You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతు ఆత్మహత్యల్లో ఏపీది మూడో స్థానం, తెలంగాణది నాలుగో స్థానం... పరిస్థితి మెరుగుపడిందా? దిగజారిందా?
- రచయిత, దీప్తీ బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికను విడుదల చేసింది.
గత ఏడాది దేశమంతటా 1,39,123 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు అందులో పేర్కొంది. వారిలో 10,281 మంది రైతులు, రైతు కూలీలని తెలిపింది. అంటే దేశంలోని జరుగుతున్న మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 7.4 శాతం మంది రైతులే ఉన్నారన్న విషయం ఈ తాజా నివేదిక ద్వారా అర్థమవుతోంది.
దేశంలో 10,281 ఆత్మహత్యలలో 5,957 మంది రైతులు కాగా 4,324 రైతు కూలీలు ఉన్నారు.
రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
తెలంగాణలో 2018లో 908, 2017లో 851 రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.
రికార్డుల ప్రకారం... 2019లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 499 మంది రైతుల్లో సొంత భూమి ఉన్నవారు 373 మంది, కౌలు రైతులు 118 మంది, రైతు కూలీలు ఎనిమిది మంది ఉన్నారు.
‘ప్రభుత్వ చర్యలు ఫలితాలనిస్తున్నాయి’: తెలంగాణ వ్యవసాయ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉంటున్నాయి. వాటిని నివారించేందుకే 2018 ఆగస్టులో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ చర్యల కారణంగానే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు.
“రైతు బంధు, రైతు బీమా పథకాలు, సాగు నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం, సకాలంలో విత్తనాల సరఫరా, మద్దతు ధరకే పంటలను కొనుగోలు చేయడం వంటి ప్రభుత్వ చర్యల కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి” అని ఆయన బీబీసీతో అన్నారు.
గోదాముల సంఖ్య పెంచిన కారణంగా రైతులకు పంట నష్టం తగ్గిందని నిరంజన్ రెడ్డి ఆన్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు, తెలంగాణ ప్రాంతంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డాక వాటి సామర్థ్యాన్ని 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని ఆయన తెలిపారు.
మరోవైపు ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా ఉందని అంటున్నాయి ప్రతిపక్షాలు.
“రైతులకు మద్దతు ధర పెంచాలి. వాణిజ్య పంటల సాగు పెంచాలి. రైతు ఆత్మహత్యలు అసలు ఎందుకు ఉండాలి? అన్నదాతల ఆత్మ హత్యలు లేకుండా చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలి” అని కాంగ్రస్ నేత గూడూరు నారాయణ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘కౌలు, ఆదివాసీ రైతులను విస్మరిస్తున్నారు’
రైతు ఆత్మహత్యలు తగ్గడంలో రైతు బంధు పథకం, ప్రభుత్వ పంట సేకరణ కొంత మేరకు ఉపయోగపడ్డాయని రైతు సంఘాల నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
మరోవైపు రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో నమోదు కావడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కన్నెగంటి రవి బీబీసీతో అన్నారు. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
“భూమి లేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల రైతులకు రైతు బంధు, రైతు బీమా అమలు కావడం లేదు. మహిళా రైతులను రైతులుగా గుర్తించడం లేదు’’ అని ఆయన అన్నారు,
కౌలు రైతులను గుర్తించి వారికి రైతుబంధు ఇవ్వగలిగితే... పోడు రైతులకు కూడా రైతు బంధు, రైతు బీమా పథకం వర్తింపజేస్తే రైతు ఆత్మహత్యలు మరింత తగ్గుతాయని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు.
“వ్యవసాయ కూలీలకు సమగ్ర సాంఘిక సంక్షేమ పథకం అమలు చేయాలి. ఈ కుటుంబాలకు కూడా బీమా పథకం అమలు చేయాలి. అప్పుడే రైతు ఆత్మహత్యలు తగ్గుతాయి” అని అన్నారు.
వీటన్నింటితోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఓ సమగ్ర వ్యవసాయ విధానం అవసరం అని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
రైతు ఆత్మహత్యల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోసం బీబీసీ సంప్రదించినప్పటికీ ప్రభుత్వ వర్గాల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)