You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్-చైనా సరిహద్దు వివాదం: విదేశాంగ మంత్రుల సమావేశంలో పోరాట విరమణకు అంగీకారం
సరిహద్దుల్లో కాల్పులు, అపహరణ ఆరోపణల తరువాత భారత్, చైనాలు ఈ ప్రతిష్టంబనకు ముగింపు పలుకుతూ రెండు దేశాల బలగాలు ఒకరితో ఒకరు తలపడడం వెంటనే విరమించేలా అంగీకారానికి వచ్చాయి.
రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు గురువారం భేటీ అయ్యారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఇద్దరూ చెప్పారు.
కచ్చితంగా నిర్ణయం కాని సరిహద్దుల వెంబడి రెండు దేశాల సైనికుల మధ్య తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతుంటాయి.
సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చారంటూ పరస్పరం ఆరోపించుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వీరి మధ్య జరిగే ఘర్షణలు ప్రాణ నష్టానికి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి.
కాగా గురువారం నాటి భేటీ తరువాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ''ప్రస్తుత పరిస్థితిని ఎవరూ కోరుకోలేదు'' అని చెప్పారు.
''రెండు దేశాల సరిహద్దు బలగాల మధ్య చర్చలు కొనసాగాలి, తలపడడం ఆపేయాలి, బలగాలు తగినంత దూరం పాటిస్తూ ఉద్రిక్తతలు తగ్గేలా చేయాలన్న ఒప్పందానికి వచ్చాం'' అని విదేశీ వ్యవహారాల మంత్రులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతి, సామరస్యం కాపాడుకునేలా, పెంపొందేలా మరిన్ని కొత్త చర్యలను వేగవంతం చేస్తామని చెప్పారు. అయితే, ఆ చర్యలేమిటన్నవి మాత్రం వివరించలేదు.
కాగా సరిహద్దు వెంబడి తిరిగే సైనికులు తుపాకులు, మోర్టార్లు వంటి కాల్పులు జరిపే వీలున్న ఆయుధాలు వాడరాదన్న ఒప్పందం రెండు దేశాల మధ్య ఉంది.
అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత సైనికులు సరిహద్దు దాటి తమ భూభాగంలో ప్రవేశించి గస్తీ కాస్తున్న తమ బలగాలపై కాల్పులు జరిపారని చైనా ఇటీవల ఆరోపించింది.
తాము కాదు చైనా సైనికులే తొలుత సరిహద్దు దాటి వచ్చి గాల్లోకి కాల్పులు జరుపుతూ ఒప్పందాలను ఉల్లంఘించారని భారత సైన్యం ఆరోపించింది.
ఇది జరగడానికి ఒక రోజు ముందు తమ పౌరులు అయిదుగురిని చైనా సైనికులు అపహరించారంటూ భారత సైన్యం చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ఆ తరువాత చైనా ఆ అయిదుగురు భారత పౌరులను తమ భూభాగంలోనే గుర్తించామని, వారిని అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది.
జూన్‌లో 20 మంది భారతీయ సైనికులు చైనా బలగాలతో ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ 3,440 కిలోమీటర్ల పొడవున ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి నదులు, సరస్సులు, మంచు శిఖరాలు ఉండడం వల్ల సరిహద్దు విషయంలో కచ్చితత్వం లేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక బలగం ఉన్న ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో బాహాబాహీ జరుగుతుంటుంది.
చైనా పెద్ద సంఖ్యలో బలగాలను లద్దాఖ్‌లోని గల్వాన్ లోయకు పంపిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అంతేకాదు.. తమ భూభాగంలో 38 వేల చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించుకుందనీ భారత్ ఆరోపిస్తోంది.
గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగినా సరిహద్దు వివాదం మాత్రం పరిష్కారం కాలేదు.
'అనూహ్య ప్రకటన ఇది'
రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో పెరిగిన ఉద్రిక్తతలు, ఆరోపణలుప్రత్యారోపణల నేపథ్యంలో సాయుధ ఘర్షణ జరిగే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు భావించిన తరుణంలో ఇలాంటి ప్రకటన రావడం అనూహ్యమే అని బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే అన్నారు.
తెరవెనుక చర్చలు ప్రస్తుతానికి ఫలించడం వల్లే ఈ ప్రకటన వచ్చిందని అర్థమవుతుందన్నారు.
మొత్తానికి ఇది రెండు దేశాలకు కొంత ఉపశమనమేనని... భారత్ కోవిడ్‌తో పోరాడుతుండడం.. చైనా అంతర్జాతీయంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో కనీసం ఈ పోరాటమైనా ఆగడమంటే అది ఉపశమనమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియా - చైనా మధ్య గొడవల్లో భారత స్టార్టప్ కంపెనీలు దెబ్బతింటున్నాయా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్‌వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)