You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రెస్‌రివ్యూ: మోదీ నా కంటే జూనియర్! అయినా సార్ సార్ అన్నా.. చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తన కంటే జూనియర్ అని, అయినా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి సార్.. సార్ అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడానని సీఎం చంద్రబాబు అన్నట్లు సాక్షి కథనం రాసింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు కోసం వెంపర్లాడలేదని, మోదీ తనంతట తాను వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని సానుభూతి చూపారని చెప్పారు.
శనివారం జరిగిన రెండో అఖిల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడిగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని మోదీ ప్రతిపాదించడం వల్లే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు.
ఆనాడే తాము బయటికి వచ్చి ఉంటే మరిన్ని వేధింపులుండేవని, అందుకే ఇన్నాళ్లూ సంయమనంతో ఆగామని తెలిపారు.
మొదటిసారి తాము నరేంద్రమోదీని చాలెంజ్ చేశామని, ఆయన డిక్టేటర్ తరహా నాయకుడని చంద్రబాబు అన్నారు.
హోదా సాధన కోసం సమష్టి పోరాటం!
ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రం మొత్తం ఒకే మాటగా, ఒకే లక్ష్యంతో ఉందన్న సంకేతాల్ని దిల్లీకి పంపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
హోదా కోసం ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్న చర్యలను ఆయన అఖిల పక్ష సభ్యులకు వివరించారు.
టీడీపీ ఎంపీలు ఆదివారం దిల్లీలో ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తారని ఆయన తెలిపారు.
కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.
ఫెడరల్ ఫ్రంట్ ఖాయం!
దేశ రాజకీయాల్లో మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు.
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరాన్ని వారికి కేసీఆర్ వివరించినట్లు తెలంగాణ సీఎంఓ తెలిపింది.
కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఆ రెండు పార్టీలను వ్యతిరేకించే పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించామని సీపీఎం నేతలు చెప్పారు.
ఢిల్లీ వెళ్లినప్పుడు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ ఫోన్‌లో మాట్లాడినట్లు కేసీఆర్ తెలిపారు.
ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేయాలని కేసీఆర్ సీపీఎం నేతలను కోరినట్లు తెలిసింది.
దీనిపై స్పందించిన సీపీఎం నేతలు.. కేసీఆర్ చొరవను అభినందించారు.
జనం బాధలతో దేశం వెలిగిపోతోంది!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్‌పై ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.
''భారత దేశం ప్రపంచ వేదికపై వెలిగిపోతుండవచ్చు! అభివృద్ధి చెందుతుండవచ్చు. కానీ... రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి దేశాన్ని దిగజారుస్తోంది! ప్రజల పట్ల రాజకీయ నేతలకు ఎలాంటి పట్టింపులూ లేకపోవడం వ్యవస్థలను నాశనం చేస్తోంది!" అని పవన్ అన్నట్లు ఆ కథనంలో ఉంది.
"చట్టాలు బలహీనులపై బలంగా... బలవంతులపై బలహీనంగా పని చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది! దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇదే భావనతో ఉన్నారు!'' అని పవన్ ట్వీట్ చేశారు.
పోలవరం అంచనాల పెంపుపై ప్రభుత్వ వివరణ
పోలవరం అంచనాలు సవరించడంపై కేంద్ర జలసంఘం లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ జలవనరుల శాఖ సమాధానాలు సిద్ధం చేసిందని ఈనాడు పేర్కొంది.
2010-11లో అంచనాలు.. టెండర్లు పిలిచేందుకు తాత్కాలికంగా రూపొందించిన ఆకృతుల ఆధారంగా లెక్క గట్టినవని రాష్ట్ర జలవనరుల శాఖ తెలిపింది.
2017-18 అంచనాలే వాస్తవ క్షేత్ర పరిస్థితుల ఆధారంగా రూపొందించినవని వివరించింది. సోమవారం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించనుంది.
పోలవరం ప్రాజెక్టులో సుమారు రూ.58 వేల కోట్లకు అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపింది.
భూసేకరణ, పునరావాసం నుంచి ప్రధాన డ్యాం, కుడి ఎడమ కాలువల్లో పని పరిమాణం బాగా పెరిగిపోవడంపై కేంద్ర జలసంఘం అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ వివరాలను మౌఖికంగా ఇప్పటికే తెలియజేసినా లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక సిద్ధం చేసింది.
వాట్సప్‌లో రిజిస్ట్రేషన్ల సేవలు!
తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో వాట్సప్ సేవలకు శ్రీకారం చుట్టిందని ఈనాడు పేర్కొంది.
ఈ నెల 9వ తేదీ నుంచి 70939 20206 నెంబర్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశాఖ జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీనివాసులు తెలిపారు.
వాట్సప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు!
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన సమాచారం
- స్టాంప్ డ్యూటీ ఎంత చెల్లించాలనే వివరాలు
- సేవలు పొందడంలో ఉన్న సవాళ్లు
- దోచుకోవడం, ఇబ్బందులు సృష్టించే వ్యక్తులపై ఫిర్యాదు చేయొచ్చు.
మహేశ్ అరుదైన నటుడు..అలాగే ఉండనిద్దాం!
"ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి కూడా మహేశ్ చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేదు. ఆయన చాలా అరుదైన నటుడు. అలాగే ఉండనిద్దాం" అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
'భరత్ అనే నేను' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారని సాక్షి పేర్కొంది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ-''మా ఇద్దర్నీ (మహేశ్‌బాబు, ఎన్టీఆర్) ఇలా చూస్తే మీకు (ఫ్యాన్స్)కు కొత్తగా ఉందేమో కానీ మాకు కాదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్, సూపర్‌స్టార్ అంటారు. నేను మహేశ్ అన్నా అంటాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలనీ, రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా" అన్నారు.
మహేశ్‌బాబు, కియారా జంటగా కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రం తెరకెక్కింది. ఇది ఈ నెల 20న రిలీజవుతోంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.