You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Sri Lanka: అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెడుతుంటే ఎవరూ ఆపలేకపోయారు
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దేశ అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష అధికారిక నివాసం, ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష వెల్లడించారు.
నిరసనకారులు చుట్టుముట్టినప్పుడు రాజపక్ష, విక్రమసింఘె తమ ఇళ్లలో లేరు.
ఆర్థిక సంక్షోభం నడుమ నెలల నుంచి నిరసనలు చేపడుతున్న వేల మంది ఆందోళనకారులు శనివారం కొలంబోకు చేరుకున్నారు. రాజపక్ష రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిరసనల నడుమ జులై 13న రాజీనామా చేస్తానని రాజపక్ష ప్రకటించారు. మరోవైపు రాజీనామాకు విక్రమసింఘె కూడా అంగీకరించారు. అయితే, ఆయన ఇప్పటికే రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
అధికార బదిలీ సాఫీగా జరగడం కోసం రాజీనామాకు రాజపక్ష అంగీకరించినట్లు పార్లమెంటు స్పీకర్ వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజపక్ష రాజీనామా చేస్తానని ప్రకటించడంతో నిరసనకారులు కొలంబోలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఎందుకీ రాజీనామాలు?
ప్రస్తుత అధ్యక్షుడు, ప్రధాన మంత్రిని ఇంటికి పంపించే సమయం వచ్చిందని రాజపక్ష ఇంటి బయట ఆందోళన చేపడుతున్న ఫియోనా సిర్మన చెప్పారు. దేశానికి కొత్త తరం నాయకులు అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘వారు ముందే రాజీనామా చేయకపోవడం శోచనీయం. వారు ముందే రాజీనామా చేసుంటే పరిస్థితులు ఇంత దిగజారేవి కాదు’’అని ఆమె అన్నారు.
శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ఆహార పదార్థాలు, మందులు, ఇంధనం లాంటి నిత్యవసరాలను దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారకపు నిల్వలు లేవు. గత 70ఏళ్లలో ఇలాంటి విపరీత సంక్షోభాన్ని శ్రీలంక ముందెన్నడూ చూడలేదు.
విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోవడంతో ప్రైవేటు వాహనాల కోసం పెట్రోలు అమ్మకంపై ఆంక్షలు విధించారు. చాలా చోట్ల పెట్రోల్ కోసం ప్రజలు భారీగా వరుసలు కట్టారు.
ప్రధాని నివాసంలో ఏం జరిగింది?
కొలంబోలో-7 ప్రాంతంలోని విక్రమసింఘె ఇంటికీ నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇది కొలంబోలోని హైప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి.
గత శుక్రవారం వరకు విక్రమసింఘె, ఆయన భార్య, పిల్లలు ఇక్కడే ఉన్నారు. అయితే, వీరితోపాటు ఇక్కడ పనిచేస్తున్న అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు ఈ ఇంటి ప్రాంగణంలో భద్రతా సిబ్బంది, బాడీగార్డులు ఎవరూ కనిపించలేదు. మొత్తం అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ భవనాన్ని పూర్తిగా నిరసనకారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వేల మంది నిరసనకారులు లోపలకు ప్రవేశించి దీనికి నిప్పుపెట్టారు.
బీఎండబ్ల్యూ కారు, ఇతర వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఇంట్లోని అన్ని వస్తువులు, గదులకూ నిప్పంటించారు.
మంటలను ఆపేందుకు రెండు అగ్నిమాపక వాహనాలు బయట కనిపించాయి. మరోవైపు ఇక్కడ పోలీసులు, సైనికులు కూడా కనిపించారు. అయితే, నిరసనకారులను వారు నియంత్రించేందుకు ప్రయత్నించలేదు.
అధికారిక నివాసం దగ్గర...
నెలలపాటు నిరసనకారుల ఆందోళనల నడుమ తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
రాజపక్ష అధికారిక నివాసం దగ్గర శనివారం భారీ స్థాయిలో నిరసనకారులు కనిపించారు. రాజపక్ష రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఎగురవేశారు. బారికెడ్లను తోసుకుంటూ వారు లోపలకు ప్రవేశించారు.
