You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Hirunika Premachandra: 'నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను.. ముగ్గురు పిల్లలను పాలిచ్చి పెంచాను' అని శ్రీలంక మాజీ ఎంపీ హిరుణిక ప్రేమచంద్ర ఎందుకన్నారు?
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
"నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను" అంటూ శ్రీలంక పార్లమెంటు మాజీ సభ్యురాలు హిరుణికా ప్రేమచంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి.
శ్రీలంకలో ఇటీవల జరిగిన ఒక నిరసన సమయంలో హిరుణికను పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో ఆమె స్తనాలు బయటకు కనిపించాయంటూ కొందరు ఎగతాళి చేయడం, సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేయడంతో ఆమె స్పందించారు.
దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైన వ్యాఖ్యను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
"నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను. ముగ్గురు అందమైన పిల్లలకి పాలిచ్చి పెంచాను. వాళ్లను జాగ్రత్త పెంచి పోషించాను. నా శరీరం మొత్తాన్ని వాళ్లకు అంకితమిచ్చాను. నా రొమ్ములు బయటకు కనిపించడం గురించి (పోలీసులతో గొడవ జరిగిన సమయంలో) వెకిలి రాతలు రాసినవారు కూడా తమ తల్లి దగ్గర చనుబాలు తాగే ఉంటారు. నా రొమ్ములను ఎగతాళి చేస్తూ, మీమ్స్ తయారుచేసి నవ్వుకునే లోపల మరోచోట క్యూలో ఇంకో శ్రీలంక పౌరుడు మరణించి ఉంటాడు. తెలుసుకోండి" అని హిరుణిక ఆవేదనతో రాశారు.
కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసం ఎదుట యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యుపీఎఫ్ఎ) మహిళా సంస్థ గురువారం నిరసనలకు దిగింది.
ఈ నిరసనకు హాజరైన హిరుణికా ప్రేమచంద్ర పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరసనకారులు రణిల్ విక్రమసింఘే ఇంట్లోకి చొరబడకుండా పోలీసులు అడ్డుకున్నారు.
అయితే, హిరుణిక పోలీసులను తప్పించుకుని విక్రమసింఘే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో, నిరసనకారులకు, పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ, తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేస్తూ కొందరు హిరుణిక రొమ్ముల గురించి అసభ్యంగా మాట్లాడారు.
దానిపై స్పందిస్తూ హిరుణిక గట్టిగా సమాధానమిచ్చారు. ఆ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
హిరుణిక మాతృత్వాన్ని అవమానించవద్దు - రణిల్ విక్రమసింఘె
ముగ్గురు పిల్లల తల్లి అయిన హిరుణికా ప్రేమచంద్రను అవమానించేలా ఫోటోలను షేర్ చేయవద్దని ప్రధాని రణిల్ విక్రమసింఘే సోషల్ మీడియా యూజర్లను కోరారు.
నాగరిక సమాజం మాతృత్వాన్ని అవమానించకూడదని ఆయన అన్నారు. మాతృత్వ భావన అన్నింటికీ మించినదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ సమస్యల కారణంగా ఆమె తన ఇంటి ముందు నిరసనలకు దిగారని, సిద్ధంతపరంగా సమస్యలు పరిష్కరించుకోవాలిగానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదని ఆయన అన్నారు.
పోలీసులను ఆలింగనం చేసుకున్న హిరుణిక
నిరసన ప్రదర్శన ముగిసిన తరువాత హిరుణిక ఎవరూ ఊహించని రీతిలో స్పందించారు.
బందోబస్తులో ఉన్న పోలీసును ఆలింగనం చేసుకుని హాయిగా మాట్లాడారు.
నిరసన సమయంలో భద్రతా బలగాలను ఎదురించి, వారితో ఘర్షణలకు దిగిన హిరుణిక, ప్రదర్శన తరువాత పోలీసులను ఆలింగనం చేసుకుని మాట్లాడి అక్కడి నుంచి వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎవరీ హిరుణికా ప్రేమచంద్ర?
హిరుణికా ప్రేమచంద్ర శ్రీలంక మాజీ ఎంపీ. ఆ దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుడు భరత్ లక్ష్మణ్ ప్రేమచంద్ర కుమార్తె.
2011లో స్థానిక ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో భరత్ లక్ష్మణ్ ప్రేమచంద్ర హత్యకు గురయ్యారు.
ప్రముఖ రాజకీయ నాయకుడు దుమింద సిల్వాతో సహా ఈ హత్యకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని హిరుణికా ప్రేమచంద్ర ప్రచారాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి హిరుణిక శ్రీలంక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.
2015 ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో యుపీఎఫ్ఎ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ, శ్రీలంక క్రియాశీలక రాజకీయల్లో ఆమె ముందు వరుసలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో, గోటబయ రాజపక్ష సహా రాజపక్ష కుటుంబానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారామె. ఇప్పుడు రణిల్ విక్రమసింఘెను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరీ ఏక్నాథ్? ఒకప్పుడు ఆటో నడిపిన ఆయన ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా ఎలా మారారు
- రాష్ట్రపతి ఎన్నికలు: ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
- భారత్ ఇచ్చింది దానం కాదు, అప్పు అని శ్రీలంక ప్రధాని ఎందుకు అన్నారు
- నేచురల్ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డు పోటీకి వచ్చిన కొన్ని ఉత్తమ చిత్రాలు
- ‘భూకంపంలో చిన్నారులు ఎక్కువమంది చనిపోయి ఉండొచ్చు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)