శ్రీలంక సంక్షోభం: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు, ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసుల కాల్పులు

శ్రీలంకలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.

ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు భారీ ఆందోళనలు చేపడుతున్నారు.

మంగళవారం రాంబుక్కనలో ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు.

ఇంధన ధరలు పెంచడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు.

పెట్రోల్, డీజిల్‌ కొరతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.

భారీగా పెరిగిన చమురు ధరలు

శ్రీలంకలోని ప్రధాన చమురు పంపిణీ సంస్థ పెట్రోల్ ధరలను 65 శాతం వరకు పెంచింది.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌ ధర రూ.373గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.329గా ఉంది.

దీనిపై ప్రజలు మండిపడుతున్నారు.

రాంబుక్కన పట్టణంలోని ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం 15 గంటలకు పైగా ఆందోళన చేస్తున్నారని బీబీసీ ప్రతినిధి రంగా సిరిలాల్ చెప్పారు.

'నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆందోళనకారులు టైర్లకు నిప్పు పెట్టారు. వాళ్లను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది' అని పోలీసుల అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, చాలామందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

'గాయపడిన ఇద్దరు ఆందోళనకారుల పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తికి బుల్లెట్ తగిలి ఉంటుంది' అని కెగల్లె బోధనాస్పత్రి డైరెక్టర్ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

'బుల్లెట్ గాయమైనట్లు అనుమానిస్తున్నాం. కానీ మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే పోస్టుమార్టమ్ రిపోర్ట్ రావాలి' అని ఆయన అన్నారు.

వేలాది మంది ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు, వాహనదారులు కాండీ నగరంలో రాజధాని కొలంబోకు వెళ్లే హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. టైర్లు కాల్చి రోడ్డుపై వేశారు.

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.

దీంతో ఆహారం, చమురు దిగుమతులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఆ దేశంలో ఉంది.

సరుకులు, చమురుకు తీవ్ర కొరత ఏర్పడింది. ధరలు భారీగా పెరిగాయి.

విద్యుత్ కోత రోజుకు 12 గంటల కంటే ఎక్కువే ఉంటోంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

ఏప్రిల్ ప్రారంభం నుంచి వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ పదవి నుంచి తప్పుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు.

గొటాబయ రాజపక్ష సోమవారం కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

దానిపై చాలామంది శ్రీలంక ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం నిరసనలు చేపట్టారు.

అవినీతి, అధ్యక్షుడి బంధుప్రీతి ప్రస్తుత సంక్షోభానికి కారణమని విమర్శకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)