Diego Maradona: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ఇక లేరు

ఫొటో సోర్స్, CHRIS MCGRATH
సాకర్ ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 ఏళ్లు.
నవంబర్ ఆరంభంలో మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఆ తర్వాత మద్యం వ్యసనం నుంచి బైటపడేందుకు చికిత్స తీసుకుంటూ వచ్చారు.
సాకర్ ప్రపంచంలో ఆల్ టైం గ్రేట్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మారడోనా 1986 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ వరల్డ్ కప్ అర్జెంటీనా సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనా తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన మారడోనా 34 గోల్స్ చేశారు. మొత్తం నాలుగు ప్రపంచకప్‌లలో ఆయన ఆడారు.
1990లో ఇటలీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా నాయకత్వంలో ఆడిన అర్జెంటీనా జట్టు పశ్చిమ జర్మనీ చేతిలో ఓడిపోయింది.
1994లో అమెరికాలో జరిగిన మ్యాచ్‌కు కూడా ఆయనే నాయకత్వం వహించగా, అప్పట్లో ఆయన డ్రగ్స్ పరీక్షల్లో పట్టుబడటంతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన తన కెరీర్ రెండో అర్ధభాగంలో కొకైన్‌కు బానిసగా మారారు. 1991లో జరిపిన టెస్టుల్లో కొకైన్ తీసుకున్నట్లు వెల్లడి కావడంతో ఆయన్ను 15 నెలలపాటు బహిష్కరించారు.
1997లో తన 37వ ఏట మారడోనా ఫుట్‌బాల్ క్రీడ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
2008లో ఆయన అర్జెంటీనా జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2010 వరల్డ్ కప్ తర్వాత ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఆ టోర్నీలో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి పాలైంది.
ఆ తర్వాత ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికో జట్లకు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన చనిపోయేనాటికి అర్జెంటీనా టాప్ టీమ్ జిమ్నేజియా వై ఎస్గ్రిమాకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








