You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నిద్ర లేచాడు.. భార్యను మరచిపోయాడు’
- రచయిత, సౌదా అలీ
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
అప్పటికి ఆడమ్, రకీల్ గొంజలెస్‌లకు వివాహమై ఐదేళ్లయింది. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ఆడమ్.. తన భార్యను గుర్తుపట్టలేదు.
అసలామె ఎవరో అతడికి అర్థం కాలేదు. ఆమెను పెళ్లి చేసుకున్న జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. కానీ అతడిని మళ్లీ తన వాడిగా చేసుకోవడంలో విజయవంతమయ్యారు రకీల్. ఎలా?
రకీల్ 2016 సెప్టెంబర్‌లో ఒక రోజు ఉదయాన్నే నిద్ర లేచి హాలులోకి వెళ్లింది. అక్కడ ఆమె భర్త ఆడమ్ కూర్చుని ఉన్నాడు. అతడు తనను వింతగా చూస్తున్నాడు.
ఎవరో అపరిచితులతో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఎప్పటిలా ప్రేమాభిమానాలు ఏవీ కనిపించలేదు. అసలు ఆమె ఎవరో అతడికి తెలిసినట్లే లేదు.
‘‘నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? ఇది ఏ సంవత్సరమో తెలుసా? నా పేరు ఏమిటో తెలుసా?’’ ఆమె అతడిని అడిగారు.
అన్నిటికీ అతడి నుంచి ఒకటే సమాధానం.. ‘‘తెలీదు’’.
‘‘ఇంకా ప్రశ్నలు వేస్తుంటే.. అతడిలో ఆందోళన పెరుగుతోంది.’’
"ఇది మన ఇల్లే.. నేను మీ భార్యను.. మనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు" అని రకీల్ వివరించింది.
ఏమీ అర్థం కాని ఆడమ్ ఏడవడం మొదలుపెట్టాడు.
‘‘నా ఐడీ కార్డు ఎక్కడుంది? నా ఫోన్ ఎక్కడుంది? తెచ్చివ్వవా?’’ అనడిగాడతడు.
రకీల్‌లో ఆందోళన పెరిగిపోయింది. ఆడమ్‌కి ఏదో అయింది. అతడి మెదడులోని రక్తనాళాలకు ఏదో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అని ఆమె భయపడింది.
అతడిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలనుకుంది. బట్టలు వేసుకుని రెడీ అవ్వమని ఆడమ్‌కి చెప్పింది.
ఇంట్లో కప్‌బోర్డ్ తెరిచిన ఆడమ్ ‘‘నా సూట్లు ఎక్కడ?’’ అని అడిగాడు.
మీకు అసలు సూట్లు ఏవీ లేవని రకీల్ చెప్పింది.
ఆడమ్ రెడీ అయ్యాడు. అయిష్టంగానే తనకు 'తెలియని ఆ మహిళ' వెంట బయలుదేరాడు. ఆస్పత్రికి చేరుకున్నారు. ఇద్దరూ ఆందోళనలో ఉన్నారు. ఒకరినొకరు పట్టుకున్నారు.
ఆడమ్‌తో రకీల్ చాలా సున్నితంగా నడుచుకుంటోంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఇంతకుముందు కూడా ఓసారి ఇలాగే అతడు అన్నీ మరచిపోయాడు (మెమొరీ లాస్). ఒక మహిళ అతడిని చంపటానికి ప్రయత్నం చేసినపుడు అలా జరిగింది.
అది 2001వ సంవత్సరం. అప్పుడతడి వయసు 35 ఏళ్లు. టెలీకాం దిగ్గజం ఏటీ అండ్ టీలో ఆడమ్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. టెక్సాస్‌లోని లుబాక్‌లో చర్చి నాయకుడిగా కూడా ఉండేవాడు.
మొదటి పెళ్లి బ్రేకప్ అయ్యాక మరొక మహిళకు దగ్గరయ్యాడు. కానీ ఆ బంధం విషాదంగా ముగిసింది.
కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఓ కరెంటు తీగతో అతడి గొంతు నులిమింది. ఇక చనిపోయాడనుకుని గ్యారేజీలో వదిలి వెళ్లిపోయింది.
ఆస్పత్రికి తీసుకెళ్లేటపుడు అతడి గుండె మూడు సార్లు ఆగిపోయింది.
వైద్య సిబ్బంది ఆ గుండెను మళ్లీ పనిచేయించారు. ఆ తర్వాత ఆడమ్ నాలుగు నెలల పాటు కోమాలో ఉన్నాడు.
‘‘కళ్లు తెరిచాక నేనెవరో నాకు తెలియలేదు. నాకు పెళ్లయిందని, ఆ భార్య నుంచి విడిపోయానని, అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఏ విషయాలూ నాకు తెలియదు’’ అని ఆడమ్ చెప్తారు.
మళ్లీ మాట్లాడటం, నడవటం నేర్చుకోవటానికి అతడు ఏడాది పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. కానీ అతడి గత జీవిత జ్ఙాపకాలు తిరిగిరాలేదు.
ఆడమ్ తన కొడుకు, కూతురిని మళ్లీ కలిసేటప్పటికి కొన్ని నెలలు గడిచిపోయాయి. అతడు వారిని మొదటిసారి చూడటం పెద్ద సవాలే అయింది.
‘‘ఒక తండ్రి... తన రక్తమాంసాలు పంచుకుని పుట్టిన పిల్లలను ఎలా మరచిపోగలడు?’’ అని అతడు ప్రశ్నిస్తాడు.
చివరికి ఇంటికి వచ్చాడు. ఇంటి నిండా ఫొటోలున్నాయి. ఆ ఫొటోలేవీ అతడికి గుర్తు లేదు. అవార్డులున్నాయి. అవి తానే గెలుచుకున్నాడన్న జ్ఞాపకమూ లేదు. అతడి గతం మస్తిష్కం నుంచి చెరిగిపోయింది.
‘‘ఆ ఆడమ్ అనే మనిషి ఎవరు? అతడిలా నేను బతకగలనా? అది తెలుసుకోవటానికి నేను ప్రయత్నించాను’’ అని ఆయన అంటారు.
ఇక తన పాత ఉద్యోగానికి వెళ్లలేకపోయాడు. తన గత జీవన శైలిలో జీవించలేనేమోనని భయపడ్డాడు.
‘‘ఏ స్కూలుకు వెళ్లానో, ఏ కాలేజీకి వెళ్లానో నాకు గుర్తు లేదు. నేను వెళ్లినట్లు సాక్ష్యాలున్నాయి. కానీ నేనెలా వెళ్లాను? ఎలా గడిపాను? అంతా ఊహకందనిది’’ అంటారు ఆడమ్.
ఉన్న నగరం విడిచి కొత్త జీవితం ఆరంభించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరానికి వచ్చాడు. తన పిల్లలతో కలిసి.
2012లో అక్కడ రకీల్ అనే 30 ఏళ్ల మహిళతో ఇంటర్నెట్‌లో పరిచయం ఏర్పడింది. ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమెకు అప్పటికే ఓ కూతురు ఉంది.
ఫీనిక్స్‌లోని ఓ చిన్న బార్‌లో కలుసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అక్కడికి ముందే వెళ్లి కూర్చున్న రకీల్, ఆడమ్ రాక కోసం ఎదురుచూస్తోంది.
అరగంట అయినా అతని జాడ లేదు. చివరికి దారితప్పి వేరే హోటల్‌కి చేరిన ఆడమ్ అక్కడ నుంచి రకీల్‌కి ఫోన్ చేశాడు.
ఆయన క్షమాపణ చెబుతున్నట్టుగా, వినయంగా మాట్లాడాడు. దాంతో 'పొరపాట్లు ఎవరైనా చేస్తారులే' అనుకుంది రకీల్.
ఆడమ్ మాటల్లోని టెక్సాస్ యాస ఆమెను బాగా ఆకట్టుకుంది.
