కరోనావైరస్ - దలైలామా : "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు"

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న వేళలో కూడా ప్రజలు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండటం పట్ల బౌద్ధ మత గురువు దలైలామా ఆశావాదంతో ఉన్నారు. బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్తో దలైలామా మాట్లాడారు.

ప్రపంచంలోని 700 కోట్ల జనాభా అంతా ఈ విపత్తు సమయంలో ఏకమైతే వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం లభించవచ్చునని దలైలామా అన్నారు.

“గతంలో తొలిసారి నేను ఆయనను కలిసినప్పుడు దలై లామా నా బుగ్గని పట్టుకుని లాగడం నాకింకా గుర్తుంది. బ్రతికున్న దేవుడిగా చూసే అనుచరులున్న ఒక వ్యక్తి అలా చేయడం సాధారణ విషయం కాదు” అని రౌలట్ గుర్తు చేసుకున్నారు.

కానీ, దలైలామా చాలా చతురతతో ప్రవర్తిస్తారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా బుగ్గ నిమరడం సాధ్యం కాకపోవచ్చు. పైగా జస్టిన్ రౌలట్ లండన్ ఆఫీస్ నుంచి, దలైలామా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ధర్మశాల నుంచి ఈ వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

మంచు పర్వతాల నుంచి వచ్చే వెలుగు దలైలామా గదిలోకి ప్రసరిస్తోంది. అప్పుడు భారత కాల మానం ప్రకారం ఉదయం 10 గంటలైంది.

అందమైన మంచు పర్వతాల మధ్యలో లాక్ డౌన్‌లో ఉండటం కన్నా ఆనందమేముంటుందని దలైలామా కూడా ఒప్పుకుంటారు.

"ఇక్కడ మాకు స్వచ్ఛమైన నీరు, గాలి దొరుకుతుంది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉంటా’’ అని ఆయన సహజ శైలిలో నవ్వుతూ అన్నారు.

ఈ కరోనావైరస్ మహమ్మారి సమయంలో బాధపడుతున్నవారు, భయపడుతున్నవారి గురించి ఆయన ఆలోచిస్తున్నారు.

చాలా మంది తమ జీవితాల గురించి కూడా పట్టించుకోకుండా పక్కవారికి సహాయం చేయడాన్ని ఆయన ప్రశంసిస్తూ, ఇదంతా ఆనందించే విషయమని అన్నారు.

ఏదైనా ఆపద తలెత్తినప్పుడే మానవ విలువలు కూడా బయటకు వస్తాయని అన్నారు.

వీటి గురించి సాధారణంగా ఆలోచించని వారు కూడా ఆపద సమయంలో ఆదుకుంటారని అన్నారు.

ఈ విపత్తు గురించి భయపడుతున్న వారికి సలహా ఇస్తూ, దీని గురించి ఎక్కువగా ఆలోచించ కుండా ఉండటం ముఖ్యమని అన్నారు.

“మీరున్న పరిస్థితుల్లోంచి బయటకు రావడానికి మార్గముంటే ప్రయత్నించండి. అంతే గాని, విచారిస్తూ కూర్చోవడం వలన లాభం లేదు” అని ఆయన అన్నారు.

“మీరేమి చేయలేనప్పుడు విచారించి లాభం లేదు. వృద్దాప్యంలా పరిస్థితిని ఆమోదించటం ఒక్కటే మార్గం”.

దలైలామాకి మరి కొన్ని వారాలలో 85 సంవత్సరాలు వస్తాయి.

"యువతకి సరికొత్త ఆలోచనలు ఉంటాయి. వారు ప్రపంచ భవిష్యత్ కోసం బాగా ఆలోచించగలరు. కానీ వాళ్లు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు”.

“వృద్దులకు అనుభవం ఉంటుంది. వారు యువతకి మార్గదర్శకం చేయగలరు. వారిని ప్రశాంతంగా ఉండమని చెప్పగలరు” అని నవ్వుతూ అన్నారు.

ప్రపంచం ముందున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన పర్యావరణ సమస్యలను నివారించడానికి యువత ముందుంటారని ఆయన భావిస్తున్నారు.

తన జీవితకాలంలోనే భూమిపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని చూశానని దలైలామా చెప్పారు. ఆయన యవ్వనంలో ఉన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

14వ దలైలామా 1935లో టిబెట్‌లో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు.

1937లో ఆయనను 13వ దలైలామా అవతారంగా గుర్తించారు.

