ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు: ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరుగుతాయి

2002లో రాణి స్వర్ణోత్సవం సందర్భంగా నావల్ యూనిఫామ్‌లో ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002లో రాణి స్వర్ణోత్సవం సందర్భంగా నావల్ యూనిఫామ్‌లో ప్రిన్స్ ఫిలిప్

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ ఏప్రిల్ 9న 99 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వాటి గురించి పూర్తి సమాచారం ఇది...

అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి?

ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ఏప్రిల్ 17, శనివారం నాడు స్థానిక సమయం 15.00 గంటలకు విండ్సర్ ప్యాలెస్‌లో ఉన్న సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరగనున్నాయి.

తన అంత్యక్రియలు సాదాసీదాగా జరగాలని డ్యూక్ కోరుకున్నట్లు సమాచారం. ఆయన కోరికను అనుసరిస్తూ, విండ్సర్ ప్యాలెస్‌లో ఉన్న ఆయన భౌతికకాయాన్ని ప్రదర్శనకు ఉంచలేదు.

ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని టీవీల్లో ప్రదర్శించనున్నారు.

సెయింట్స్ జార్జ్ చాపెల్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, సెయింట్స్ జార్జ్ చాపెల్

అంత్యక్రియలకు ఎవరెవరు హాజరవుతారు?

ఇంగ్లండ్‌లో అమలులో ఉన్న కరోనా నిబంధనల దృష్ట్యా కేవలం 30 మంది మాత్రమే, భౌతిక దూరం పాటిస్తూ, ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

ప్రిన్స్ హ్యారీ కూడా హాజరు కానున్నారు. ఆయన భార్య మేఘన్ గర్భవతి కావడంతో అమెరికా నుంచి బ్రిటన్‌కు ప్రయాణం మంచిది కాదని వైద్యులు సూచించినట్లు సమాచారం.

గత ఏడాది, బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగిన తరువాత ప్రిన్స్ హ్యారీ ఇదే తొలిసారి బ్రిటన్ రావడం.

బ్రిటిష్ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అంత్యక్రియలకు హాజరు కానున్న వారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాకు అధికారిక లాంఛనాలతో కాకుండా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆరోజు, ముందుగా ప్రిన్స్ ఫిలిప్ పార్థివ దేహాన్ని ప్రైవేట్ చాపెల్ నుంచి తీసుకు వచ్చి విండ్సర్ ప్యాలెస్ అధికారిక ప్రవేశద్వారం వద్దనున్న లాండ్ లోవర్ వాహనంపై ఉంచుతారు. ఈ వాహనాన్ని ప్రిన్స్ ఫిలిపే డిజైన్ చేశారు.

అదే వాహనంపై ఆయన భౌతిక కాయాన్ని దగ్గర్లోనే ఉన్న సెయింట్ జార్జ్ చాపెల్‌కు తీసుకు వెళతారు.

విండ్సర్ క్యాసిల్ వద్ద పుష్పగుచ్ఛాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, విండ్సర్ క్యాసిల్ వద్ద పుష్పగుచ్ఛాలు

ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ఎప్పుడు ప్రసారం చేస్తారు?

ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల కార్యక్రమాన్ని బీబీసీ న్యూస్ వెబ్‌సైట్, యాప్‌లలో స్థానిక సమయం 7.00 గంటల నుంచి లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని బ్రిటన్‌లోనూ, అంతర్జాతీయంగా కూడా ప్రసారం చేస్తారు.

శనివారం స్థానిక సమయం 12.30 గంటల నుంచి బీబీసీ వన్, బీబీసీ న్యూస్ ఛానల్, బీబీసీ ఐప్లేయర్‌లలో టీవీ కవరేజ్ మొదలవుతుంది.

రేడియో 4, రేడియో 5 లైవ్, బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇంగ్లిష్, బీబీసీ రేడియో స్కాట్‌లాండ్, బీబీసీ రేడియో అల్స్టర్‌లలో స్థానిక సమయం 14.00 నుంచి 16.10 వరకు రేడియో ప్రసారం ఉంటుంది.

బీబీసీ రేడియో వేల్స్, బీబీసీ లోకల్ రేడియోలలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. అయితే, టైమింగ్స్ ఇంకా నిర్థారించలేదు.

ప్రిన్స్ ఫిలిప్

అంత్యక్రియలు ఎన్ని గంటలకు జరుగుతాయి?

స్థానిక సమయం 14.15 గంటలకల్లా విండ్సర్ ప్యాలెస్‌లో చతురస్రాకారంలో ఉన్న ప్రాంతానికి అశ్విక దళం, ఫుట్ గార్డులు, మిలటరీ దళాలు చేరుకుంటాయి.

14.20 నుంచి ఊరేగింపులో పాల్గొనని కుటుంబ సభ్యులు కారులో సెయింట్ జార్జ్ చాపెల్‌కు చేరుకుంటారు.

14.40 కు బ్యాండ్ ఆగిపోతుంది. ప్రిన్స్ ఫిలిప్ భౌతిక కాయాన్ని లాండ్ రోవర్‌పై ఉంచుతారు.

