You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పౌర్ణమి: నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
పౌర్ణమికీ జీవితంలోని అనేక విషయాలకు సంబంధముందనే ఎన్నో ప్రచారాలు చాలా కాలంగా ఉన్నాయి. నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం వీటిలో ఒకటి. ఇందులో నిజమెంత?
గతంలో పౌర్ణమి రోజు ప్రయోగశాల వాతావరణంలో 33 మంది వాలంటీర్లపై అధ్యయనం జరిపిన స్విట్జర్లాండ్‌లోని బాసిల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు- మనిషి నిద్రకూ, చంద్రుడికీ సంబంధముందనే ఆధారాన్ని గుర్తించారు.
ఈ వాలంటీర్లకు తమపై జరుగుతున్న అధ్యయనం ఉద్దేశం తెలియదు. చంద్రుడు కనిపించని ప్రదేశంలో, చీకటిలో వీరు నిద్రించారు.
అధ్యయన ఫలితాలు ఏమిటంటే-
1. నిద్రలోకి జారుకోవడానికి అదనంగా ఐదు నిమిషాలు పట్టింది.
2. మొత్తమ్మీద 20 నిమిషాలు తక్కువగా నిద్రపోయారు.
3. గాఢనిద్ర సమయం 30 శాతం తగ్గింది.
వీరి నిద్రలో మార్పులకు పౌర్ణమి రోజు చంద్రుడి నుంచి వెలువడే అదనపు కాంతి కారణం కాదని పరిశోధకులు చెప్పారు. ఎందుకంటే వీరు చీకటిగా ఉన్న గదిలో నిద్రపోయారని, వీరిపై చంద్ర కాంతి పడనేలేదని ప్రస్తావించారు.
వీరికి చంద్రుడి పరిభ్రమణ కాలానికి అనుగుణంగా నిద్ర అలవాటు అయ్యుండొచ్చని, వీరి నిద్రలో మార్పులకు ఇదో ముఖ్యమైన కారణం అయ్యుండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఈ పరిశోధన వివరాలు 2013లో 'కరెంట్ బయాలజీ' పత్రికలో ప్రచురితమయ్యాయి.
చంద్రుడిని నేరుగా చూడకపోయినా, చంద్రుడి పరిభ్రమణం ఏ దశలో ఉందనేది తెలియకపోయినా చంద్రుడి పరిభ్రమణ దశలు మనిషి నిద్రను ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టియన్ కాజోచెన్ అభిప్రాయపడ్డారు.
పౌర్ణమి ప్రభావముంటే మనం ఏమైనా చేయగలమా?
నిద్రపై పౌర్ణమి ప్రభావానికి ఆ రోజు చంద్రుడి నుంచి వెలువడే అదనపు కాంతే కారణమైతే కంటికి మాస్కులు ధరించడం లాంటి చర్యలు దీనిని ఎదుర్కోవడంలో ఉపకరిస్తాయని నిద్ర సంబంధిత అంశాల నిపుణుడు నీల్ స్టాన్లీ చెప్పారు.
నిద్రలో మార్పులకు పౌర్ణమి నాటి అదనపు చంద్రకాంతి కారణం కాదని స్విట్జర్లాండ్‌లోని బాసిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన చెబుతోంది.
నిద్రపై పౌర్ణమి ప్రభావం ఉంటే మనం ఏమైనా చేయగలమా అనే ప్రశ్న ఆసక్తికరమైనదేనని, కానీ వాస్తవానికి చేయగలిగింది పెద్దగా ఏమీ లేదని బ్రిటన్‌కు చెందిన నీల్ స్టాన్లీ వ్యాఖ్యానించారు. ''మనకు ఇష్టమున్నా, లేకున్నా నెలకు కనీసం ఒకసారైనా పౌర్ణమి వస్తుంది కదా'' అన్నారు.
నిద్రకు సంబంధించిన మరిన్ని కథనాలు..
నిద్రపై పౌర్ణమి ప్రభావం ఉంటుందనే నమ్మకం ఉందని, అది వాస్తవమా, కాదా అన్నది నిర్ధరణ కావాల్సి ఉందని ఆయన తెలిపారు.
2013లో బాసిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన ఫలితం సంచలనం సృష్టించిందని, దీనిని నిర్ధరించుకొనేందుకు ఎక్కువ మంది వ్యక్తులతో మరో పరిశోధన నిర్వహించాల్సి ఉందని, కానీ ఈ అంశంపై అప్పట్నుంచి ఇప్పటివరకు పరిశోధన జరగలేదని ఆయన చెప్పారు.
పౌర్ణమి రోజు తమకు నిద్ర సరిపోలేదని ఎవరైనా చెబితే, అందుకు పౌర్ణమే కారణం కానక్కర్లేదని నీల్ స్టాన్లీ అభిప్రాయపడ్డారు. నిద్రపై పౌర్ణమి ప్రభావం ఉంటుందనే నమ్మకానికి తగినట్లుగా వారిలో అలాంటి ఆలోచన కలగొచ్చన్నారు.
పున్నమి రోజు ప్రమాదాలు, హింసాత్మక ఘటనలు, మానసిక సమస్యల కేసులు ఎక్కువనే భావన కూడా ఉంది. 2007లో బ్రిటన్‌లోని బ్రైటన్ నగరంలోనైతే పౌర్ణమి రోజు పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందిని విధులకు రప్పించారు. పున్నమి రోజు హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని వారి పరిశోధనలో తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పౌర్ణమి రోజు వ్యక్తులు చిత్రంగా, అసహజంగా ప్రవర్తించడం, వాదనకు దిగడం లాంటివి పోలీసు అధికారిగా 19 ఏళ్ల తన అనుభవంలో చూశానని అప్పట్లో ఇన్‌స్పెక్టర్ ఆండీ పార్ చెప్పారు.
పున్నమి సమయంలో ప్రసవాలు, ఆత్మహత్యలు అధికమని, నిద్రలో నడవడం ఎక్కువని, మనుషులను జంతువులు కరవడం ఎక్కువనే ప్రచారమూ ఉంది. ఇవి నిజమేననే ఆధారాలేవీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో లభించలేదు.
ఇవి కూడా చదవండి:
- గుడిలో కనిపించింది గుడ్లగూబ.. గరుడపక్షి కాదు
- చంద్రునిపై సాయి ముఖం: ఎందుకు అలా కనిపిస్తుంది?
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా, ఉండదా
- "బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంటే, పిల్లల పెంపకంపై ప్రకటనలు చూపిస్తారా?"
- రాయలసీమకు ఆ పేరు ఎలా.. ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు?
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- బీబీసీ లైబ్రరీ: గ్రాఫిక్స్ లేని కాలంలో... బొమ్మలతో విజువల్ ఎఫెక్ట్స్ ఇలా చేసేవారు...
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)