చైనా అప్పుల ఉచ్చులో పేద దేశాలు చిక్కుకుపోతున్నాయా

    • రచయిత, కాయ్ వాంగ్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

పేద దేశాలకు రుణాలివ్వటంలో చైనా అనుసరిస్తున్న పద్ధతులపై ఎన్నో విమర్శలు, వివాదాలున్నాయి.

చైనా దగ్గర తీసుకున్న అప్పుల్ని తీర్చడానికి పేద దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, దాంతో చివరకు అవి బీజింగ్ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.

అయితే, ఈ ఆరోపణల్ని చైనా తిరస్కరిస్తోంది. ఇది తమ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారమన్నది చైనా మాట.

అంతేకాదు తమ నుంచి అప్పులు తీసుకొని మునిగిపోయిన దేశం ప్రపంచంలో ఒక్కటైనా ఉంటే చూపించండని కూడా సవాల్ చేస్తోంది ఆ దేశం. ఇందులో నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

చైనా ఇస్తున్న అప్పుల కథేంటి?

ప్రపంచంలోని నాలుగు అతి పెద్ద రుణదాత దేశాల్లో చైనా ఒకటి. మధ్యాదాయ దేశాలకు దాని రుణాలు గత దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరిగి, 2020 చివరి నాటికి 170 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

అయితే, చైనా ఇస్తున్న అసలు రుణాల మొత్తం పైన చెప్పిన సంఖ్యకన్నా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఎందుకంటే, వర్ధమాన దేశాలకు చైనా ఇస్తున్న అప్పుల్లో సగం వరకు అధికారిక రుణ రికార్డుల్లో నమోదు కావని ఎయిడ్‌డేటా పరిశోధనలో తేలింది.

ఎయిడ్‌డేటా అనేది అమెరికాలోని విలియం అండ్ మేరీ యూనివర్సిటీకి చెందిన ఓ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ.

ఈ రుణాలను తరచూ ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్లకు దూరంగానే ఉంచుతారు. నేరుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి కాకుండా, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు, బ్యాంకులు, జాయింట్ వెంచర్లు, ప్రైవేటు సంస్థల వైపు అప్పులను మళ్లిస్తారు.

ప్రస్తుతం 40కి పైగా అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో చైనాకు బాకీ ఉన్న రుణాలు ఆయా దేశాల వార్షిక జీడీపీల్లో 10 శాతానికి మించిపోయాయి. ఇదంతా హిడెన్ రుణాల చలవే.

జిబౌటీ, లావోస్, జాంబియా, కిర్గిజ్‌స్తాన్ దేశాల్లోనైతే చైనాకు బకాయిపడ్డ రుణాలు వాటి వార్షిక జీడీపీలో 20 శాతానికి మించిపోయాయి.

ఆయా దేశాలు చైనా నుంచి తీసుకున్న రుణాల్లో చాలా వరకు రోడ్లు, రైల్వేలు, పోర్టులు వంటి భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించినవే. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కింద చేపట్టిన మైనింగ్, ఎనర్జీ పరిశ్రమలకు సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి.

అప్పుల ఉచ్చులేంటి? దానికి ఆధారాలేంటి?

ఇతర దేశాలపై పెత్తనం చేసేందుకు చైనా రుణాల ఉచ్చుల్ని వాడుతుందని బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6 అధిపతి రిచర్డ్ మూర్ బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఇతర దేశాలకు చైనా అప్పులు ఇస్తుంది. ఆ దేశాలు అప్పు తీర్చలేకపోతే, కీలక ఆస్తులపైన అవి నియంత్రణను కోల్పోవాల్సి వస్తుందన్నది బాగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే, ఈ ఆరోపణను బీజింగ్ చాలా కాలంగా తోసిపుచ్చుతూ వస్తోంది.

చైనాను విమర్శించే వాళ్లు తరచూ చూపించే ఒక ఉదాహరణ శ్రీలంక. కొన్నేళ్ల క్రితం హంబటోటాలో చైనా పెట్టుబడితో ఒక భారీ పోర్టు ప్రాజెక్టును ప్రారంభించింది శ్రీలంక.

కానీ వంద కోట్ల డాలర్ల ఆ ప్రాజెక్టు అప్పులు, చైనా కాంట్రాక్టర్ల కారణంగా వివాదంలో కూరుకుపోయింది. ఆ తర్వాత, అది ఏ మాత్రం లాభదాయకం కాదని తేలడంతో పాటు రుణభారంతో కుంగిపోయింది శ్రీలంక.

చైనా నుంచి తీసుకున్న అప్పులకు బదులుగా, చివరకు, 2017లో ప్రభుత్వ నిర్వహణలోని చైనా వ్యాపారులకు పోర్టులో 70 శాతం నియంత్రణను 99 ఏళ్ల లీజుపై ఇవ్వడానికి శ్రీలంక అంగీరించాల్సి వచ్చింది.

అయితే, ఈ పోర్టు ప్రాజెక్టును విశ్లేషించిన బ్రిటన్‌కు చెందిన చాథమ్ హౌజ్ అనే థింక్ ట్యాంక్... దీన్ని 'అప్పుల ఉచ్చు' అనొచ్చా లేదా అనే అంశాన్ని అధ్యయనం చేసింది.

ఈ ఒప్పందాన్ని స్థానిక రాజకీయ ప్రయోజనాల కోసం కుదుర్చుకోవడంతో పాటు, ఈ పోర్టుపై చైనా ఎప్పుడూ అధికారికంగా యాజమాన్యాన్ని చేపట్టలేదు కాబట్టి దీన్ని 'అప్పుల ఉచ్చు' అనడాన్ని ప్రశ్నించింది చాథమ్ హౌజ్.

