కరోనావైరస్: చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్‌వాష్ మంచిదా.. శాటినైజర్ మంచిదా?

కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్‌తో పాటు చేతులు శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమైన విషయమే.

ఇది మనలో చాలామంది ఇప్పుడు సహజంగా చేస్తున్న పనే. రోజుకు చాలాసార్లు చేతులు శుభ్రం చేసుకుంటున్నారు.

అయితే, కరోనాపై పోరులో ప్రధాన ఆయుధాలైన మాస్కులు, సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ వంటివాటి మధ్య చేతులు కడుక్కోవడమనేది మర్చిపోయే అవకాశం ఉంది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన తరువాత ఈ కొత్త రకం వైరస్ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఏం చేయాలనేది ఆరోగ్య సంస్థలు విస్తృతంగా ప్రచారం చేశాయి.

ఆరోగ్య ప్రకటనలు, నిపుణులు, వైద్యుల సూచనలు అన్నిటిలోనూ వేడినీరు, సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలన్న సూచన ప్రధానంగా కనిపించేది.

చేతులు కడుక్కోవడంలో సరైన పద్ధతి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది.

ఆరు నెలలయ్యేటప్పటికి కేసులు విపరీతంగా పెరగడం.. ఎక్కడికక్కడ లాక్‌డౌన్ల మధ్య ఈ చేతులు కడుక్కోవాలన్న సూచనలు పక్కకుపోయాయి.

ఇథియోపియాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆసుపత్రులకు వెళ్లిన ప్రతి వెయ్యి మంది రోగుల్లో సరైన పద్ధతిలో చేతులు కడుక్కున్నది 1 శాతం కంటే తక్కువేనని తేలింది. ఈ అధ్యయనంపై పూర్తి పరిశీలన ఇంకా జరగాల్సి ఉంది.

కరోనావైరస్‌ను నాశనం చేయడానికి సాధారణ సబ్బు, వేడినీరు కంటే గొప్పది ఇంకేమీ లేదని బోస్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ కెమిస్ట్రీ, కెమికల్ బయాలజీ ప్రొఫెసర్ థామస్ గిల్బర్ట్ చెప్పారు.

''ఈ వైరస్‌లలోని జన్యు కణాల చుట్టూ బాహ్యకవచం ఉంటుంది. అది కొవ్వు కణజాలంతో జిడ్డుగా ఉండడంతో దాన్ని లిపిడ్ మెంబ్రేన్ అంటారు. ఇలాంటి లిపిడ్ స్ట్రక్చర్లు సబ్బు, నీటి మిశ్రమంలో తటస్థమవుతాయి. సబ్బు, నీటితో కడిగినప్పుడు వైరస్ చుట్టూ ఉండే బాహ్య కణజాల పొర కరిగిపోయి వైరస్ కణ నిర్మాణం చెదిరిపోతుంది. మానవ కణాలను ఉపయోగించుకుని వైరస్‌ను వృద్ధి చేసుకునే జన్యు పదార్థం ఆర్‌ఎన్ఏ 5---5 ఈ కడిగే ప్రక్రియలోకొట్టుకుపోయి నాశనమవుతుంది'' అన్నారు గిల్బర్ట్.

''చేతులు కడుక్కునే సమయాన్ని తగ్గించడం గురించి నేను ఎక్కడా వినలేదు'' అన్నారు గిల్బర్ట్. చేతులు పూర్తిగా నీటిలో తడిసేలా చేసి ఆ తరువాత సబ్బు రాసి బాగా నురుగు వచ్చేలా చేతులకు రెండు వైపులా, వేళ్ల మధ్య అంతా ఆ నురుగు పరచకునేలా చేసిన తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడు వైరస్ చుట్టూ ఉండే కొవ్వు కణజాలాలు, సబ్బు మధ్య రసాయన చర్యకు సమయం సరిపోతుంది. ఇందుకు 20 సెకండ్ల కనీసం సమయం అవసరం. అప్పుడే సబ్బు వైరస్‌లను నాశనం చేయడానికి వీలవుతుంద''ని చెప్పారు గిల్బర్ట్. వేడి నీటితో కడుక్కుంటే వైరస్‌ను నాశనం చేయడమనేది మరింత వేగంగా పూర్తవుతుందన్నారాయన.

వైరస్‌ను నాశనం చేయడానికి కేవలం నీటితో శుభ్రం చేయడం వల్ల ఫలితం ఉండదని.. సబ్బు కూడా అవసరమని బ్రిటన్‌లోని కెంట్ విశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మార్టిన్ మైఖేలిస్ చెప్పారు. అందుకు ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. వంట చేసినప్పుడు చేతికి అంటుకునే నూనె జిడ్డు వదలాలంటే ఉత్త నీటితో కడిగితే సరిపోదని.. సబ్బుతో కడుక్కుంటేనే వదులుతుందని, అలాగే కొవ్వు పైపొరలుండే కరోనా వైరస్‌ను వదిలించాలంటే సబ్బు తప్పనిసరని చెప్పారు.

