లిబియా వలసదారుల నిర్బంధ కేంద్రంపై వైమానిక దాడి, 44 మంది మృతి

వైమానిక దాడి జరిగిన ప్రదేశంలో బాంబు ధాటికి ఏర్పడ్డ గొయ్యి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైమానిక దాడి జరిగిన ప్రదేశంలో బాంబు ధాటికి ఏర్పడ్డ గొయ్యి

ఉత్తరాఫ్రికాలోని లిబియాలో ఒక వలసదారుల నిర్బంధ కేంద్రంపై జరిగిన వైమానిక దాడిలో 44 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా వలసదారులు.

బుధవారం దేశ రాజధాని ట్రిపోలి తూర్పు శివారు టజౌరాలో ఈ ఘటన జరిగింది. ఇందులో మరో 130 మందికి గాయాలయ్యాయి.

ఇటీవలి కాలంలో, ఐరోపాకు వలస వెళ్లాలనుకునే వలసదారులకు లిబియా ముఖ్యమైన మజిలీగా మారింది.

లిబియాను సుదీర్ఘకాలం పాలించిన మువమ్మర్ గడాఫీ 2011లో పదవీచ్యుతుడై చనిపోయిన తర్వాత నుంచి దేశంలో పెద్దయెత్తున హింస చెలరేగుతోంది.

లిబియా

ఫొటో సోర్స్, AFP

ఒక హాంగర్ (విమానాలను నిలిపి ఉంచే ప్రదేశం)లో 600 మంది వలసదారులు ఉన్నారని, అక్కడ నేరుగా వైమానిక దాడి జరిగిందని అత్యవసర సేవల విభాగ అధికార ప్రతినిధి ఒసామా అలీ ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపారు. మృతుల సంఖ్య 44 కంటే ఎక్కువే ఉండొచ్చని చెప్పారు.

చనిపోయినవారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని యూఎన్ మద్దతున్న రాజకీయ చర్చల గ్రూపు సభ్యుడు గుమా ఎల్-గమాటీ బీబీసీతో చెప్పారు.

"క్యాంపు మొత్తం ధ్వంసమైంది. అంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. లైట్లు లేవు. ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. అంబులెన్సులు వస్తే గానీ తెలియలేదు, ఎక్కడ చూసినా రక్తం, శరీరభాగాలే" అని అక్కడి పరిస్థితిని బీబీసీకి వివరించారు డాక్టర్ ఖలీద్ బిన్ అట్టియా.

'లిబియన్ నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఏ)'గా చెప్పుకొనే సంస్థే ఈ దాడికి పాల్పడిందని 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్(జీఎన్‌ఏ)' తెలిపింది. ప్రధానమంత్రి ఫాయెజ్ అల్-సెరా నాయకత్వంలోని జీఎన్‌ఏకు ఐక్యరాజ్య సమితి మద్దతు ఉంది.

ఎల్‌ఎన్ఏకు ఖలీఫా హఫ్తార్ నాయకత్వం వహిస్తున్నారు.

వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో అంతర్జాతీయ గుర్తింపున్న ప్రభుత్వానికి విధేయులైన సైనికులతో ఎల్‌ఎన్‌ఏ పోరాడుతోంది.

ప్రభుత్వానికి విధేయులైన సైనికులు ఖలీఫా హఫ్తార్ నాయకత్వంంలోని ఎల్‌ఎన్ఏపై పోరాడుతున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వానికి విధేయులైన సైనికులు ఖలీఫా హఫ్తార్ నాయకత్వంంలోని ఎల్‌ఎన్ఏపై పోరాడుతున్నారు

ట్రిపోలిలో పెద్దయెత్తున వైమానిక దాడులు మొదలుపెడతామని ఈ సంస్థ సోమవారం ప్రకటించింది. బుధవారం వలసదారుల కేంద్రంపై దాడి మాత్రం తమ పనికాదని ఎల్‌ఎన్ఏ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

లిబియా గుండా ఐరోపాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వేల మందిని లిబియా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధ కేంద్రాల్లో ఉంచింది. చాలా కేంద్రాలు యుద్ధ క్షేత్రాలకు దగ్గరగా ఉన్నాయి.

ఈ కేంద్రాల్లో పరిస్థితులు బాగోలేవని మానవ హక్కుల గ్రూపులు ఆరోపిస్తున్నాయి.

వలసదారుల బోట్లను అడ్డుకొనేందుకు లిబియా కోస్ట్ గార్డ్‌కు ఐరోపా కమిషన్ సహాయ సహకారాలను పెంచింది.

ఐరోపాకు వలస వెళ్లాలనుకొనే నిస్సహాయ వలసదారుల నుంచి మనుషులను తరలించే ముఠాలు వేల డాలర్లు వసూలు చేసి సొమ్ము చేసుకొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)