ప్రిన్స్ ఫిలిప్: వివాదాలు రేపిన వ్యాఖ్యలు... తనపై తాను చేసుకున్న కామెంట్లు

ఫొటో సోర్స్, IAN MILES
డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాగా ఆయన ఎన్ని కీర్తి ప్రతిష్టలు అందుకున్నా, సుదీర్ఘ కాలం సేవ చేసినా, ప్రిన్స్ ఫిలిప్‌ను కొందరు వివాదాస్పదుడిగా చూస్తారు. అయితే ఆయన హాస్య చతురత (సెన్స్ ఆఫ్ హ్యూమర్)ను అర్ధం చేసుకోలేని వారు వాటిని తప్పుడు అర్ధంలో చూసేవారని ఆయన సన్నిహితులు అంటుంటారు.
ప్రిన్స్ చేసే వ్యాఖ్యలు ఇతరులను కించపరిచేలా, అవమానించేలా ఉంటాయన్న విమర్శలు వినిపించేవి. అయితే తన పదవిని, గౌరవాన్ని కూడా మరిచి తన మీద తానే జోకులు వేసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతారు.
ఒకసారి ఆయన తాను ఓ చాదస్తుడినని, మొండివాడినని చెప్పుకున్నారు.
ఆయన గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో చాలా విషయాలు ఇంతకు ముందు ఎక్కువమందికి తెలిసినవే.
వాటిని సంవత్సరాది క్రమంలో ఇస్తున్నాం. ఇందులో కొన్ని కామెంట్లు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని గమనించాల్సిందిగా కోరుతున్నాం.

ఫొటో సోర్స్, PA Media
'డోంటో పెడాలజీ' అంటే మన నోరు తెరిచి అందులో మన కాలు పెట్టుకోవడం.ఇదొక శాస్త్రం. దీన్ని నేను చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను
టైమ్ మేగజీన్ అందించిన సమాచారం ప్రకారం, 1960లో జనరల్ డెంటల్ కౌన్సిల్‌లో ఇచ్చిన ప్రసంగంలో ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లాటిన్ భాషలోని మౌత్(నోరు), ఫుట్(కాలు) అనే పదాలను కలిపేసి ఆయన ఓ కొత్త పదం సృష్టించారని, ఇది ఆయన మాటల తడబాటు కారణంగా వచ్చిందని పేర్కొంది.
స్కూల్‌లో మా అమ్మాయి ఆర్ట్ క్లాస్ నుంచి తీసుకొచ్చిన వస్తువులాగా కనిపిస్తోంది
1965లో తూర్పు ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఇథియోపియాకు చెందిన ఒక కళాఖండాన్ని చూసి ఆయన ఈ కామెంట్లు చేశారు.
బ్రిటీష్ మహిళలకు వంట చేయడం రాదు.
1966లో స్కాటిష్ విమెన్స్ ఇనిస్టిట్యూట్ పై విజయం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Alamy
నా కుటుంబంలో సగం మందిని ఆ బాస్టర్డ్స్ హత్య చేశారు. అయినా నేను రష్యా వెళ్లడానికి ఇష్టపడతాను.
కోల్డ్‌వార్ ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా వెళతారా అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.
మరీ ఖర్చు ఎక్కువై అప్పుల్లోకి వెళుతున్నామంటే , నేను నా పోలో ఆటను నిలిపేస్తాను
రాణి ఖర్చుల భారం ఎక్కువవుతోందన్న వ్యాఖ్యలపై ఆయన ఈ కామెంట్లు చేశారు.
మేం కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఇన్నాళ్లూ అన్నారు. ఇప్పుడు పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నామని అంటున్నారు.
1981లో బ్రిటన్‌లో ఆర్ధిక సంక్షోభం సందర్భంగా అన్నారు.
నువ్వు అమ్మాయివేనా ?
1984లో కెన్యా పర్యటన సందర్భంగా తనకు బహుమతి ఇవ్వడానికి వచ్చిన మహిళను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఇక్కడ ఎక్కువకాలం ఉంటే మీరు కూడా ఇలా చింకి కళ్లున్న వారిగా మారిపోతారు
1986లో చైనా పర్యటన సందర్భంగా బ్రిటీష్ విద్యార్ధులను ఉద్దేశించి ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగింది.
ఆసియా వాసులపై ఆయన జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని మీడియాలో ఆరోపణలు వినిపించాయి. అయితే చైనీయులు తన మాటలను సరిగా అర్ధం చేసుకోలేకపోయారని తర్వాత ప్రిన్స్ అన్నారు.
ఇది ఘోరమైన నగరం
1986లో చైనా పర్యటన సందర్భంగానే ఈ నగరం ఘోరంగా ఉందంటూ చైనా రాజధాని బీజింగ్‌పై ప్రిన్స్ కామెంట్ చేశారు.
ఇది వేశ్యల పడక గదిలా ఉంది.
1988లో సన్నింగ్‌హిల్‌లో తలపెట్టిన యువరాజు, యువరాణిల కొత్త భవన నిర్మాణపు ప్లాన్‌ను చూసిన తర్వాత ఆయన ఇలా కామెంట్ చేశారు.
వద్దు..వద్దు...నాకేదైనా ఘోరమైన వ్యాధి అంటుకుంటుంది.
1992లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడి వారికి అత్యంత ఇష్టమైన జంతువు కోలాను ఎత్తుకోవాల్సిందిగా కోరినప్పుడు ఆయన ఈ మాట అన్నారు.

