You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ - చైనా సరిహద్దు ఘర్షణలు: ‘కొడవళ్లు బిగించిన కర్రలతో మోహరించిన చైనా సైనికులు’
భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. కొడవళ్లు బిగించిన కర్రలను ఆయుధాలుగా ధరించిన చైనా సైనికులు తూర్పు లద్ధాఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట మోహరించారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ పలు ఫొటోలను ప్రచురించింది.
ఈ చిత్రాలను భారత సైనిక వర్గాలు అందించినట్లు చెప్తున్నారు.
ఈ చిత్రాల్లో కనిపిస్తున్నదేమిటి?
దాదాపు 25మంది చైనా సైనికులు తుపాకీలు పట్టుకుని నిల్చున్నారు. కానీ తుపాకీలు కిందకు దించి ఉన్నాయి. అలాగే కొడవళ్లు బిగించిన కర్రలు కూడా వారి చేతుల్లో ఉన్నాయి.
ఈ ఫొటోలను ఎప్పుడు తీశారు?
భారత ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం (సెప్టెంబర్ 7) సూర్యాస్తమయానికి ముందే ఈ ఫొటోలను తీశారు. ఇవి తీసిన సమయాన్ని, ప్రదేశాలను బీబీసీ స్వతంత్రంగా నిర్ధారించలేదు.
ఇది ఎక్కడ?
ఇవి తూర్పు లద్దాఖ్‌లోని భారత దక్షిణ పోస్టు ముఖ్పారి వద్ద తీసినవని చెప్తున్నారు. వారు నిల్చున్న ప్రదేశానికి సుమారు 800 మీటర్ల దూరంనుంచీ వీటిని తీశారని, ఎల్ఏసీకి చైనా వైపు వారి సైనిక బలగాలు నిల్చున్నాయని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అసలు ఏం జరిగింది?
చైనా బలగాలు భారత పోస్టులను సమీపించడానికి ప్రయత్నించాయని, భారత సైన్యం హెచ్చరించనీ భారత ప్రభుత్వం అంటోంది.
అయితే వారు సరిహద్దు రేఖ వద్దే ఉన్నారు కానీ భారత పోస్టులవైపుగా ముందుకు కదలట్లేదని తెలిపింది.
అయితే ఈ బలగాలే కాల్పులు జరిపాయా లేక వీరిదే మరొక వర్గం కాల్పులు జరిపిందో స్పష్టంగా తెలీదుగానీ ఈ ఫొటో తీసిన తరువాత చైనా సైన్యం గాల్లోకి కాల్పులు జరిపిందని తెలిపారు.
నేపథ్యం ఏమిటి?
భారత సైనికులు సోమవారం నాడు రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరిపారని, వాస్తవాధీన రేఖను దాటడానికి ప్రయత్నించారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పశ్చిమ చైనా సైనిక విభాగం మంగళవారం నాడు ఆరోపించారు.
దీనికి బదులుగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో.. "ఏ దశలోనూ భారత సైన్యం సరిహద్దు రేఖను అతిక్రమించలేదని, రెచ్చగొట్టే ప్రయత్నాలుగానీ, కాల్పులుగానీ జరపలేదు’’ అని తెలిపింది.
చైనా సైన్యమే నిర్లక్ష్యంగా ఉల్లంఘనలను అతిక్రమిస్తోందని, కవ్వింపు చర్యలు చేస్తోందని ఆరోపించింది.
‘‘సోమవారం చైనా సైనికులు భారత సరిహద్దు ప్రాంతాల్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. భారత సైన్యం వారిని తరిమి కొట్టింది. చైనా సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ భారత జవాన్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు’’అని భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘చైనా సైనికులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. భారత సైనికులు బాధ్యతాయుతంగా, పరిణితితో వ్యవహరించారు. పశ్చిమ చైనా సైనిక విభాగం.. అందరినీ తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తోంది’’
అయితే, భారత సైన్యమే వాస్తవాధీన రేఖదాటి, కాల్పులు జరిపారని మొదట చైనా ఆరోపించింది. తాము సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ వైపు నుంచి స్పందన లేదని వివరించింది.
భారత బలగాలు ఒప్పందాలను ఉల్లంఘించాయని, ఇది తీవ్ర పరిస్థితులకు దారితీయొచ్చని చైనా అధికార ప్రతినిధి ఒకరిని ఉటంకిస్తూ ఆ దేశానికి చెందిన ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది.
మరోవైపు భారత వార్తా ఏజెన్సీ ఈ కాల్పులు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో జరిగినట్లు తెలిపింది.
భారత బలగాలు వాస్తవాధీన రేఖ దాటి పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని షెన్పాయో పర్వతం వరకు చేరుకున్నాయని చైనా సైన్యానికి చెందిన అధికార ప్రతినిధి, సీనియర్ కల్నల్ జాంగ్ షియూలీ చెప్పారు.
ఇది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించడమేనని.. భారత్ ఇలా రెచ్చగొట్టడం ఉద్రిక్తతలు పెరగడానికి దారి తీస్తుందని షియూలీ అన్నారు.
భారత బలగాలు తక్షణం వెనక్కు వెళ్లాలని, కాల్పులు జరిపిన వారిపై భారత సైన్యం చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఉల్లంఘనలు ముందుముందు జరగకుండా చూడాలని అన్నారు.
చైనా సైనికులు తమ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలరని ఆ దేశ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
భారత, చైనా విదేశీ వ్యవహారాల మంత్రులు రష్యాలో కలవనున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ నాలుగు రోజుల పర్యటనకు మాస్కో వెళ్తున్నారు. అక్కడ ఆయన సెప్టెంబరు 10న జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఎనిమిది సభ్య దేశాలున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌లో భారత్, చైనాలు రెండూ భాగస్వాములే.
జయశంకర్ మాస్కో వెళ్తూ మధ్యలో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అవుతారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)