You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక - రణిల్ విక్రమసింఘే: ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు, కానీ దేశానికి ప్రధాని అయ్యారు.. అసలు ఈయన ఎవరు?
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ తమిళ్ కోసం
శ్రీలంక రాజకీయాల్లో రణిల్ విక్రమసింఘే ఒక ప్రముఖ వ్యక్తి. గత పార్లమెంటరీ ఎన్నికల్లో రణిల్‌కు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది.
గత ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీ నేరుగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ శ్రీలంక జాతీయ జాబితా పార్లమెంటరీ సభ్యత్వం ద్వారా అంటే ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం పార్లమెంట్‌లో ఒక సీటు లభించింది. ఆ స్థానంలో రణిల్ విక్రమసింఘే పార్లమెంటులో అడుగుపెట్టారు.
1949 మార్చి 24న రణిల్ జన్మించారు. నళిని విక్రమసింఘే, ఎస్మాండ్ విక్రమసింఘే ఆయన తల్లిదండ్రులు. కొలంబోలోని రాయల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్, కొలంబో యూనివర్సిటీలో పీజీ చదివారు.
న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన రణిల్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.
రాజకీయ జీవితం
విక్రమసింఘే తన రాజకీయ జీవితాన్ని గంపాహా జిల్లా నుంచి మొదలుపెట్టారు.
1970లో యునైటెడ్ నేషనల్ పార్టీ కెలానియా, బియాగామా నియోజకవర్గాలకు ప్రిన్సిపల్ ఆర్గనైజర్‌గా నియమితులయ్యారు.
బియాగామా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన జేఆర్ జయవర్ధనే క్యాబినెట్‌లో మంత్రిపదవి దక్కించుకున్నారు. ఉపాధి, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
దీనితర్వాతే ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రముఖ నేతగా ఎదిగారు.
1993 మే 1న జరిగిన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో అప్పటి అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస మరణించారు. దీంతో డీబీ విజేతుంగ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు రణిల్‌ను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు.
దీని తర్వాత 2001లో ఆయన రెండోసారి ప్రధాని అయ్యారు.
2015 జనవరిలో అధ్యక్ష ఎన్నికల్లో రణిల్-మైత్రిపాల కూటమి విజయం సాధించడంతో రణిల్ మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
అదే ఏడాది శ్రీలంక పార్లమెంట్ రద్దు అయింది. తర్వాత ఎన్నికలు నిర్వహించగా రణిల్ గెలుపొంది మరోసారి ప్రధాని బాధ్యతల్ని స్వీకరించారు.
2015-2019 కాలాన్ని 'గుడ్ గవర్నెన్స్' పీరియడ్‌గా పిలుస్తారు. అదే సమయంలో తలెత్తిన రాజకీయ గందరగోళ పరిస్థితి కారణంగా అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన అధికారాన్ని ఉపయోగించి రణిల్ విక్రమసింఘే స్థానంలో మహింద రాజపక్సను ప్రధానమంత్రిని చేశారు. అయితే, హైకోర్టు తీర్పు దీనికి విరుద్ధంగా రావడంతో రణిల్, ఐదోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2019 అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స గెలుపొందడంతో, ప్రధాని పదవికి రణిల్ రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లోనే ఆయన పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
అయితే, ఆయన పార్టీకి జాతీయ జాబితా ద్వారా ఒక పార్లమెంట్ స్థానం దక్కింది. దానికి ప్రాతినిధ్యం వహించిన రణిల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
గత కొద్ది నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రజాగ్రహంతో అట్టుడుకుతోన్న శ్రీలంక సామాజిక-రాజకీయ సంక్షోభంలోకి దిగజారింది. ప్రజల నిరసనల నడుమ ప్రధాని మహింద రాజపక్స మే 9న తన పదవికి రాజీనామా చేశారు.
అధ్యక్షుడు గొటాబయ రాజపక్స గత రాత్రి రణిల్ విక్రమసింఘేను కలుసుకునికి ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా కోరారు. దానికి ఆయన అంగీకరించారు. రణిల్ విక్రమసింఘేను కొత్త ప్రధానమంత్రిగా రాజపక్స ప్రకటించారు.
దీంతో శ్రీలంకకు ఆరోసారి ప్రధానమంత్రిగా వ్యవహరించే అవకాశం రణిల్‌కు వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- మహిళల వక్షోజాల నగ్న ఫొటోలతో అడిడాస్ స్పోర్ట్స్ బ్రా ప్రకటనలపై నిషేధం
- పాకిస్తాన్: గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)