త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?

    • రచయిత, అలెక్స్ థెరియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల ఒక పరిశోధనలో త్వరగా నిద్ర లేచేవారికీ, ఆలస్యంగా నిద్రలేచేవారికి మధ్య ఆరోగ్యపరమైన తేడాలను పరిశీలించగా.. ఆ పరిశోధన ఫలితాలు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకునేవారి ఆందోళనను పెంచేవిగా ఉన్నాయి.

ఆలస్యంగా లేచేవారు త్వరగా మరణించే అవకాశం ఉన్నట్లు, వారిలో మానసిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

కానీ రాత్రిళ్లు చాలా సేపటి వరకు మేల్కొనేవారికి నిజంగానే అన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా?

'సోషల్ జెట్ లాగ్'

'సోషల్ జెట్ లాగ్' అంటే మనం పని దినాలలో నిద్ర లేచే సమయానికి, వారాంతంలో నిద్ర లేచే సమయానికి మధ్య ఉన్న తేడా.

చాలా మంది ఉద్యోగులు ఈ సోషల్ జెట్ లాగ్ సమస్యను ఎదుర్కొంటుంటారు.

సాధారణంగా ఉద్యోగులు వారాంతానికి పూర్తిగా అలసిపోయి ఉంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసి అలసిపోయి, పని దినాల కన్నా ఎక్కువ సేపు నిద్రపోతారు.

ఈ సోషల్ జెట్ లాగ్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆరోగ్య సమస్యలు అంత ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులతో పాటు, జీవక్రియ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

ఉదయం త్వరగా లేచేవారితో పోలిస్తే, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని, ఆలస్యంగా నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని మ్యూనిచ్‌లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటికీ చెందిన ప్రొఫెసర్ టిల్ రోయెన్‌బర్గ్ తెలిపారు.

అదే విధంగా త్వరగా నిద్రలేచేవారిని రాత్రి పొద్దు పోయేవరకు పని చేయిస్తే దాని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయని స్లీప్ అండ్ సర్కాడియన్ న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్రొఫెసర్ రసెల్ ఫోస్టర్ తెలిపారు.

'ఇది మానవ జీవశాస్త్రమా?'

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయేవాళ్లు ఈ సమస్యను ఎలా అధిగమించాలి?

వారు వారాంతంలో ఆలస్యంగా మేల్కొనే అలవాటును మానుకోవాలా? అవసరం లేదంటారు ప్రొఫెసర్ రోయెన్‌బర్గ్.

రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొనడం అంత అనారోగ్యకరమైనది కాదనేది ఆయన అభిప్రాయం.

మనం ఎప్పుడు నిద్ర పోతాం, ఎప్పుడు మేల్కొంటాం అన్నది అలవాటూ కాదు, అది క్రమశిక్షణకు సూచికా కాదు.

అది మన జీవ గడియారం మీద ఆధారపడి ఉంటుంది.

ఇది దాదాపు 50 శాతం మన జన్యువుల చేత నిర్ధారించబడుతుంది. మిగతాది మన చుట్టూ ఉన్న వాతావరణం, మన వయస్సు మీద ఆధారపడుతుంది.

దాదాపు 20 ఏళ్ల వయసు వరకు ఆలస్యంగా నిద్రపోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ క్రమంగా మనుషులు త్వరగా లేవడం ప్రారంభిస్తారు.

''ఆలస్యంగా లేచేవాళ్లు ఎందుకూ పనికి రారని, ఆలస్యంగా పడుకునే వాళ్లు చాలా బద్ధకస్తులని మన మెదళ్లలో నాటారు. కానీ నిజానికి అది మానవ జీవశరీరధర్మం'' అంటారు సర్రే యూనివర్సిటీకి చెందిన మాల్కమ్ వాన్‌స్కాంట్జ్.

అలా భావిస్తే తప్పే..

త్వరగా నిద్ర లేవగానే చురుగ్గా ఉంటారని భావిస్తే మాత్రం తప్పే.

వారం మొత్తంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల వారాంతంలో కూడా త్వరగా నిద్ర లేస్తే దాని వల్ల లభించాల్సినంత విశ్రాంతి కూడా లభించదని నిపుణులు చెబుతున్నారు.

దీనికి పరిష్కారంగా.. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొనేవారు తమ జీవ గడియారాలను వెలుతురుకు అనుగుణంగా మార్చుకోవాలి.

మన జీవగడియారం సూర్యోదయం, సూర్యాస్తమయం చేత ప్రభావితమౌతాయి. కానీ మనలో చాలా మందికి పగటి పూట చాలా తక్కువ సూర్మరశ్మి లభిస్తుంది. రాత్రిళ్లు చాలా ఎక్కువ కృత్రిమ వెలుతురులో ఉండడం జరుగుతోంది.

దీని వల్ల మనకు నిద్ర వచ్చే సమయం ఆలస్యం అవుతోంది.

అందువల్ల ఉదయం సూర్యరశ్మిలో తిరగడం, రాత్రిళ్లు కృత్రిమ వెలుతురును తగ్గించుకోవడం - మరీ ప్రత్యేకించి ఫోన్లు, లాప్ ట్యాప్‌లు లాంటి శక్తిమంతమైన నీలి రంగును వెదజల్లే వాటికి దూరంగా ఉండడం వల్ల, త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)