You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రునిపై సాయి ముఖం: ఎందుకు అలా కనిపిస్తుంది?
చంద్రునిలో సాయిబాబా ముఖం కనిపిస్తోందంటూ తెలుగు రాష్ర్టాల్లో ముమ్మర ప్రచారం జరుగుతోంది. కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఫలానా ఆకారం కనిపించింది అని ఎవరో ఒకరు అనడం అది కాస్తా వైరల్గా మారడం కొత్త విషయమేమీ కాదు.
చాలా కాలంగా మానవులు చంద్రుడిలో, మేఘాల్లో, వస్తువుల్లో ముఖాలను చూస్తున్నారు. ఇలా మన చుట్టుపక్కల వాటిలో ముఖాలను చూడడం వెనుక కారణం ఏమిటి?
చాలా మంది పారడోలియా అన్న పదం విని ఉండరు. కానీ ప్రతి ఒక్కరికీ ఇది ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చి ఉంటుంది.
పారడోలియా అంటే లేని వాటిని ఊహించుకోవడం.
చంద్రుడిలో రెండు కళ్లు, ఒక ముక్కు, నోరు కనిపించిన వారిపై ఈ పారడోలియా ప్రభావం ఉందని అర్థం. అలాగే మేఘాల్లో జంతువుల ఆకారాలను చూసేవారిపై కూడా.
కొంత కాలం క్రితం జర్మనీకి చెందిన డిజైన్ స్టూడియో 'ఓన్ఫర్మేటివ్' పారడోలియాపై ఒక పరిశోధన చేసింది. ఆ సంస్థ గూగుల్ ఫేసెస్ కార్యక్రమం కింద ముఖం లాంటి రూపాలను పరిశోధించే పనిలో భాగంగా భూగోళాన్ని వివిధ కోణాల నుంచి స్కాన్ చేసింది. దానిలో పలు రకాల రూపాలు బయటపడ్డాయి.
అయితే ఇలా లేని మొహాలు కనిపించడం అది మొదటిసారేమీ కాదు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ రూపంలోని చికెన్ నగెట్ ఈబేలో సుమారు రూ.5 లక్షలకు అమ్ముడుపోయింది.
దానికి ముందు ఒక చపాతీలో ఏసుక్రీస్తు ముఖం కనిపిస్తోందంటూ క్రైస్తవులు తండోపతండాలుగా బెంగళూరుకు వెళ్లారు.
1994లో అమెరికాకు చెందిన డయానా డయ్సర్ ఒక చీజ్ టోస్టీ ముక్కను తిన్నపుడు ఆమెకు దానిలో వర్జిన్ మేరీలాంటి రూపం కనిపించింది. ఆమె దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు దానిని భద్రంగా దాచుకున్నారు. ఆ తర్వాత ఆమె దానిని ఈబేలో సుమారు రూ.20 లక్షలకు విక్రయించారు.
కానీ ఎందుకు ప్రజలకు కొండల్లో లేదా మేఘాల్లో ముఖాలు కనిపిస్తాయి?
దీనికి మనుషుల పరిణామ వారసత్వం కొంత కారణమని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ నౌషీన్ హాడ్జిఖాని తెలిపారు. పుట్టుక నుంచే ముఖాలను గుర్తించడం మనిషి లక్షణం.
''అప్పుడే పుట్టిన పిల్లలను తీసుకుంటే, మనుషుల మొహాలను చూసి వాళ్లు తమ చుట్టూ ఉన్న ఇతర వస్తువుల్లో అలాంటి పోలికల కోసం వెదుక్కుంటారు'' అని ఆమె వివరించారు.
ఈ అలవాటు మానవుని పుట్టుక నుంచి ఉందని బ్రిటిష్ సైకలాజికల్ సొసైటీకి చెందిన క్రిష్టఫర్ ఫ్రెంచ్ కూడా అన్నారు.
''ఒక రాతి యుగం మనిషికి పొదల్లో శబ్దం వినిపిస్తుంది. అది పులేమో అని అతను అనుమానిస్తాడు. అది పులిగా భావించి పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడమా లేక నిర్లక్ష్యం చేసి దానికి ఆహారంగా మారిపోవడమా? అలాంటి సందర్భంలో అతను పొదల్లో పులిని 'చూస్తాడు' '' అని ఆయన వివరించారు.
మరికొందరు నిపుణులు మెదడు సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగానే ఇలాంటి భ్రాంతి ఏర్పడుతుందని చెబుతారు.
మన మెదడు నిరంతరం గీతలను, రూపాలను, రంగులను వడబోస్తుంటుంది. ఈ క్రమంలో మెదడు అప్పటికే తనలో నిక్షిప్తమైన రూపాలతో వాటిని పోల్చి చూసుకుంటూ ఉంటుంది. అలా కొన్నిసార్లు అసందిగ్ధంగా ఉన్నవాటిని తన లోపల ఉన్న రూపాలుగా ఊహించుకుంటుంది.
ప్రజల భావాలకు అనుగుణంగా కూడా పారడోలియా ఏర్పడుతుందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ సోఫీ స్కాట్ అన్నారు. టోస్టులో క్రీస్తు ముఖం కనిపించడం ఇలాంటిదే అంటారామె.