మరోవైపు శానిటైజర్ల వినియోగం వల్ల చేతులు సబ్బుతో కడుక్కోవడం దక్కాల్సిన ఫలితం పక్కకుపోతుందన్న వాదనా ఉంది.

అయితే, సబ్బు, నీరు, వాష్ బేసిన్లు అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా శానిటైజర్లు కొంతనయమే అయినా తాను మాత్రం శానిటైజర్ కంటే సబ్బు, వేడినీటికే ప్రాధాన్యం ఇస్తానన్నారు ప్రొఫెసర్ గిల్బర్ట్.

ఎంత తరచుగా చేతులు కడుక్కోవాలి..

కరోనావైరస్ ప్రబలిన తొలినాళ్లలో బ్రిటన్ ప్రభుత్వం ప్రజలు ఇళ్లలో ఉన్నా తరచూ చేతులు కడుక్కోవాలని సూచించింది. కానీ, ప్రొఫెసర్ గిల్బర్ట్ మాత్రం అలాంటి అవసరం లేదంటున్నారు. పూర్తిగా ఇంట్లోనే ఉంటూ బయట వ్యక్తులను కలవనివారు, బయట నుంచి వచ్చే పదార్థాలను తాకని వారు తరచూ చేతులు కడుక్కోనవసరం లేదని.. ఏదైనా తినడానికి ముందు, తరువాత.. అలాగే టాయిలెట్‌కు వెళ్లిన తరువాత చేతులు శుభ్రం చేసుకుంటే చాలని చెప్పారు.

అయితే, ఇంట్లో కరోనా రోగులు కానీ, ఇతర వైరస్‌లు సోకినవారు కానీ ఉంటే.. వారు తాకిన వస్తువులు తాకినప్పుడు, వారికి సమీపంలోకి వెళ్లి వచ్చిన తరువాత చేతులు కడుక్కోవడం తప్పనిసరని గిల్బర్ట్ స్పష్టం చేశారు.

''మీరు రోజంతా ఇంట్లోనే ఉంటే.. మీ ఇంటికి వచ్చే కొత్తవారి సంఖ్య 20 కంటే తక్కువే అయితే చేతులు కడుక్కోవడం పెద్దగా అవసరం లేదు'' అన్నారు గిల్బర్ట్.

అయితే, ఉట్రేచ్ విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ విద్యార్థి థి ముయి ఫామ్ నేతృత్వంలో చేసిన అధ్యయన ఫలితాల ప్రకారం.. వైరస్ సోకినవారితో కానీ వైరస్ ఉన్న ఉపరితలాలతో కానీ కాంటాక్ట్ అయిన వెంటనే చేతులు కడుక్కోవడం మంచిదని తేల్చారు. నిర్ణీత కాల వ్యవధుల్లో చేతులు కడుక్కోవడం కంటే వైరస్ అనుమానిత వ్యక్తులు, ఉపరితలాలతో కాంటాక్ట్ అయిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం మంచిదని ఆ అధ్యయనం సూచిస్తోంది.

యాంటీ వైరల్ హ్యాండ్‌వాష్ కంటే సబ్బే మంచిది

చాలామంది సాధారణ సబ్బుల కంటే యాంటీవైరల్ హ్యాండ్ వాష్‌లు సమర్థంగా పనిచేస్తాయనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదంటున్నారు ప్రొఫెసర్ మార్టిన్ మైఖేలిస్.

''అలాంటివేమీ ప్రత్యేకంగా అవసరం లేదు. మార్కెట్లో దొరుకుతున్న యాంటీ మైక్రోబయల్స్‌లో చాలావరకు కేవలం యాంటీ బాక్టీరియల్ మాత్రమేనని ఆయన చెప్పారు.

యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ వాష్‌లు వైరస్‌లను నిర్మూలించలేవని చెప్పారు మార్టిన్.

ఈ యాంటీ బాక్టిరియల్స్ మితిమీరి వాడడం వల్ల అవి మురుగునీటిలో చేరుతాయని.. అలాగే ఇతర డిస్‌ఇన్ఫెక్టెంట్‌లను మితిమీరి వాడడం వల్లా పర్యావరణానికి నష్టం ఉంటుందన్నారు.

కరోనాపై పోరులో సబ్బుతో చేతులు కడగడానికి ఉపయోగించే నీరు తాగునీరు కానవసరం లేదని గిల్బర్ట్, మైఖేలిస్ ఇద్దరూ చెప్పారు. సబ్బు ఉన్నంతవరకు మంచి నీరు కాకపోయినా ఫరవాలేదంటున్నారు.

నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలవారు సబ్బుతో చేతులు కడుక్కోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

కాగా ప్రపంచంలో ప్రతి 5 పాఠశాలల్లో కేవలం రెండిటికి మాత్రమే చేతులు కడుక్కునే వసతులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం వల్ల కరోనావైరస్సే కాదు ఇతర అనేక వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందొచ్చని చెబుతున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)