You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PUBG Game: చైనా యాప్‌ల నిషేధంపై చైనా అభ్యంతరం.. ‘భారత్ తక్షణమే తప్పు దిద్దుకోవాలి’
పబ్‌జి సహా 118 చైనా మొబైల్ యాప్‌ల మీద భారతదేశం నిషేధం విధించటం పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
భారత నిర్ణయం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ గురువారం విలేకరుల సమావేశంలో చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది.
పబ్‌జి తదితర మొబైల్ యాప్‌లు భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయంటూ 118 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు భారత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్ అంతకుముందు టిక్‌టాక్, వియ్‌చాట్ సహా మరో 59 చైనా యాప్‌లను కూడా నిషేధించింది.
చైనా కంపెనీల పట్ల వివక్షాపూరిత ఆంక్షలు విధించటం ద్వారా భారతదేశం ''జాతీయ భద్రత'' అంశాన్ని దుర్వినియోగం చేసిందని గావో ఆరోపించారు. భారత్ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘించటమేనని ఆయన తప్పుపట్టారు.
చైనా కంపెనీలు విదేశాల్లో కార్యకలాపాలు సాగించేటపుడు అంతర్జాతీయ నిబంధనలను, స్థానిక చట్టాలు, నియంత్రణలను పాటించాలని చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చెప్తూనే ఉందని గావో పేర్కొన్నారు.
''భారత్ చేపట్టిన చర్య.. చైనా పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించటమే కాదు.. భారత వినియోగదారుల ప్రయోజనాలకు కూడా హాని కలిగిస్తుంది. ఓపెన్ ఎకానమిగా ఉన్న భారతదేశంలో పెట్టుబడి వాతావరణాన్ని కూడా దెబ్బతీస్తుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రభుత్వం తన తప్పును తక్షణమే సరిదిద్దాలని చైనా కోరింది. ''చైనా - భారత్ ఆర్థిక, వాణిజ్య సహకారం ఉమ్మడి ప్రయోజనాలు అందిస్తుంది'' అని గావో చెప్పారు.
''కష్టపడి సాధించుకున్న ద్వైపాక్షిక సహకారం, అభివృద్ధిని పరిరక్షించటానికి, చైనా కంపెనీలు సహా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు న్యాయమైన వ్యాపార వాతావరణం కల్పించటానికి.. భారతదేశం చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.
పబ్‌జి సహా 118 యాప్‌లపై భారత్ నిషేధం
భారత్ - చైనా సరిహద్దులో లదాఖ్ వద్ద ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం బుధవారం నాడు 118 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంలలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ యాప్‌ల సహాయంతో డాటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందని, ఈ అంశంలో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని వివరించారు.
భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్‌లను నిషేధించమంటూ అనేకసార్లు కోరిందనీ...అలాగే, అనేకమంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)