కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్‌ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు

ఇటలీలో కోవిడ్

ఫొటో సోర్స్, Reuters

ఇటలీలోని రెండు నగరాల్లో మురికి కాల్వల్లోని నీటిని డిసెంబర్ నెలలో పరీక్షిస్తే వాటిలో కరోనావైరస్ ఆనవాళ్ళు కనిపించాయని అక్కడి శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే, ఇటలీలో మొదటి కరోనా కేసు బయటపడడానికి చాలా ముందే అక్కడ ఈ వైరస్ ఉందన్నమాట.

మిలాన్, ట్యూరిన్ నగరాల్లోని మురుగు నీటిలో జెనెటిక్ వైరస్ కనిపించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐఎస్ఎస్) డిసెంబర్ 18న వెల్లడించింది.

కరోనావైరస్ ప్రపంచం అనుకుంటున్న దాని కంటే చాలా ముందే వచ్చి ఉండవచ్చని కొన్ని దేశాల్లో కనిపిస్తున్న ఆధారాలకు ఇది బలం చేకూర్చింది.

చైనా అధికారులు మొదటి కరోనా కేసులను డిసెంబర్ నెలాఖర్లో ధ్రువీకరించారు. ఇటలీలో తొలి కేసు ఫిబ్రవరి మధ్యలో నమోదైంది.

పారిస్‌ సమీపంలో డిసెంబర్ 27న న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తి నమూనాలను పరీక్షించినప్పుడు, అతడు కరోనావైరస్ కలిగి ఉన్నాడని తేలిందని ఫ్రెంచి శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇక, స్పెయిన్‌లో జరిపిన పరిశోధనలు కూడా కరోనావైరస్ అనుకున్నదాని కన్నా ముందే వ్యాపించినట్లు గుర్తించాయి. జనవరి నెల మధ్యలో బార్సిలోనాలో వృథా నీటిని పరీక్షించినప్పుడు అందులో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంటే, ఆ దేశంలో తొలి అధికారిక కేసు నమోదు కావడానికి 40 రోజుల ముందే ఇది జరిగిందన్నమాట.

ఐఎస్ఎస్ శాస్త్రవేత్తలు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్తర ఇటలీలోని మురుగు నీటి ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి సేకరించిన 40 నమూనాలను పరీక్షించారు. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సేకరించిన నమూనాల్లో వైరస్ పరీక్షలు నెగెటివ్ వచ్చాయి. అంటే, అప్పటికి దేశంలోకి వైరస్ రాలేదని ఐఎస్ఎస్ నీటి నాణ్యత నిపుణులు గియెసెప్పినా లా రోసా అన్నారు. బోలోగ్నా నుంచి సేకరించిన మురుగు నీటిలో జనవరి నెలలో చేసిన పరీక్షల్లో కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. ఇటలీలో అసలు ఈ వైరస్ ఎలా మొదలైందో తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని లా రోసా చెప్పారు. అలాగని, ఈ తొలి అనవాళ్ల నుంచి దేశంలో మహమ్మారి విస్తరించిందని అనుకోలేమని ఆమె అన్నారు.

ఇటలీ మిలాన్

ఫొటో సోర్స్, Reuters

ఇటలీలో దిగుమతి కాని మొదటి కరోనా కేసు లాంబార్డీ ప్రాంతంలోని కోడోనోలో నమోదైంది. ఆ పట్టణాన్ని జనవరి 21న రెడ్ జోన్‌గా ప్రకటించి పూర్తిగా దిగ్బంధించారు. మార్చి మొదటి వారానికి దేశంలో మరో తొమ్మిది నగరాలను ఇలాగే దిగ్బంధం చేయాల్సి వచ్చింది.

వైరస్ వ్యాప్తిని ముందస్తుగా గుర్తించడంలో మురుగు నీటికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ఈ పరీక్షల ఫలితాలు ధ్రువీకరించాయని ఐఎస్ఎస్ చెబుతోంది. వైద్య పరీక్షల ద్వారా రోగ నిర్ధరణకు ముందే ఇది దాని ఆనవాళ్లను గుర్తించిందని ఆ సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే పద్ధతిని చాలా దేశాలు అనుసరిస్తున్నాయి.

పర్యటక రిసార్టుల వద్ద మురుగు నీటి పర్యవేక్షణ చేసే పైలట్ ప్రాజెక్టును వచ్చే జూలైలో ప్రారంభిస్తున్నట్లు ఐఎస్ఎస్ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా మురుగు నీటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఇటలీలో కోవిడ్-19 వల్ల 40 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)