You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- రచయిత, హరిత కందపాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1928వ సంవత్సరం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అన్న విషయమై ట్రావెన్‌కోర్ రాజ్యంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
త్రివేండ్రంలోని ఓ సభలో కూడా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ప్రముఖ మేధావి వేలుపిల్లై మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
అప్పుడు 24 ఏళ్ల అన్నా చాందీ వేదికపైకి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు ఎందుకు అవసరమో చెబుతున్నారు. ఆమె ప్రసంగం కోర్టులో వాదనలా సాగింది.
ఒక వేళ మహిళలకు ఉద్యోగాలు ఇస్తే... పెళ్లైనవారికి ఇవ్వాలా, పెళ్లి కాని వారికి ఇవ్వాలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
‘‘మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం మొదలుపెడితే, వైవాహిక జీవిత బాధ్యతల నిర్వహణపై ప్రభావం పడొచ్చు. కొన్ని కుటుంబాల్లో సంపద కూడా తగ్గిపోతుంది. పురుషుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది’’ అని వేలు పిల్లై సభలో అన్నారు.
‘‘మహిళలు పురుషులకు ఇంట్లో ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రమే అన్నట్లుగా ఈ వాదన ఉంది. దీని ఆధారంగానే వాళ్లు మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు ఉండాలని కోరుకుంటున్నారు. మహిళ వంట గది దాటితేనే, కుటుంబ ఆనందం దెబ్బతింటుందన్నది వారి అభిప్రాయం’’ అని అన్నా చాందీ అన్నారు.
మహిళలు సంపాదిస్తే, కష్టకాలంలో కుటుంబానికి ఆసరా లభిస్తుందని అన్నా వాదించారు. ఒకవేళ పెళ్లికాని మహిళలకే ఉద్యోగాలు ఇస్తామని చెబితే, మహిళలు పెళ్లి చేసుకోవడం మానేస్తారని కూడా ఆమె అన్నారు.
ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
అన్నా చాందీ న్యాయవిద్య చదువుకున్నారు.
ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొనేందుకే ఆమె కొట్టాయం నుంచి త్రివేండ్రం వరకు వచ్చారని కేరళకు చెందిన చరిత్రకారిణి, రచయిత జే. దేవిక చెప్పారు. అన్నా చాందీ ఈ సభలో చేసిన ప్రసంగంతో మహిళలకు రిజర్వేషన్ల డిమాండ్‌కు బలం లభించినట్లైందని అన్నారు.
మహిళల రిజర్వేషన్ల డిమాండ్‌ను మొదలుపెట్టిన మలయాళీ మహిళల్లో అన్నా చాందీ అగ్రపథంలో ఉంటారు.
న్యాయపట్టా పొందిన తొలి మహిళ
అన్నా చాందీ ట్రావెన్‌కోర్ రాజ్యంలో 1905లో జన్మించారు.
1926లో న్యాయవిద్య పూర్తి చేశారు. కేరళలో న్యాయవిద్య పట్టా పొందిన తొలి మహిళ అన్నా చాందీనే.
‘‘అన్నా ఓ సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. కేరళలో న్యాయవాద పట్టా పొందిన తొలి మహిళ ఆమె. లా కాలేజీలో ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. కాలేజీలో చాలా మంది ఆమెను ఆటపట్టించేవారు. కానీ, ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ’’ అని దేవిక చెప్పారు.
క్రిమినల్ కేసుల్లో చట్టాలపై బాగా పట్టు ఉన్న న్యాయవాదిగా అన్నా చాందీ పేరుతెచ్చుకున్నారు.
రాజకీయాల్లో అడుగు
సామాజికంగా మహిళలను చిన్నచూపు చూడటం, రాజకీయాల్లో వారికి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల అన్నా చాందీ తీవ్ర అసంతృప్తితో ఉండేవారు.
1931లో ట్రావెన్‌కోర్ శ్రీమూలమ్ పాపులర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు.
‘‘అప్పట్లో రాజకీయాల్లో మహిళలు ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎన్నికల బరిలోకి వచ్చాక అన్నాను అవమానించేలా, ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. ఆమెను అవమానపరిచేలా పోస్టర్లు వేశారు. ఎన్నికల్లో అన్నా ఓడిపోయారు. కానీ, ఆమె మౌనంగా ఉండిపోలేదు. తన మ్యాగజైన్ ‘శ్రీమతి’లో దీనికి వ్యతిరేకంగా ఓ సంపాదకీయం రాశారు’’ అని దేవిక చెప్పారు.