ఫొటో సోర్స్, AFP
నువ్వు డ్రాయర్ వేసుకన్నావా లేదా?
1993లో 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్'కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఓ ఫ్యాషన్ జర్నలిస్టును ఈ మాటలన్నారు.
అయితే ఈ కామెంట్లకు తాను బాధ పడలేదని, రాజ కుటుంబంలో ఒక వ్యక్తికి కనీసం జోక్‌లేయడమైనా తెలిసినందుకు సంతోషించానని ఆ మహిళా జర్నలిస్టు తర్వాత వ్యాఖ్యానించారు.
మీలో చాలామంది పైరేట్లకు (దారి దోపిడీ దొంగలు) వారసులా?
1994లో కేమన్ ఐలాండ్‌లో ఓ ధనిక వ్యక్తిని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక పిచ్చెక్కిన క్రికెటర్ బ్యాట్ పట్టుకుని, ఓ స్కూల్లోకి ప్రవేశించి అక్కడున్న వారిని ఎడాపెడా బాదేసి చంపేశాడనుకోండి. అప్పుడు మీరు క్రికెట్ బ్యాట్‌ను నిషేధిస్తారా?
1996లో డన్‌బ్లేన్‌లో కాల్పుల ఘటన తర్వాత తుపాకులను నిషేధించాలన్న డిమాండ్‌పై ఆయన ఇలా స్పందించారు.

ఫొటో సోర్స్, WPA POOL
'బ్లడీ సిల్లీ ఫూల్'
1997లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి కార్ పార్కింగ్‌లో ఓ గార్డ్ తనను గుర్తు పట్టక పోవడంతో, కోపంగా ఆయన ఈ కామెంట్లు చేశారు.
'రీచెస్కాంజ్‌లర్'
1997లో జర్మన్ ఛాన్సలర్ హెల్మెట్ కోల్ ఓ ట్రేడ్ ఫెయిర్‌కు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ మాట ఉపయోగించారు.
ఇది హిట్లర్ చివరి రోజుల్లో ఉపయోగించిన బిరుదు.
జాగ్రత్త...నిన్ను అక్కడ ఎవరూ తినేయకుండా చూసుకో!
1998లో పాపువా న్యూగినీలోని కొకోడా ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళుతున్న ఓ యువకుడితో ప్రిన్స్ ఈ మాట అన్నారు.
మీకు చెవుడా..అక్కడ నిలుచున్నారంటే మీకు కచ్చితంగా చెవుడే
1999లో కార్డిఫ్‌లో తనను కలవడానికి వచ్చిన కొందరు బధిర విద్యార్ధులు ఓ మ్యూజిక్ బ్యాండ్‌కు సమీపంగా నిలబడినప్పుడు ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది తమను చులకన చేయడమేనని, ప్రిన్స్ తమను అవమానించారని బ్రిటీష్ డెఫ్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, AFP
ఇది చూడటానికి ఇండియన్లు తయారు చేసినట్లుంది.
1999లో ఆయన చేసిన ఈ కామెంట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎడిన్‌బరాలోని ఓ ఫ్యాక్టరీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఫ్యూజ్ బాక్స్‌ను చూసి ఆయన ఈ కామెంట్లు చేశారు.
జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని విమర్శలు రావడంతో, తర్వాత ఆయన ఈ మాటలకు క్షమాపణలు చెప్పారు.
ఇది ఒక విశాలమైన పనికి రాని స్థలం
2000 సంవత్సరంలో బెర్లిన్‌లో కొత్తగా నిర్మించిన రాయబార కార్యాలయంపై ఆయన చేసిన కామెంట్ ఇది.