ఒకసారి జార్జి వాషింగ్టన్ రూపాన్నో, వర్జిన్ మేరీ ముఖాన్నో చూశాక, తర్వాత వాటిని చూడకుండా ఉండడం అసాధ్యం అంటారు 'ద సెల్ఫ్ ఇల్యూజన్' రచయిత బ్రూస్ హుడ్.
‘'భ్రాంతి లక్షణం అదే. అవి మీ మెదడుపై ఎంత తీవ్రమైన ముద్ర వేస్తాయంటే, వాటిని తొలగించుకోవడం అసాధ్యం'' అంటారాయన.
ఇక అద్భుతాలను విశ్వసించేవారైతే వాళ్లు భూతాలను ఆహ్వానించడం వరకు వెళతారు.
మరికొంత మందికి పారడోలియా అనేది అతీంద్రియ శక్తులకు సాక్ష్యంగా కనిపిస్తుంది. వాటిని విశ్వసించేవారు దేవుడే వాటిని సృష్టిస్తాడు అని భావిస్తారు.
పారడోలియా ప్రభావానికి గురయ్యే వారిలో దేవుణ్ని విశ్వసించే వారు మాత్రమే లేరు. అయితే ఎక్కువ శాతం మాత్రమే వాళ్లే ఉంటారు.
ఇప్పుడు చంద్రునిలో సాయి ముఖం
పారడోలియా ఒకరకమైన భ్రాంతి అయితే ఫొటో షాప్ చేసిన ఫొటోలు ఇంకో రకమైన వ్యవహారం. కొన్ని రోజులుగా తెలుగు రాష్ర్టాలు, కర్నాటకల్లో చంద్రునిలో సాయి ముఖం కనిపిస్తోందంటూ ఓ వాట్సాప్ మేసెజ్ వైరల్ అవడం వెనుక రెండు అంశాలూ ఉన్నాయి. ఒకరు ఒక ఫేక్ ఫొటో పెట్టి అదిగో చూశారా సాయి ముఖం అంటారు. పారడోలియా ప్రభావంలో ఉన్నవారు ఆ ముఖాన్ని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు.
గతంలోనూ చంద్రునిపై సాయి ఉన్న ఫొటోలు చాలా వచ్చాయి. ఒకసారి ఫై ఫొటో చూస్తే.. ఇలాంటి ఫేక్ ఫొటోలు ఎంత విసృతంగా.. ప్రచారంలో ఉన్నాయో అర్థం అవుతుంది.
వాటిపై పలువురు ఫొటో విశ్లేషకులు, నిపుణులు మాట్లాడుతూ.. ఇవి ఫేక్ ఫొటోలని స్పష్టం చేశారు.
"ఇప్పుడు వైరల్ అయిన చంద్రుడి మీద సాయిబాబా రూపం పెరుగుతున్న టెక్నాలజీకి ప్రతిరూపమే"నని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీరఘునందన్ అన్నారు.
మనిషికి కలిగే భ్రాంతి వేరు, అది ఫోటోలో ఇలా కనిపించదని ఆయన వివరించారు.
భువనేశ్వర్, కటక్‌లలో ఎనిమిదేళ్ల కిందట కూడా ఇలాంటి ఘటనే జరిగింది. "గతంలో కూడా పుట్టపర్తి సాయిబాబా, ఏసుక్రీస్తు కనిపించారని కూడా మెసేజ్‌లు పంపించారు. తాజాగా, పవన్ కల్యాణ్ కనిపించాడంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. ఇలాంటి పనులు కొందరు అత్యుత్సాహంతో చేస్తే మరికొందరు అజెండాతో చేస్తుంటారు" అని శ్రీరఘునందన్ చెప్పారు.
చంద్రునిపై సాయి ముఖం కనిపిస్తోందన్న వార్త వైరల్ కావడంతో.. అక్కడి వారు చాలా మంది బైనాక్యులర్లు చేతబట్టుకుని మేడపైకి ఎక్కి చంద్రునిలో సాయి బింబం కోసం వెదికారు.
చాలా మంది పూజలు చేశారు. చివరకు ఆ వార్త వదంతని తేలింది. ఎవరికీ ఏమీ కనిపించలేదు. అంతవరకూ జరిగిందంతా డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- అభిప్రాయం: ఫేస్‌బుక్, ట్విటర్లు బెంగాల్ గెజిట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి?
- మౌలిక సమస్యలపై మోదీ కేర్ గెలుస్తుందా?
- రహీబాయ్ పొపెరె: ఈమె విత్తనాల తల్లి; 114 రకాల విత్తనాలను రక్షించారు
- ఫెంటానిల్: ఇది హెరాయిన్ కన్నా ప్రమాదకరమైన డ్రగ్
- చైనాలో 'బస్ పూలింగ్'.. ప్రయాణికుల చెంతకు బస్సు
- సిక్కిం: ఎత్తయిన పర్వతాల్లో అత్యంత అందమైన విమానాశ్రయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)