నైజీరియా: టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ఆత్మాహుతి దాడి.. 30మంది మృతి

చికిత్స పొందుతున్న గాయపడిన వ్యక్తులు

ఫొటో సోర్స్, AFP

ఈశాన్య నైజీరియాలో టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా హాల్ బయట ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 30మంది మరణించారని అధికారులు తెలిపారు. మూడుచోట్ల జరిగిన పేలుళ్లలో 40 మంది గాయపడ్డారని నైజీరియా అత్యవసర సేవల విభాగం తెలిపింది.

ఈ దాడి వెనుక ఇస్లాం మిలిటెంట్ సంస్థ బోకో హరామ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ దాడి గురించి ఆ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

బోర్నో రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సంస్థ, గత దశాబ్ద కాలంగా ఈశాన్య నైజీరియాలో తిరుగుబాటు చేస్తోంది.

టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తున్న హాల్ యజమాని, ఒక ఆత్మాహుతి బాంబర్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడని, కొండుగ లోని ఆత్మరక్షణ సంస్థకు చెందిన అలీ హసన్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు.

''తనను తాను పేల్చుకోవడానికి ముందు ఆ సుసైడ్ బాంబర్‌కు, టీవీ హాల్ ఆపరేటర్‌కు వాగ్వివాదం తారాస్థాయిలో జరిగింది'' అని ఆయన అన్నారు.

టీవీ హాల్ వద్ద బాంబు పేలగానే, సమీపంలోని మరో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు కూడా పేలుడు జరిపారు.

గతంలో కూడా కొండుగ ప్రాంతం లక్ష్యంగా దాడులు జరిగాయి. 2018 జూలైలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగినపుడు 8 మంది చనిపోయారు.

బోకో హరామ్‌తో జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకూ కనీసం 27వేల మంది చనిపోగా, 20లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లారు.

నైజీరియా మ్యాప్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)