"నాకు పర్యావరణం గురించి తెలియదు. దానిని తేలికగా తీసుకున్నాం. అప్పట్లో అక్కడ (టిబెట్‌లో) ప్రవహించే సెలయేరుల్లో నీటిని తాగేవాళ్ళం” అని ఆయన అన్నారు.

ఆయన తర్వాత ప్రపంచ పర్యటన చేసినప్పుడు, భారతదేశం వచ్చినప్పుడు, పర్యావరణానికి ఎంత హాని కలిగిందో అర్థమైందని అన్నారు.

‘‘నేను 1960లో ధర్మశాలకి వచ్చాను. ఆ శీతాకాలంలో ఇక్కడ చాలా మంచు ఉండేది. ప్రతి సంవత్సరం అది తగ్గిపోతోంది. గ్లోబల్ వార్మింగ్‌ని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

శిలాజ ఇంధనాల వాడకంపై ఆధారపడకుండా సహజ వనరులైన గాలి, సూర్య కాంతిని వినియోగించుకునే ప్రయత్నాలు చెయ్యాలని ఆయన ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు.

"మనం కేవలం వ్యక్తులం కాదు, మనం సమాజంలో భాగం".

"నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" అని దలైలామా అన్నారు.

"గతంలో నా ఖండం, నా దేశం, నా మతం అనే సిద్ధాంతాలను చాలా విశ్వసించేవారు. అయితే అలాంటి ఆలోచనలు ఇప్పుడు పాతబడిపోయాయి. ఇప్పుడు 700 కోట్ల ప్రపంచ జనాభా ఐక్యం కావల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.

ఈ కరోనావైరస్ మహమ్మారి మానవాళి అంతటిని ఒకే తాటి పైకి తెస్తుందేమోనని అభిప్రాయ పడ్డారు.

కరోనావైరస్‌ని ఎదుర్కోవడానికి ప్రపంచం త్వరగానే మేల్కొన్నప్పటికీ , గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పొంచి ఉన్న మరో ప్రమాదమని అభిప్రాయపడ్డారు.

కొన్ని రోజులకు ఇది నియంత్రణ చేసే దశ దాటిపోవచ్చనే ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

భావోద్వేగాలను ఎలా మలుచుకోవాలనే విషయంలో ప్రపంచమంతా కలిసి పని చేయాలని అన్నారు.

‘‘ఈ బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంది తప్ప మతంపై కాదు. మనస్సును ఎలా శాంతంగా ఉంచుకోవాలి, శాంతిని ఎలా పెంపొందించుకోవాలనే విషయాలపై సాధన చేయడం ముఖ్యం’’ అని తెలిపారు.

దలైలామా మరణం తర్వాత టిబెటన్ బుద్ధిజం, టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమ పరిస్థితి ఏమిటి?

చైనా 1950లో టిబెట్‌కు సైన్యాన్ని పంపించి, ఆ ప్రాంతం తమ సొంతం అని ప్రకటించింది.

ఇది అక్రమ ఆక్రమణ అని టిబెట్ దేశస్థుల అభిప్రాయం.

టిబెట్ ప్రజల మత గురువుగా దలైలామా ఈ ఆక్రమణని వ్యతిరేకించారు.

తన మరణం దలైలామా వారసత్వానికి ముగింపు కావచ్చని అన్నారు. టిబెట్‌లో దలైలామా అంటే గొప్ప నాయకుడని అర్ధం.

తర్వాత ఏమి జరుగుతుందో, 14వ దలై లామా అవతరించారో లేదో, టిబెట్‌లో, మంగోలియాలో ఉన్న హిమాలయ బౌద్ధులు నిర్ణయిస్తారని చెప్పారు.

అయన గతంలో పంచెన్ లామాగా గుర్తించిన బాలుడు 1995లో అపహరణకు గురయ్యారు. సాధారణంగా తర్వాత దలైలామాను గుర్తించే ప్రక్రియను పంచెన్ లామా చేపడతారు.

ఆయన అనుచరులు ఏ నిర్ణయం తీసుకున్నా తనకి ఎటువంటి అభ్యంతరం అభ్యంతరం లేదని అన్నారు.

‘‘ఎందుకంటే ఇందులో నాకు ఎలాంటి ఆసక్తీ లేదు’’ అని ఆయన నవ్వుతూ అన్నారు.

ఆయన కన్ను మూసే సమయానికి ఆయన మానవాళికి సహాయం చేసిన వ్యక్తిగా మంచి పేరు మిగిలి ఉండాలని మాత్రం ఆశిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)