You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రెస్‌రివ్యూ: రాజ్యసభ అభ్యర్థిగా కనకమేడల ఎంపిక వెనక?
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రస్తుత ఎంపీ, కడప జిల్లాకు చెందిన సి.ఎం.రమేష్, పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు, కృష్ణా జిల్లాకు చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌లను ఎంపిక చేసినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
టీడీపీ నుంచి సి.ఎం.రమేష్ అభ్యర్థిత్వంపై శనివారమే స్పష్టత వచ్చింది.
రెండోస్థానానికి గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య పేరు చివరి వరకు పరిశీలనలో ఉంది.
కనకమేడల రవీంద్రకుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
వివిధ రాజకీయ, సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల్ని పరిగణనలోకి తీసుకుని చివరి నిమిషంలో రవీంద్రకుమార్ పేరుని ముఖ్యమంత్రి ఖరారు చేశారు.
రవీంద్రకుమార్ 22ఏళ్లుగా టీడీపీ న్యాయవిభాగంలో సేవలందిస్తున్నారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.
గతంలోనే ఆయనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి భావించారు.
అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వీలుకాలేదు. ఇప్పుడు రాజ్యసభకు ఇద్దర్నే పంపించే అవకాశం ఉన్న నేపథ్యంలో... పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దిల్లీలో ఉన్న అవసరాల దృష్ట్యా రవీంద్రకుమార్ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపారు.
విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు టీడీపీ ఎంపీలు పోరాడుతున్నారు.
ఆ బృందంలో న్యాయ సంబంధిత అంశాల్లో నిపుణుడు ఉంటే మంచిదన్న ఉద్దేశంతోనే రవీంద్రకుమార్‌ను రాజ్యసభకు ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతిలో పవన్‌కల్యాణ్ నివాసం!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామ సమీపంలో పవన్ కల్యాణ్ సొంత ఇంటిని నిర్మించుకోబోతున్నారు.
సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
మురగన్ హోటల్ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.
అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
భవిష్యత్తులో ఈ ఇంటిని జనసేన పార్టీ కార్యాలయంగానూ వినియోగించుకునే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం.
పవన్ కల్యాణ్ సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ఏలూరులో ఆయన ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు.
అమరావతి వేదికగా ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకే పవన్ అమరావతిలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ నెల 14న జనసేన ఆవిర్భావం నేపథ్యంలో 'మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు-అందుకోండి మా ప్రణామాలు' అనే వీడియోను ఇటీవలే విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉంటూనే జాతీయ స్థాయిలో పనిచేస్తా-కేసీఆర్
2019 వరకు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని కేసీఆర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది. దాని ప్రకారం..
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. వచ్చే ఎన్నికల వరకు సీఎం పదవి వీడబోనని కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం స్పష్టమైన గ్యాప్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తీరుతానని చెప్పారు. రాష్ట్రంలో ఉంటూనే జాతీయ స్థాయిలో పనిచేస్తానన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ 2014 సాధారణ ఎన్నికల వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బీజేపీ తరఫున దేశమంతా తిరిగినట్లు.. తాను కూడా అన్ని రాష్ట్రాలను చుట్టి వస్తానన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు, పలు జాతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పారు.
తద్వారా ఏర్పడేది థర్డ్ ఫ్రంట్ కాదని, తమదే మెయిన్ ఫ్రంట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకిరాదని, మోదీ మళ్లీ ప్రధాని కానే కారని చెప్పారు.
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పథకాల పేర్లు మారుతాయే తప్ప, ఒరిగేదేమీ ఉండదన్నారు.
నా తండ్రి హంతకులను క్షమిస్తున్నా-రాహుల్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను పూర్తిగా క్షమించేస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారని సాక్షి ఒక కథనం రాసింది. దాని ప్రకారం..
సింగపూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఇందిర, రాజీవ్ హత్య ఉదంతాలపై స్పందించారు.
'నా తండ్రి హత్య తర్వాత మా కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఏది ఏమైనా నేనూ, నా సోదరి(ప్రియాంక) హంతకులను క్షమించేస్తున్నాం' అని రాహుల్ పేర్కొన్నారు.
'రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు ఖచ్ఛితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ, తండ్రి ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను చనిపోతానని నాన్నమ్మ(ఇందిర) నాతో తరచూ అనేవారు. ఆమె చెప్పినట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రి(రాజీవ్)తో నేను అన్నాను. ఊహించినట్లే జరిగింది. విధి బలీయమైంది' అని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు.
నెల రోజులైనా తాజాగానే టమాటాలు!
టమాటాలు నెలరోజుల పాటు తాజాగా ఉండే పరిజ్ఞానాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు కనిపెట్టారంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. దాని ప్రకారం..
టమాటాలు నెల రోజులైనా తాజాగా ఉండేలా ఐఐటీ-హైదరాబాద్ శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. సెల్యూలోజ్, వెండి నానో కణాలు ఉపయోగించి ఓ నానో పదార్థాన్ని రూపొందించారు.
టమాటాలపై ఫంగస్, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల పాడవుతాయి. వాటిని ఆ నానో పదార్థం నాశనం చేసి 30 రోజుల పాటు నిల్వ ఉండేలా చేస్తుందని మెటీరియల్ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ ముద్రికా ఖండేల్వాల్, డాక్టర్ శివకళ్యాణి చెప్పారు.
'సెల్యూలోజ్‌కు నీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల నానో పదార్థ తయారీకి దీన్ని ఎంచుకున్నాం.' అని ఖండేల్వాల్ తెలిపారు.
పోస్టు ద్వారా తలాక్!
పోస్టు ద్వారా తలాక్ చెప్పారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
హైదరాబాద్ రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఇమ్లిబన్ ప్రాంతానికి చెందిన ఖాదర్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.
ఇదే ప్రాంతానికి చెందిన ఇర్ఫానాబేగంతో గత డిసెంబర్ 11న అతని పెళ్లి జరిగింది.
పెళ్లి జరిగిన రోజే ఖాదర్ ఇర్ఫానాబేగంతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పిన ఖాదర్ ఆమెను తల్లిగారింటికి పంపించేశాడు.
అనంతరం ఇర్ఫానాబేగానికి తలాక్ తెలిపినట్లు ఇటీవల పోస్ట్ ద్వారా లేఖ పంపించారు. విషయం తెలుసుకున్న ఇర్పానాబేగం తనను ఖాదర్ మోసం చేశాడని రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.