యూరప్ వరదలు: జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లు అతలాకుతలం

యూరప్‌లోని జర్మనీ, బెల్జియం సహా వివిధ దేశాలలోని ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటివరకు 180 మందికి పైగా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

పెద్దసంఖ్యలో ప్రజలు గల్లంతవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో చేరిన బురదను తొలగించుకుంటున్నారు. రోడ్లపై, ఇళ్ల వద్ద నీటిలో మునిగిపోయిన కార్లు, ఇతర వాహనాలను గ్యారేజ్‌లకు తరలిస్తున్నారు.

శనివారం కూడా యూరప్‌లోని అనేక ప్రాంతాలలో వరదల ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు.

ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌లోని పలు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది.

దీంతో ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను సహాయ బృందాలు రక్షించాయి.

ఎటుచూసినా నీరే

దక్షిణ జర్మనీని ముంచెత్తిన భారీ వర్షాలు ఇప్పుడు ఎగువ జర్మనీలోని బవేరియా ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

అక్కడి రోడ్లు, భవనాల బేస్‌మెంట్లు అన్నీ నీట మునిగాయి.

పశ్చిమ జర్మనీలోని స్టీన్‌బచ్‌తాల్ డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వాతావరణ మార్పులే ఈ వరదలకు కారణమని యూరప్ నాయకులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్‌లో వరదలకూ వాతావరణ మార్పులే కారణమంటున్నారు.

ఒక్క జర్మనీలోనే 143 మంది మృతి

జర్మనీలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది సహా 143 మంది మరణించారు.

వెస్ట్ ఫాలియా, రీన్‌లాండ్, సార్లాండ్ తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇళ్లలో చేరిన బురదను తొలగించే పనిలో పడ్డారు ప్రజలు. ఈ పట్టణాలలో రోడ్లన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

విద్యుత్, గ్యాస్ సరఫరా వ్యవస్థలు ఇంకా పునరుద్ధరించలేదు. కమ్యూనికేషన్ల వ్యవస్థలూ పునరుద్ధరణకు నోచుకోలేదు.

నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లోనూ..

ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా నుంచి జర్మనీకి సహాయ బృందాలు చేరుకుని సేవలందిస్తున్నాయి.

ఆకస్మికంగా వరదలు రావడంతో పెద్దఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన లీగ్ పట్టణానికి ఇతర యూరప్ దేశాల నుంచి సహాయ బృందాలు చేరుకున్నాయి.

మరోవైపు నెదర్లాండ్స్‌లోని లింబర్గ్ ప్రావిన్స్‌ను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

స్విట్జర్లాండ్‌లోనూ నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. రాజధాని బెర్న్‌లో ప్రవహించే నది పోటెత్తడంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

లూసెర్న్ సరస్సు నిండిపోయి సమీప ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రైన్ నదికి వరదలు రావడంతో బేసెల్ నగర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.

జర్మనీలోని ఓ పట్టణంలో వరద కలిగించిన నష్టాన్ని పై చిత్రంలో చూడొచ్చు. వరదలకు ముందు, వరదల తరువాత ఆ ప్రాంతం ఎలా ఉందో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)