1932లో అన్నా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు.
‘‘అసెంబ్లీ సభ్యురాలిగా ఉంటూ మహిళల అంశాలను లేవనెత్తడమే కాదు, బడ్జెట్ లాంటి అంశాలపై చర్చల్లోనూ ఆమె పాల్గొనేవారు’’ అని దేవిక చెప్పారు.
‘శరీరంపై హక్కులు ఉండాలి’
‘‘మలయాళీ మహిళలకు ఆస్తిపై అధికారాలు, ఓటు హక్కు, ఉద్యోగాలు, గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం లభించాయి. కానీ, ఎంత మందికి వారి వారి శరీరంపై హక్కులు ఉన్నాయి. మహిళల శరీరం పురుషులకు ఆనందాన్నిచ్చే ఓ వస్తువుగా చూసే మూర్ఖపు ఆలోచన వల్ల ఎంతో మంది మహిళలు హీన స్థితి అనుభవిస్తున్నారు’’ అని అన్నా చాందీ 1935లో రాశారు.
కేరళకు ముందు నుంచీ ప్రగతిశీల ప్రాంతంగా పేరు ఉంది. ట్రావెన్‌కోర్ పాలన కాలం నుంచే కేరళలో చాలా వరకూ మాతృస్వామిక వ్యవస్థ నడుస్తూ ఉంది.
ట్రావెన్‌కోర్ మహిళా పాలకుల కారణంగా మహిళల విద్య, సామాజికంగా, ఆర్థికంగా వారిని బలోపేతం చేయాల్సిన అవసరం గురించి సమాజంలో అవగాహన ఉంది. అయినా, అక్కడ కూడా మహిళలు వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చేది.
‘‘మహిళలకు తమ శరీరంపై హక్కు ఉండాలని అన్నా చాందీ వాదించారు. పెళ్లి విషయంలో పురుషుల కన్నా మహిళలకు తక్కువ హక్కులు ఉన్న విషయాన్ని కూడా ఆమె లేవనెత్తారు. ఆమె ఉన్న కాలానికి చాలా ఆధునికమైన భావాలు అవి’’ అని దేవిక అన్నారు.
చట్టం కూడా మహిళలను, పురుషులను సమానంగా చూడాలని అన్నా చాందీ అభిప్రాయపడ్డారు.
1935లో ట్రావెన్‌కోర్ రాజ్యం చట్టంలో మహిళలకు ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని అన్నా తప్పుపట్టారని దేవిక చెప్పారు.
ట్రావెన్‌కోర్ దర్బార్ దీవాన్ అన్నాను జిల్లా స్థాయి న్యాయ అధికారిగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి మలయాళీ మహిళగా అన్నాను భావిస్తారు.
1948లో ఆమె జిల్లా జడ్జి పదవి చేపట్టారు. 1959లో భారత్‌లో ఓ హైకోర్టులో జడ్జి పదవి చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు.
మహిళలకు తమ శరీరంపై హక్కులు ఉండాలన్న డిమాండ్‌ను అన్నా చాందీ చాలా చోట్ల లేవనెత్తేవారు.
ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్‌లో భారత్ వ్యాప్తంగా మహిళలకు గర్భ నిరోధక సాధనాల గురించి, పిల్లల ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చే క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కానీ, ఈ విషయంలో మహిళా సభ్యుల నుంచే ఆమె వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.
హైకోర్టు జడ్జి పదవి నుంచి రిటైరయ్యాక నేషనల్ లా కమిషన్‌లో అన్నా సభ్యురాలిగా చేరారు.
అన్నా చాందీ భర్త పీసీ చాందీ పోలీసు అధికారిగా పనిచేసేవారు. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు.
(చిత్రాలు: గోపాల్ శూన్య)
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ల మీద ఎందుకు ప్రశ్నించరు... :అభిప్రాయం
- న్యూడ్ బీచ్‌లో గ్రూప్ సెక్స్ పార్టీలు... ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
- కొత్త ‘బాబ్రీ’ మసీదు కట్టేది ఎక్కడ? ఎలా ఉంటుంది?
- డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ: తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందులు
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- జీడీపీ పతనం భయపెడుతున్నా.. ‘మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కాపాడొచ్చు.. ఎలాగంటే...‘
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)