందు రక్తం, బురదతో తడిచిన ఆసిఫా దుస్తులను ఈ పోలీసులు శుభ్రం చేశారని అన్నారు.
"విచారణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చిన్నారిని ఖజురియా రేప్ చేశాడు. తర్వాత చంపేసేందుకు ఆమె మెడను తన తొడలపై పెట్టి చేతులతో బలంగా నులిమారు. కానీ, ఆమె చనిపోలేదు. తర్వాత ఓ మైనర్ అబ్బాయి మోకాలితో అదిమాడు. తర్వాత బండ రాయితో రెండుసార్లు తలపై మోదారు" అని క్రైం బ్రాంచ్ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
అంత్యక్రియల సమయంలో ఏం జరిగింది?
"కూటగ్ గ్రామంలోని తమ సొంత భూమిలో అంత్యక్రియలు చేసేందుకు చిన్నారి శవాన్ని తీసుకెళ్తే, హిందూ మితవాద గుంపులు అడ్డుకున్నారు. అక్కడ ఆ బాలిక అంత్యక్రియలు జరిపితే విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.
దాంతో 7 కిలోమీటర్ల దూరంలోని మరో ఊరిలో అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.
కఠువా నుంచి ముస్లింలను పూర్తిగా వెళ్లగొట్టేందుకే ఈ హత్య జరిగిందంటూ ఓ గోడపై రాసి ఉండటాన్ని చూశాను" అని ఆదివాసీ హక్కుల సంస్థ (ఆల్ ట్రైబల్ కోఆర్డినేషన్ కమిటీ) సభ్యులు నజాకట్ ఖటానా చెప్పారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేసినందుకు పోలీసులు తనను అరెస్టు చేసి, బెదిరించారని ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది తాలిబ్ హుస్సేన్ తెలిపారు.
"విచారణ అధికారుల కథనం ప్రకారం, దశాబ్దాలుగా హిందువులతో కలిసి సామరస్యంగా ఉంటున్న గుజ్జర్లను భయబ్రాంతులకు గురిచేసే ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడ్డారు" నజాకట్ ఖటానా అన్నారు.
అది "కుటుంబ వ్యవహారం"
హిందూ ప్రాబల్యం, బీజేపీకి రాజకీయంగా పట్టున్న జమ్మూ ప్రాంతం నుంచి వెలువడే వార్తాపత్రికల్లో ఈ ఘటనపై వార్తలే రాలేదు. అయితే శ్రీనగర్ నుంచి వెలువడే దినపత్రికలు ఆసిఫాపై జరిగిన దారుణాన్ని పతాక శీర్షికల్లో ప్రచురించాయి.
ఈ విషయం జనవరి చివరిలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో చర్చకొచ్చింది.
గుజ్జర్ నాయకుడు, ఎమ్మెల్యే మియాన్ అల్తాఫ్ ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. హత్యకు గురైన చిన్నారి ఫొటోలు ప్రచురించిన వార్తాపత్రికలను చూపిస్తూ.. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలు దీనిని వ్యతిరేకించారు.
చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య "కుటుంబ వ్యవహారం" అని కఠువా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియా వ్యాఖ్యానించారు. దాన్ని గుజ్జర్ల నేత మియాన్ కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
జాతీయ జెండాతో మంత్రుల నిరసన
ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారులను విడుదల చేయాలంటూ సాంజీరామ్, అంకుర్ శర్మల నేతృత్వంలో 'హిందూ ఏక్తా మంచ్' అనే బ్యానర్లు పట్టుకుని భారీ ర్యాలీ తీశారు.
అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాలతో మరో ర్యాలీలో పాల్గొన్నారు.
హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గుజ్జర్లు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంకుర్ శర్మ వాదిస్తున్నారు.
"వాళ్లు మా అడవులను, నీటి వనరులను కబ్జా చేస్తున్నారు" అని ఆయన బీబీసీతో అన్నారు.
పోలీసు అధికారి దీపక్ ఖజురియాతో గుజ్జర్లకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆయన భూమిని వాళ్లు కబ్జా చేశారు. విచారణ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు" అని బీజేపీ సెక్రటరీ, న్యాయవాది విజయ్ శర్మ చెప్పారు.
ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సోమవారం క్రైం బ్రాంచ్ అధికారులు కోర్టుకు వెళ్లగా, బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి, క్రైం బ్రాంచ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నిందితులను వెనకేసుకొస్తూ "గో బ్యాక్.. గో బ్యాక్, క్రైం బ్రాంచ్ గో బ్యాక్" అంటూ వారు నినాదాలు చేశారు.
అయినా అధికారులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో ఏడుగురు నిందితుల పేర్లను చేర్చినట్టు తెలిపారు.
"బార్ అసోసియేషన్ క్రైం బ్రాంచ్ విచారణను వ్యతిరేకిస్తోంది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం" అని కఠువా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కీర్తి భూషణ్ అన్నారు.
అయితే, న్యాయవాదుల తీరుపట్ల ఆదివాసీ ఉద్యమకారుడు హుస్సేన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
"న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్లు, న్యాయబద్ధంగా సాగుతున్న విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఆయన అన్నారు.
"వీళ్లు నిందితులకు మద్దతుగా నిరసన చేస్తున్నారు. ఈ కేసును జమ్మూలోని కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాం. లేదంటే ఇక్కడ విచారణ జరగడం అసాధ్యం" అని బాధిత కుటుంబం తరఫు న్యాయవాది దీపక్ సింగ్ రాజ్‌వత్ తెలిపారు.
అరెస్టైన పోలీసులకు మద్దతుగా రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ తీయడంపై బాధితురాలి తండ్రి పుజ్వాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లు భారత జాతీయ జెండాలతో ర్యాలీలు తీయడాన్నిచూసినపుడు నా బిడ్డ మరోసారి "అత్యాచారానికి, హత్యకు గురైనట్టు అనిపించింది" అని ఆయన వాపోయారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.