కరోనావైరస్ వల్ల కంటి సమస్యలు వస్తున్నాయా?

    • రచయిత, దీప్తీ బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న కొందరిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.

కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత రెటీనా వ్యాస్కులర్ బ్లాక్ అంటే కంటి రక్త నాళాల్లో అడ్డంకి ఏర్పడటం వంటి సమస్య ఎదురవుతోందని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలోని సువెన్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజా నారాయణ బీబీసీతో అన్నారు.

"కరోనా సోకిన వారిలో వెంటనే ఈ రోగ లక్షణాలు ఉండవని అంటున్నారు. కానీ, రోగి కోలుకున్న నెల రోజుల తర్వాత కంటి చూపు మసకబారడం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి" అని ఆయన చెప్పారు.

"అందరికీ ఈ సమస్య వస్తుందని లేదు. నేను చూసిన వారిలో ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ఇబ్బంది వస్తోంది. దీనికి చికిత్స ఉంది" అని రాజా నారాయణ అంటున్నారు.

కరోనా సోకిన రోగులకు ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ను నియంత్రించేందుకు, రక్తం గడ్డకుండా ఉండేందుకు స్టెరాయిడ్లు వేస్తారు. ఇవి కూడా కంటి సమస్యకు కారణమవుతాయని అంటున్నారు రాజా నారాయణ.

"ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే స్టెరాయిడ్ల వల్ల కంటి సమస్యలు ఉత్పన్నమవ్వడం అసాధారణం కాదు. కరోనా సోకిన వారు స్టెరాయిడ్లు వాడటంతో, వారిలో కూడా ఇదే సమస్య వస్తోంది" అని అన్నారు.

కోవిడ్ వచ్చి కోలుకున్న వారు తమ కంటి చూపు మసకబారిందా అన్న విషయం గమనించుకోవాలని ఆయన సూచించారు.

"ఎలాంటి నొప్పి కానీ, కన్ను ఎరుపెక్కడం కానీ ఉండదు. కేవలం కంటి చూపు మసకబారుతుంది. అలాంటి లక్షణం గమనించాక, ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. దీనికి చికిత్స ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని డాక్టర్ రాజా నారాయణ చెప్పారు.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే కంటి చూపు పోయే ప్రమాదం ఉందంటున్నారు డాక్టరు.

ముంబయిలో కూడా కరోనా నయమైనవారిలో ఇదే సమస్యను అక్కడి వైద్యులు గమనించినట్లు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ అక్టోబర్ సంచికలో కథనం వచ్చింది.

"కరోనావైరస్ ద్వారా ఉత్పన్నమయ్యే ఇతర ఆరోగ్య సమస్యలపై పూర్తిగా అవగాహన రావాల్సి ఉంది. కరోనా కారణంగా రెటీనల్ వ్యాస్కులర్ బ్లాక్ సమస్య వస్తున్నట్లు మేం నిర్ధారించాం. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అప్రమత్తత అవసరం" అని ముంబయికి చెందిన డాక్టర్ జె.ఉమెద్ శేత్, డాక్టర్ రాజా నారాయణ కలిసి రాసిన రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ పరిణామంపై ఆరోగ్య శాఖ అధికారులు, ఐసీఎంఆర్ అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)