You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్లాక్ హోల్స్: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
ఎనిమిది సూర్యుళ్ల శక్తి ఒక్క క్షణంలో విరుచుకుపడటాన్ని ఓ సారి ఊహించుకోండి.
రెండు భారీ కృష్ణబిలాలు కలిసినప్పుడు ఇంత మొత్తంలో శక్తి ఓ గురుత్వాకర్షణ తరంగం(షాక్ వేవ్)లా వెలువడింది. ఇప్పటివరకూ ఇదే అత్యంత భారీ శక్తి విస్ఫోటం.
ఈ విస్ఫోటం నుంచి వచ్చిన తరంగం ఏడు బిలియన్ సంవత్సరాలు పయనించి భూమిని చేరుకుంది. గతేడాది మేలో ఇటలీ, అమెరికాలోని లేజర్ డిటెక్టర్లు దీన్ని గుర్తించాయి.
రెండు కృష్ణ బిలాలు కలిసి సూర్యుడి కంటే 142 రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిగల ఖగోళాన్ని సృష్టించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇది చాలా ముఖ్యమైన పరిణామం. ఇప్పటివరకు చిన్నవి లేదా భారీ కృష్ణబిలాల జాడలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఇది కొత్త మధ్యతరగతి కృష్ణబిలం. వీటి పరిమాణం వంద నుంచి వెయ్యి సూర్యుల ద్రవ్యరాశికి సమానం.
అమెరికా, యూరప్‌లలో ఏర్పాటుచేసిన మూడు సూపర్ సెన్సిటివ్ గురుత్వాకర్షణ సంకేతాల గుర్తింపు వ్యవస్థల్లో(లీగో-విర్గో కొలాబరేషన్) బయటపడిన అన్వేషణల్లో తాజా సంకేతాలు కూడా ఒక భాగం.
కృష్ణ బిలం అంటే?
- కృష్ణబిలం అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం. ఇక్కడ ద్రవ్యరాశి మొత్తం లోపలకు కూరుకుపోతుంది.
- ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే..కాంతి కూడా దీన్నుంచి తప్పించుకోలేదు.
- పెద్దపెద్ద నక్షత్రాలు విస్ఫోటం చెందేటప్పుడు ఈ కృష్ణ బిలాలు జనిస్తాయి.
- కొన్ని కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశి కంటే కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవిగా ఉంటాయి.
- నక్షత్ర మండలం కేంద్రాల్లో ఇవి ఎలా ఆవిర్భవించాయో ఇప్పటివరకూ తెలియలేదు.
- పరిసరాల్లోని ఖగోళ వస్తువుల కదలికల ద్వారా కృష్ణబిలాలను గుర్తించొచ్చు.
- ఇవి గుర్తించగలిగే స్థాయిలో గురుత్వాకర్షణ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. రెండు మూడు కృష్ణబిలాలు సుడులు తిరిగేటప్పుడు ఈ తరంగాలు జనిస్తాయి.
లిగో విర్గో పరికరాలు ఈ తరంగాలను మే 21, 2019నాడు గుర్తించాయి. సెకనులో పదో వంతు సమయం మాత్రమే వీటి సంకేతం అందింది.
సూర్యుడి కంటే ఒకటి 66 రెట్లు, మరొకటి 85 రెట్లు ద్రవ్యరాశిగల భారీ కృష్ణబిలాలు సుడులూ తిరుగుతూ కలుస్తున్న చోట నుంచి ఈ సంకేతం వచ్చినట్లు కంప్యూటర్ అల్గారిథమ్‌లు తేల్చాయి.
ఈ కృష్ణబిలాలు 150 బిలియన్ ట్రిలియన్ల కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు అల్గారిథమ్‌లు గణించాయి.
''ఇది నిజంగా అద్భుతం''అని ఫ్రాన్స్‌లోని కోట్ డీ అజూర్ అబ్జర్వేటరీకి చెందిన ప్రొఫెసర్ క్రిస్టెన్‌సన్ చెప్పారు. ''ఈ సంకేతం ఏడు బిలియన్ ఏళ్ల క్రితం జనించింది. అంటే మన విశ్వానికి ప్రస్తుతంలో సగం వయసున్నప్పుడు అది పుట్టింది. ఇప్పుడు దాన్ని భూమిపైనున్న పరికరాలు గుర్తించాయి''అని ఆయన బీబీసీ న్యూస్‌కు వివరించారు.