ఎట్టకేలకు రకీల్ వేచి ఉన్న బార్‌లోకి వచ్చాడు ఆడమ్. అతడు జంతుచర్మంతో చేసిన జాకెట్, జీన్స్ ధరించాడు.
"కూల్‌గా కనిపించాడు. అందంగా కూడా ఉన్నాడు" అని గుర్తు చేసుకొంది రకీల్.
"ఆమె మీద నుంచి కళ్లు తిప్పుకోలేకపోయాను. చొట్టబుగ్గలతో నవ్వుతుంటే మరింత అందంగా ఉంది" అన్నాడు ఆడమ్.
ఇద్దరూ కలిసి ఫోటో తీసుకున్నారు.
ఆ తర్వాత తరచూ కలుసుకునేవారు.
కొంతకాలం అలా సహచర్యం సాగించాక, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివసించటం మొదలుపెట్టారు.
2015 జూలైలో ఫీనిక్స్ నగర శివార్లలో ఉన్న చిన్న ప్రార్థనా మందిరంలో పెళ్లి చేసుకున్నారు.
కానీ ఉన్నట్టుండి 2016 సెప్టెంబర్‌లో ఒక రోజు రకీల్‌తో తాను గడిపిన నాలుగేళ్ల అనుభవాలన్నీ ఆడమ్ మరచిపోయాడు.
దాంతో అతడు మళ్లీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన తల్లిని పిలిచాడు ఆడమ్. ఆమెను మాత్రమే గుర్తించగల స్థితిలో ఉన్నాడు.
"రకీల్‌తో నీవు ప్రేమలో ఉన్నావు. ఆమెను పెళ్లి చేసుకున్నావు. రకీల్ కూడా నిన్ను ప్రేమిస్తోంది. మీరిద్దరూ చల్లగా ఉండాలి" అని తల్లి చెప్పింది.
తల్లి మాటలతో ఆడమ్‌కు రకీల్ మీద నమ్మకం పెరిగింది.
తర్వాత ఆమెను అప్పుడప్పుడు ప్రశ్నలు అడిగేవాడు.
'ఇంత అందగత్తె నాకు ఎప్పుడు పరిచయమైంది?' అన్న ప్రశ్న అతడి మెదడులో మెదిలేది.
అలా ఆసుపత్రిలో ఆడమ్, రాక్వెల్ మళ్లీ ప్రేమించుకోవటం మొదలు పెట్టారు.
వీలున్నప్పుడల్లా కబుర్లు చెప్పుకునేవారు. శాండ్‌విచ్ తింటూ కాలక్షేపం చేసేవాళ్ళు.
అప్పుడప్పుడు రాత్రుళ్ళు కూడా తినుబండారాల కోసం కింది అంతస్తులకు వెళ్ళేవారు.
ఆడమ్‌కి ఫేస్‌బుక్‌లో కొన్ని పాత ఫోటోలను రకీల్ చూపిస్తూ ఉండేది.
ఓ రోజు "మన పెళ్లి సర్టిఫికేట్ ఉందా?" అని అడిగేవాడు.
ఆమె తన పేరులో ఆడమ్ పేరును చేర్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో, పెళ్లి సర్టిఫికెట్‌ను రకీల్ తన వెంటే ఉంచుకుంటోంది.
దాంతో వెంటనే దాన్ని సంచిలోంచి తీసి చూపించింది.
తర్వాత తన భర్త తనను గుర్తుపడుతున్నాడన్న ఆశ ఆమెలో చిగురించింది.
కానీ, అంతా అనుకున్నంత సజావుగా సాగలేదు. ఒకసారి తామిద్దరం విడిపోవాలని ప్రతిపాదించాడు ఆడమ్.
మరో అడుగు ముందుకేసి "మనమిద్దరం అన్యోన్యంగా ఏమీ లేము. నువ్వు నన్ను సుఖపెట్టలేకపోతున్నావు" అని కూడా అనేశాడు.
అది విన్నాక "మనం ఎవరిని ప్రేమిస్తున్నామో కూడా తెలియని వ్యక్తిని ప్రేమించి ప్రయోజనం ఏముంది?" అని రకీల్ కుమిలిపోయింది.