ఫొటో సోర్స్, WPA POOL
నువ్వు మరీ పొట్టిగా ఉన్నావు. ఆస్ట్రోనాట్ కాలేవు
2001 సంవత్సరంలో సాల్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రిన్స్, ఓ 13 ఏళ్ల కుర్రాడు తనకు అంతరిక్షయానం చేయాలని ఉందని చెప్పినప్పుడు ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని తర్వాత ఆ విద్యార్ధి వ్యాఖ్యానించాడు.
మీరు ఇంకా ఒకరి మీద ఒకరు ఈటెలు విసురుకుంటున్నారా?
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ను సందర్శించినప్పుడు, అక్కడి ఆదిమ జాతికి చెందిన ఓ వ్యాపారవేత్తతో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు.
"లేదు, మేం ఇప్పుడు అలా చేయడం లేదు" అని ఆయన సమాధాన మిచ్చారు.
నువ్వు సూసైడ్ బాంబర్‌లాగా ఉన్నావు
2002లో బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన ఓ యువ పోలీస్ అధికారిని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు టైగర్లా?
2002లో లండన్‌లోని తమిళ కమ్యూనిటీకి చెందిన హిందూ మురుగన్ ఆలయాన్ని ప్రిన్స్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడి తమిళ పూజారులతో "మీరు గెరిల్లా యుద్ధం చేసే టైగర్లా'' అని ప్రశ్నించగా, తాము పూజారులమని, హింసకు దూరంగా ఉంటామని వారు సమాధానమిచ్చారు.
బెడ్రూమ్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు ?
2003లో సంప్రదాయ దుస్తులలో తనను కలవడానికి వచ్చిన నైజీరియా అధ్యక్షుడిని ఉద్దేశించి ప్రిన్స్ ఇలా వ్యాఖ్యానించారు.
నువ్వు మరీ పేదరికంలో ఉన్నావా?
2007లో అధికారిక దుస్తులు ధరించకుండా తనను కలిసిన ఓ మేయర్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పర్యాటక రంగమంటే అది ఒక జాతీయ వ్యభిచారం
2008లో స్లోవేనియాను సందర్శించిన సందర్భంగా, ఓ ప్రొఫెసర్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నువ్వు దుస్తులు విప్పి డ్యాన్స్ చేసే క్లబ్‌లో పని చేశావా?
2010లో తనను కలిసిన ఓ మహిళా క్యాడెట్, గతంలో తాను ఓ క్లబ్‌లో పని చేశానని చెప్పినప్పుడు ఆయన ఈ మాట అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నీ డ్రెస్ జిప్ విప్పితే నేను అరెస్ట్ అవుతానేమో ?
2012లో జిప్ ఉన్న డ్రెస్ వేసుకున్న ఓ కౌన్సిల్ వర్కర్‌ను ఉద్దేశించిన ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పిల్లలు ఇంట్లో ఉండటం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. అందుకే స్కూల్‌కు పంపిస్తారు.
2015లో మలాలా యూసఫ్ జాయ్ ప్యాలెస్‌లో తనను కలిసినప్పుడు ప్రిన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్లను యూసఫ్ జాయ్ సరదాగా తీసుకున్నారు.
మిమ్మల్ని ఎవరు మేపుతారు?
2015లో తూర్పు లండన్‌లో తనను కలిసిన మహిళా వలంటీర్లతో ప్రిన్స్ ఫిలిప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రిన్స్ జోక్ చేస్తున్నారని గమనించిన ఓ వలంటీర్, మా అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ బాధ్యత మా భర్తలదే అని సమాధాన మిచ్చారు.
ఇందులో ఒక్కటి కూడా మీరు తీసుకెళ్లలేరు. ఎందుకంటే వెళ్లేటప్పుడు మీ బ్యాగ్‌లు మేం చెక్ చేస్తాం
2015లో రాజ ఆభరణాల ప్రదర్శనను చూడటానికి వచ్చిన చైనా ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్‌తో ప్రిన్స్ ఈ మాటలు అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