గురుత్వాకర్షణ తరంగాలు అంటే?
- గురుత్వాకర్షణ తరంగాలనేవి ఉంటాయని సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంచనా వేసింది.
- అయితే, వాటిని గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు దశాబ్దాలు పట్టింది.
- విధ్వంసకర పరిణామాలు జరిగేటప్పుడు జనించే తరంగాలే ఇవి.
- వేగంగా తిరిగే ద్రవ్యరాశిగల ఖగోళాలు కాంతి వేగంతో పయనించే వీటిని ఉత్పత్తి చేస్తాయి.
- కృష్ణబిలాలు కలిసేచోట, న్యూట్రాన్ నక్షత్రాల వద్ద వీటిని గుర్తించొచ్చు.
- వీటిని గుర్తించడంతో విశ్వంపై కొత్తతరహా పరిశోధనలకు మార్గం సుగమమైంది.
నక్షత్రాలు తమలో ఇంధనం నిండుకున్నాక విస్ఫోటం చెందుతాయి. నక్షత్రాలు పెద్దవైతే అప్పుడు కృష్ణబిలం ఏర్పడే అవకాశముంది.
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 65 నుంచి 120 రెట్ల ద్రవ్యరాశిగల కృష్ణబిలాలు ఏర్పడటం అసాధ్యం.
ఇలాంటి పరిమాణంలో కృష్ణబిలాలను ఏర్పాటుచేయగలిగే నక్షత్రాలు విస్ఫోటం చెందేటప్పుడు అసలు ఏమీ మిగలదు.
ఇదే నిజమైతే.. సూర్యుడి కంటే 85 రెట్ల ద్రవ్యరాశిగల కృష్ణబిలం ఏర్పడటానికి రెండు కృష్ణబిలాల కలయికే కారణం కావొచ్చు.
విశ్వం ఎలా పరిణామం చెందిందో దీని నుంచి తెలుసుకోవచ్చని బ్రిటన్‌లోని గ్లాస్‌గౌ యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్ మార్టిన్ హెన్రీ భావిస్తున్నారు.
''వరుసగా కొన్ని కృష్ణబిలాల కలయికలు ఒకటి తర్వాత ఒకటి జరిగి పెద్దపెద్ద కృష్ణ బిలాలు ఏర్పడుతుండొచ్చు. ఎవరికి తెలుసు? సూర్యుడి కంటే 142 రెట్ల ద్రవ్యరాశి గల ఈ కృష్ణబిలం.. అదే పరిమాణంలోని వేరే కృష్ణబిలాలతో కలిసి ఇంకా పెద్ద కృష్ణబిలాలను ఏర్పాటుచేసుకుంటూ వెళ్తూ... గెలాక్సీ మధ్యలో ఉండే భారీ కృష్ణబిలాలు ఏర్పడి ఉండొచ్చు''
గతేడాది మే 21న గుర్తించిన తాజా తరంగంపై రెండు పరిశోధన పత్రాలను శాస్త్రవేత్తలు ప్రచురించారు.
వీటిలో ఒకటి జర్నల్ ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో ప్రచురితమైంది. మరొకటటి ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో వచ్చింది. దీనిలో తరంగ స్థిగతుల గురించి చర్చించారు.
జీడబ్ల్యూ190521గా పిలుస్తున్న ఈ తరంగం.. భారీ పరిశోధనలకు దారితీసిన 50 తరంగాల్లో ఒకటి.
నోబెల్ బహుమతి ఒడిసిపట్టిన 2015నాటి గురుత్వాకర్షణ తరంగాల గుర్తింపు ఆవిష్కరణతో.. ఈ పరిశోధనలు వేగం పుంజుకున్నాయి.
''మేం డిటెక్టర్ల సెన్సిటివిటీని పెంచుతున్నాం. అవును రోజుకు ఒకటి కంటే ఎక్కువే తరంగాలను గుర్తించే స్థాయికి వెళ్లగలం. వరుస కృష్ణబిలాలను గుర్తించగలం. ఇది చాలా అద్భుతం. ఎంతకంటే దీన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు''అని పోట్స్‌డమ్‌లోని ద మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషనల్ ఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అలెసాండ్రా బ్యూనానో.. బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- భౌతికశాస్త్రం ముఖచిత్రాన్ని మార్చేసిన నలుగురు మహిళలు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)