నిరసనకారులు లోపలకు ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. మరోవైపు కప్‌బోర్డులలోని వస్తువులన్నీ బయట పడేస్తున్న, విలాసవంతమైన భవనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
‘‘దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, నాయకులు మాత్రం ఇలాంటి విలాసవంతమైన భవనాల దగ్గరకు వచ్చి సేద తీరుతున్నారు. ఇలాంటి విలాసవంతమైన భవనాల్లో ఉంటే ఇంక పనేం చేస్తారు?’’అని నిరసనలు చేపడుతున్న చాణుక్య జయసూరియ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
అసలేం జరుగుతోంది?
ఎథిరాజన్ అంబరాసన్, బీబీసీ న్యూస్, కొలంబో
శ్రీలంకలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
విధ్వంసక హింస, నిరసనల నడుమ రాజీనామా చేసేందుకు అగ్ర నాయకులు అంగీకరించారు.
కొలంబోలోని ప్రధానంగా నిరసనలు జరుగుతున్న ప్రాంగణంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో టపాసులు కాల్చారు.
గాలేఫేస్ నిరసనా ప్రాంగణాన్ని నేను గమనించాను. ఇక్కడ చాలా మంది నిరసనకారులు ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే, ఇప్పటికీ ఇక్కడ వేల మంది ఉన్నారు. వీరు పాటలు పాడుతూ వేడుకలు చేసుకుంటున్నారు.
కొన్ని వారాల క్రితం రాజపక్ష, విక్రమసింఘె నవ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చాలా మందికి తినడానికి తిండి కూడా దొరకడంలేదు, కానీ, వీరు నవ్వుతున్నారని సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరసనల నడుమ ముందు జాగ్రత్తగా శుక్రవారమే అధికారిక నివాసాన్ని రాజపక్ష ఖాళీ చేశారు. ఇది రాజపక్ష అధికారిక నివాసం అయినప్పటికీ, ఆయన నిద్రపోవడానికి వేరే ఇంటికి వెళ్తారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు.
కొలంబోలోని విక్రమ సింఘెకు చెందిన విలాసవంతమైన భవనానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.
ప్రజల ఆగ్రహం నడుమ రాజీనామాకు తాను సిద్ధమని విక్రమసింఘె చెప్పారు. అన్ని పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అన్నారు. అయితే, ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన ఇంటిలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ ఇంటిలోనే ప్రధాన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఉండేవారు. అధికారిక నివాసంలో ఆయన ప్రభుత్వ విధులు మాత్రమే నిర్వర్తించారు.
రాజపక్ష, విక్రమసింఘె రాజీనామాలతో నిరసనకారులు శాంతిస్తారా? అనే విషయంలో స్పష్టంలేదు.
‘‘వీరు రాజీనామా చేసినంత మాత్రన నిరసనకారులు శాంతించరు. వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే, ఈ రాజీనామాలతో ఈ మార్పులు మొదలుకావొచ్చు’’అని కొలంబోలోని మానవ హక్కుల న్యాయవాది భవానీ ఫోన్సెకా చెప్పారు.
ముఖ్యాంశాలు
- భారత్‌కు దక్షిణాన ఉండే శ్రీలంకకు 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. ఇక్కడ సింహళ, తమిళ్, ముస్లిం జనాభా 99 శాతం వరకు ఉంటుంది. మొత్తం జనాభా 2.2 కోట్లు.
- ఏళ్ల నుంచీ ఒక ప్రధాన రాజకీయ కుటుంబమే దేశాన్ని పాలిస్తోంది. 2009లో సింహళీల దృష్టిలో మహింద రాజపక్ష హీరోగా మారారు. తమిళ వేర్పాటువాదులపై ఆయన ఉక్కుపాదం మోపడంతో ఇక్కడి అంతర్యుద్ధానికి ముగింపు పడింది. అప్పట్లో ఆయన సోదరుడు గోటాబయ రాజపక్ష రక్షణ మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు అయ్యారు.
- ఆర్థిక సంక్షోభం నడుమ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో ఆహారం, మందులు, ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితి రాజపక్షే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
- ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)