You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ది సిటీ ఆఫ్ హోప్': హిందూ మహాసముద్రంలో కృత్రిమ ద్వీపం నిర్మాణం.. మాల్దీవులకు ప్రత్యామ్నాయం అవుతుందా?
మాల్దీవులు ఎదుర్కొన్నంతగా ఇంకే దేశమూ పర్యావరణ ముప్పును ఎదుర్కోలేదు.
మాల్దీవుల్లోని విలాసవంతమైన బీచ్ రిసార్ట్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఉండొచ్చు.. కానీ, ఆ దేశంలోని విసిరేసినట్లుగా ఉండే సుమారు 1,200 దీవుల్లో 80 శాతం కంటే ఎక్కువ సముద్ర మట్టానికి మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉంటూ మహాసముద్రం నుంచి ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి.
కానీ, మాల్దీవుల ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాలని నిశ్చయించుకున్నారు. మహాసముద్రం నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి కాపాడుకోవడానికి 'ది సిటీ ఆఫ్ హోప్' అనే ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు. హుల్హుమాలె అనే కృత్రిమ ద్వీపంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు.
సముద్రం నుంచే సాయం
సముద్ర గర్భం నుంచి కోట్ల ఘనపుటడుగల ఇసుకను బయటకు తీసి పోగేసి సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తున ఉండేలా కృత్రిమ దీవిని సిద్ధం చేస్తున్నారు. 1997లో ఈ కృత్రిమ దీవి నిర్మాణం ప్రారంభం కాగా 2019 చివరి నాటికి దానిపై 50 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.
ఈ కొత్త దీవి 2020 ముగిసేలోగా ఈ దీవి 2,40,000 మందికి ఆశ్రయం ఇస్తుందన్న అంచనాలున్నా అంతకుమించి దీనిపై ఆశలున్నాయి.
వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన దీవి
''వాతావరణ మార్పులు, ఆ ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ దీవిని అభివృద్ధి చేస్తున్నారు'' అని 'సిటీ ఆఫ్ హోప్' పనులు పర్యవేక్షించే హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అరీన్ అహ్మద్ చెప్పారు.
''ఇక్కడ నిర్మించే భవనాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉంటాయి. దానివల్ల వేడిమి గ్రహించే అవకాశం తగ్గుతుంది. అలాగే, ఏసీలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించేలా వీధులన్నీ గాలి వీచే దిశలో ఉండేలా నిర్మిస్తున్నారు. స్కూళ్లు, మసీదులు, పార్కులు అన్నీ నివాస ప్రాంతాల్లో 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే ఉంటాయి. నడుచుకుంటూ వెళ్లే దూరంలో ఉండడంత కార్ల వాడకం తగ్గుతుంది''.
ఈ కొత్త నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతాయి, సైకిల్ లేన్‌లుంటాయి. ఈ నగరానికి అవసరమైన విద్యుత్‌లో మూడో వంతు సౌరశక్తి నుంచి అందుతుంది. అలాగే జలభద్రత కోసం వర్షపు నీటి సంరక్షణ పద్ధతులు కూడా అమలు చేస్తున్నారు.
మరి, ఇలా కృత్రిమ ద్వీప నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలగదా? పగడపు దిబ్బలు, సహజసిద్ధమైన శ్వేత వర్ణపు ఇసుకతో నిండిన తీరాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో కృత్రిమ ద్వీప నిర్మాణం సరైనదేనా?
''భూపునరుద్ధరణ పనులు సమస్యాత్మకమే'' అని నార్త్‌అంబ్రియా యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎన్విరానమెంటల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ హోలీ ఈస్ట్ అన్నారు. పగడపు దిబ్బలకు సంబంధించిన వ్యవహారాల్లో నిపుణాడాయన.
''ఈ చర్య అక్కడి పగడపు దిబ్బలను నాశనం చేయడమే కాకుండా ఆ అవక్షేపాలు సూర్యరశ్మిని అడ్డుకుని ఇతర పగడపు దిబ్బలపై ప్రభావం చూపుతాయి'' అన్నారాయన.
ఆశయం పెద్దదే..
అయితే, పెరుగుతున్న జనాభాకు ఆవాస అవసరాలు తీర్చడానికి భూపునరుద్ధరణపై మాల్దీవులు ఆధారపడుతోంది.
2020 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గ్రేటర్ మాలె ప్రాంతంలో, మరీ ముఖ్యంగా హుల్హుమాలెలో సహజ ఆవాసాలు లేవు.
మాల్దీవుల ప్రజల జీవనం మెరుగుపరచడానికి హుల్హుమాలె నిర్మిస్తున్నప్పటికీ వాతావరణ మార్పుల కాలంలో మానవాళికి కొత్త ఆశగా మారడానికి ద్వీప నిర్మాణానికి ఇది దారులు వేసింది.
ఇవి కూడా చదవండి:
- #BBCShe: విజయవంతమైన కులాంతర వివాహాల్ని మీడియా ఎందుకు చూపదు?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- విచారాన్ని, ఒత్తిడిని మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)