ప్రిన్స్ ఛార్లెస్, ఆండ్రూ, ఎడ్వర్డ్, ప్రిన్సెస్ ఆనీలతో పాటుగా మనుమలు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ కూడా లాండ్ రోవర్ వెంట నడుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు.

వారితో పాటూ ప్రిన్సెస్ ఆనీ కుమారుడు పీటర్ ఫిలిప్స్, భర్త వైస్ అడ్మైరల్ సర్ టిమ్ లారెన్స్, ఎర్ల్ ఆఫ్ స్నోడౌన్ కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారు.

వారి వెనుక డ్యూక్ ప్రైవేట్ సెక్రటరీ బ్రిగేడర్ ఆర్చీ మిల్లర్ బేక్‌వెల్, ఒక వ్యక్తిగత రక్షణ అధికారితో సహా డ్యూక్ సిబ్బంది నడుస్తారు.

14.45కు ఊరేగింపు మొదలవుతుంది.

క్వీన్ ఊరేగింపు వెనుక స్టేట్ బెంట్లేలో ప్రయాణించి గలీలీ పోర్చ్ ద్వారా సెయింట్ జార్జ్ చాపెల్‌లోకి ప్రవేశిస్తారు.

ఊరేగింపు దారిలో రాయల్ నేవీ, రాయల్ మరీన్స్, ది హైలాండర్స్, ఫోర్త్ బెటాలియన్ రాయల్ రెజిమెంట్ ఆఫ్ స్కాట్‌లాండ్, రాయల్ ఎయిర్ ఫోర్స్ దళాలు నిల్చుంటాయి.

ఈస్ట్ లాన్ నుంచి కింగ్ ట్రూప్ రాయల్ హార్స్ ఆర్టిలరీ తుపాకులు పేలుస్తూ గౌరవ వందనం చేస్తారు.

14.53 గంటలకు లాండ్ రోవర్ సెయింట్ జార్జ్ ఛాపెల్ చేరుకుంటుంది. అక్కడ రైఫిల్స్ రెజిమెంట్ బ్యాండ్ జాతీయ గీతం వాయిస్తూ గౌరవ వందనం చేస్తారు.

డ్యూక్ భౌతిక కాయాన్ని చాపెల్‌లోనికి తీసుకుని వెళతారు.

రాజకుటుంబం సభ్యులు మాత్రమే చాపెల్‌లోనికి వెళతారు. మిగిలిన వారంతా బయటే నిల్చుంటారు.

15.00 గంటలకు డ్యూక్‌కు నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క నిముషం పాటూ మౌనం పాటిస్తారు.

ఈ ప్రక్రియ, కింగ్ ట్రూప్ రాయల్ హార్స్ ఆర్టిలరీ గన్ ఫైర్‌తో ప్రారంభమై, వారి గన్ ఫైర్‌తోనే ముగుస్తుంది.

చాపెల్‌ లోపల అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుంది. చర్చిలోని సంగీత బృందం డ్యూక్ ఎంచుకున్న గీతాలను ఆలపిస్తారు.

ప్రార్థనల అనంతరం డ్యూక్ పార్థివ దేహాన్ని రాయల్ వాల్ట్‌లో సమాధి చేస్తారు.

బ్రిటిష్ ఎంపైర్ బ్రెస్ట్ స్టార్, బ్యాడ్జ్, కాలర్‌లను ప్రదర్శిస్తారు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ ఎంపైర్ బ్రెస్ట్ స్టార్, బ్యాడ్జ్, కాలర్‌లను ప్రదర్శిస్తారు

జెండా, చిహ్నాలు

డ్యూక్ శవపేటికను ఆయన వ్యక్తిగత జెండాలో చుట్టిపెడతారు. గ్రీకు వారసత్వం నుంచి బ్రిటిష్ బిరుదుల వరకు ఆయన జీవితంలోని అంశాలను ఈ జెండా సూచిస్తుంది.

ప్రిన్స్ ఫిలిప్ జీవితాన్ని ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను చాపెల్ ఆల్టర్‌పైనున్న కుషన్లపై ఉంచుతారు.

దేశ ప్రజలు ఎలా నివాళులు అర్పిస్తారు?

కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు హాజరు కావొద్దని పబ్లిక్‌ను కోరారు.

అలాగే, పుష్పగుచ్చాలను, నివాళికి సూచనగా ఇతర సామాగ్రిని రాయల్ నివాసం వద్ద ఉంచి వెళ్లొద్దని రాజకుటుంబం దేశ ప్రజలను అభ్యర్థించింది.

అందుకు బదులుగా ఆ సొమ్మును ఛారిటీకి వినియోగించమని రాజకుటుంబ వెబ్‌సైట్‌లో సూచించారు.

అంతే కాకుండా, వ్యక్తిగత నివాళులు అర్పించేందుకు ఆన్‌లైన్‌లో ఒక పుస్తకాన్ని ఉంచారు.

అంత్యక్రియల అనంతరం ఏం జరుగుతుంది?

అంత్యక్రియల రోజున జాతీయ సంతాప దినాలు ముగుస్తాయి.

రాజకుటుంబం మాత్రం రెండు వారాల సంతాప దినాలను కొనసాగిస్తారు. నల్లటి సంతాప సూచికలను ధరించి ఇతర కార్యక్రమాలకు హాజరవుతారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)