ప్రిన్స్ ఫిలిప్: డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాకు బ్రిటన్ వ్యాప్తంగా తుపాకులతో గౌరవ వందనం

ప్రిన్స్ ఫిలిప్

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా‌ మృతికి నివాళిగా బ్రిటన్ వ్యాప్తంగా, జిబ్రాల్టర్‌లో, సముద్రంలోని యుద్ధ నౌకల నుంచి తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు.

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ప్రిన్స్ ఫిలిప్ శుక్రవారం మరణించారు.

బ్రిటన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి నిమిషానికి ఒక రౌండ్ చొప్పున మొత్తం 41 రౌండ్లను కాల్చి వందనం సమర్పించారు.

లండన్, ఎడిన్‌బరా, కార్డిఫ్, బెల్‌ఫాస్ట్ సహా యూకేలోని అన్ని నగరాల్లో, హెచ్ఎన్ఎస్ డైమండ్, హెచ్ఎన్ఎస్ మాంట్రోస్ సహా సముద్రంలోని రాయల్ నేవీ షిప్‌ల నుంచి కూడా డ్యూక్‌కు గౌరవంగా వందనం సమర్పించారు.

డ్యూక్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నేవీలో అధికారిగా పనిచేశారు.

తుపాకుల వందనం ఎక్కడెక్కడంటే

''తాను ఎంతగానో ప్రేమించే తన భర్త మరణాన్ని రాణి తీవ్రమైన దుఃఖంతో ప్రకటిస్తున్నారు'' అని బకింగ్‌హామ్ ప్యాలస్ శుక్రవారం డ్యూక్ మరణాన్ని ప్రకటించింది.

సాయుధ దళాలకు డ్యూక్ ''గొప్ప స్నేహితుడు, రోల్ మోడల్, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి" అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్ అన్నారు.

1901లో విక్టోరియా రాణి, 1965లో విన్‌స్టన్ చర్చిల్ మరణించినప్పుడు కూడా ఇలాగే తుపాకులతో వందనం సమర్పించారు.

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాకు బ్రిటన్ వ్యాప్తంగా తుపాకులతో గౌరవ వందనం

ఫొటో సోర్స్, AFP

వచ్చే శనివారం నాడు డ్యూక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలస్ ప్రకటించింది.

సెయింట్ జార్జ్ చాపెల్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. అయితే, కోవిడ్ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లలో పలు మార్పులు చేసినట్లు కాలేజ్ ఆఫ్ ఆర్మ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

డ్యూక్ కోరిక ప్రకారం ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా రాజరిక సంప్రదాయ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ కారణంగా అంత్యక్రియలకు ప్రజలెవరూ హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు.

డ్యూక్ అంత్యక్రియలు జరిగిన మరునాడు ఉదయం 8 గంటలు(బ్రిటిష్ కాలమానం) వరకు ఆయనకు నివాళిగా అన్ని ప్రభుత్వ భవనాలపైనా జెండాలను సగానికి అవనతం చేస్తారు.

డ్యూక్ జీవితంలో ప్రతి ఏడాదికి గౌరవం సమర్పిస్తూ వెస్ట్ మినిస్టర్స్ అబే చర్చి గంటలను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి నిమిషానికి ఒకసారి చొప్పున 99 సార్లు మోగించారు.

డ్యూక్‌కు జాకీ క్లబ్‌లో గౌరవ సభ్యత్వం ఉన్నందున అయింట్రీ రేస్‌కోర్స్‌లో ఆయనకు గుర్తుగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు.

సంతాప సందేశాలు

యూకే వ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులకు డ్యూక్‌కు నివాళులర్పించారు.

మే 6 నాటి ఎలక్షన్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలనూ రాజకీయ పార్టీలు వాయిదా వేసుకున్నాయి.

సోమవారం మధ్యాహ్నం 2.30కి(బ్రిటిష్ కాలమానం) ప్రతినిధుల సభను సమావేశపరిచి బ్రిటన్ పార్లమెంటు ఆయనకు నివాళి అర్పిస్తుంది.

''యునైట్ కింగ్‌డమ్, కామన్‌వెల్త్ దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాలుగా డ్యూక్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు'' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

''బ్రిటన్ ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది'' అని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ అన్నారు.

'స్కాట్‌లాండ్‌ ప్రజా జీవితానికి డ్యూక్ చేసిన సేవలు ఇక్కడి ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించాయి'' అని స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిష్టర్ నికోలా స్టర్జియన్ అన్నారు.

నివాళులర్పిస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

''నిస్వార్థ నిబద్ధత, ఉదారతతో డ్యూక్ సేవలందించారు'' అని వేల్స్ ఫస్ట్ మినిష్టర్ మార్క్ డ్రేక్ ఫోర్డ్ అన్నారు.

''ఎంతో అంకితభావం, చురుకుదనంతో దేశానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయం'' అని నార్దర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిష్టర్ ఆర్లీన్ ఫోస్టర్ అన్నారు.

వివిధ దేశాధినేతలు, ప్రపంచ నాయకులు కూడా ఫిలిప్ మృతికి సంతాపం తెలుపుతూ రాణికి సందేశాలు పంపించారు.

నివాళులర్పిస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

కాగా డ్యూక్‌కు గుర్తుగా ప్రజలు పుష్పగుచ్ఛాలు ఉంచే బదులు ఏదైనా దాతృత్వ సంస్థకు విరాళం ఇవ్వాలని రాజకుటుంబం ప్రజలను కోరింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)