శ్రీలంక మొత్తం రుణాల్లో ఎక్కువ భాగం చైనాయేతర రుణదాతల నుంచి తీసుకున్నవే. పోర్టు నుంచి వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల్ని పొందటం కోసం చైనా రుణదాతగా తన స్థానాన్ని వాడుకుందనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఈ విశ్లేషణలో తేలింది.

అయినప్పటికీ, గత దశాబ్ద కాలంలో శ్రీలంకలో చైనా ఆర్థిక భాగస్వామ్యం పెరిగిందనడంలో అనుమానం లేదు. ఈ ప్రాంతంలో తన రాజకీయ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా దీన్ని ఉపయోగించుకోవచ్చనే సందేహాలైతే కచ్చితంగా ఉన్నాయి.

ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా చైనా రుణాలు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే, ఆ రుణాల్లో విధించిన షరతుల ప్రకారం కీలక ఆస్తులపైన చైనాకు నియంత్రణాధికారం ఉంటుంది.

కానీ ఎయిడ్‌డేటాతో మరికొందరు పరిశోధకులు వందలాది రుణ ఒప్పందాలను అధ్యయనం చేశారు. అప్పులు తీసుకున్న దేశాలు డిఫాల్ట్ అయిన సందర్భాల్లో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాతలు ఆ దేశాలకు చెందిన కీలక ఆస్తుల్ని చేజిక్కించుకున్న కేసు ఒక్కటి కూడా వీరి పరిశోధనలో బయటపడలేదు.

చైనా అప్పులు మిగతా వాటికి ఎలా భిన్నం?

విదేశీ రుణాల రికార్డులను చైనా ఎక్కడా ప్రచురించదు. దాని కాంట్రాక్టుల్లో చాలావరకు బయటకు వెల్లడించని షరతులుంటాయి. కాబట్టి రుణగ్రహీతలు అప్పుల వివరాలను ఎక్కడా వెల్లడి చేయరు.

అంతర్జాతీయ రుణ ఒప్పందాల్లో ఇలాంటి గోప్యత చాలా సాధారణమైన పద్ధతేనని చైనా అంటోంది. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లీ జోన్స్ కూడా ఇదే మాటంటారు.

ప్రముఖ పారిశ్రామిక దేశాల్లో చాలా వరకు తమ రుణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని 'పారిస్ క్లబ్' అని పిలిచే సభ్యత్వం ద్వారా వెల్లడి చేస్తుంటాయి.

చైనా ఈ గ్రూపులో చేరకూడదని నిర్ణయించుకుంది. అయితే, అందుబాటులో ఉన్న వరల్డ్ బ్యాంక్ డేటాను పరిశీలిస్తే, ఇతరులతో పోలిస్తే చైనా రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగానే అర్థమవుతుంది.

చైనా రుణాలు చెల్లించడం ఎందుకంత కష్టం?

పశ్చిమ దేశాలతో పోలిస్తే చైనా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. దాని వడ్డీ రేటు దాదాపు 4 శాతంగా ఉంటుంది. ఇది దాదాపు కమర్షియల్ మార్కెట్ రేటుకు సమానమైన రేటు. వరల్డ్ బ్యాంక్ లేదా ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు వసూలు చేసే వడ్డీరేటుకు ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.

ఇక అప్పుల్ని తీర్చేందుకు చైనా విధించే గడువు కూడా పదేళ్లకన్నా తక్కువే ఉంటుంది. ఇతర రుణదాత దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు రాయితీలపైన ఇచ్చే రుణాలు తీర్చేందుకు దాదాపు 28 ఏళ్ల గడువు విధిస్తాయి.

అంతేకాదు, రుణగ్రహీతలు ఏదైనా విదేశీ అకౌంట్‌లో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని కూడా చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాతలు కోరుతారు. ఆ అకౌంట్ యాక్సెస్‌ తమకు ఇవ్వాలనే షరతు పెడతారు.

ఎవరైనా అప్పు చెల్లించకపోతే, చైనా చాలా సింపుల్‌గా ఆ అకౌంట్ నుంచి ఫండ్స్ తీసేసుకుంటుంది. మొండి బకాయిల వసూలు కోసం చట్టపరమైన ప్రక్రియ అనుసరించడానికి బదులుగా చైనా అనుసరించే పద్ధతుల్లో ఇదొకటి. పశ్చిమ దేశాల రుణదాతల్లో ఇలాంటి పద్ధతి చాలా అరుదు.

ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పేద దేశాల రుణాలను మాఫీ చేయాలని జీ20 దేశాలు తాజాగా నిర్ణయించాయి. ఈ గ్రూపులో అతి పెద్ద, అత్యంత వేగవంతమైన ఆర్థికవ్యవస్థలుంటాయన్నది తెలిసిందే. చైనా కూడా ఇందులో భాగమే.

అయితే, ఈ పథకంలో భాగమైన మరే దేశంకన్నా ఎక్కువ మొత్తాన్నే తాము రుణ రాయితీ కింద ఇప్పటికే ఇచ్చామని చైనా అంటోంది.

ఈ పథకం కింద 2020 మే నుంచి ఇప్పటి వరకు జీ20 దేశాలు 10.3 బిలియన్ డాలర్లకు పైగా రుణ చెల్లింపుల్లో రాయితీలిచ్చాయని ప్రపంచ బ్యాంక్ అంటోంది.

ఇందులో ఏ దేశం వాటా ఎంత అని వరల్డ్ బ్యాంక్‌ను బీబీసీ అడిగినపుడు, తాము ఆ సమాచారాన్ని వెల్లడి చేయలేమన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)