అయినా మళ్లీ తన భర్తను మార్చుకునేందుకు ఆమె అన్ని అవరోధాలూ అధిగమించింది.
అతనికి వంట వండటం నేర్పించింది.
ఒక తల్లిలా, భార్యలా రకీల్ ఎలా వ్యవహరిస్తుందో, పిల్లలను ఎంత బాగా చూసుకుంటుందో గమనించాడు ఆడమ్.
ఆడమ్ గతంలో మెమొరీ లాస్ అవ్వక ముందు ఎలా ఉండేవాడో క్రమంగా అలాగే మారుతున్నాడని తెలుసుకుని రకీల్ ఊరట చెందింది.
ఆసుపత్రిలో ఉన్నపుడు "నువ్వు నా భార్యవైతే నన్ను ముద్దుపెట్టుకోవచ్చుగా" అనేవాడు ఆడమ్.
"దాంతో సాధ్యమైనంత వరకు ఎటువంటి బహుమతి ఇవ్వకుండానే ముద్దు పెట్టుకోవాలన్న పురుషుల లక్షణం ఆయనలో కనిపించింది. ముద్దు కోసం నన్ను అలా ఎప్పుడూ ప్రలోభపెడుతూ ఉండేవాడు" అని గుర్తుచేసుకున్నారు రకీల్ (సిగ్గుపడుతూ).
పిల్లలు కూడా తమ కుటుంబంలో ఉన్నట్టుండి వచ్చిన మార్పులకు అలవాటు పడే ప్రయత్నం చేశారు.
ఆడమ్ రెండోసారి జ్ఞాపకశక్తి కోల్పోయిన 2016 నాటికి అబ్బీకి పన్నెండేళ్లు, లులుకు పదిహేనేళ్లు, ఎలిజాకు పదిహేడేళ్లు.
గతంలో తమ తండ్రి నేర్పిన వ్యాయామ చిట్కాలు తిరిగి నేర్పడం ద్వారా పిల్లలు తండ్రిని మామూలు మనిషిగా మార్చే ప్రయత్నం చేశారు.
"చూడు నాన్నా... మాకు ఇవన్నీ నేర్పింది నువ్వే" అని కొన్ని కసరత్తులు కూడా చేసి చూపించేవాళ్లు.
అలా రోజూ వ్యాయామశాలలో తమ పిల్లలతో గడిపినట్టున్నాను అంటూ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు ఆడమ్.
జ్ఞాపకశక్తి కోల్పోయిన మూడు నెలల తర్వాత 2016 డిసెంబరులో ఒక రోజు ఉన్నట్టుండి మూడేళ్ల క్రితం తమ మధ్య ప్రేమ మొదలైన తొలిరోజుల్లో ముద్దు మురిపాలాడుకునే సమయంలో జరిగిన ఒక తప్పిదానికి క్షమాపణ చెప్పాడు ఆడమ్.
అందుకు నేనెవరో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అని రకీల్ అడిగింది.
ఆడమ్ "నిన్నెలా మర్చిపోతాను? నువ్వు నా రకీల్‌వి!" అని సమాధానమిచ్చాడు.
దాంతో రకీల్ ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.
"ఓ ప్రియతమా.. నేను నీకు చెప్పాల్సింది చాలా ఉంది" అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది.
ఆ రోజు తన భర్తతో సరదాగా గడపాలని రకీల్ ఆరాటపడింది.
కానీ అది సెలవురోజు కాదు. అప్పటికి కుటుంబ పోషణకు ఆమె ఒక్కరే దిక్కు. దాంతో ఆమె ఆఫీసుకి వెళ్లక తప్పలేదు.
వెళ్తూ వెళ్తూ పిల్లలను స్కూలుకు తీస్కెళ్లమని ఆడమ్‌కి చెప్పింది.
పిల్లలిద్దరూ బడికి చేరున్న తర్వాత తాను తిరిగి ఇంటికెళ్లే దారి మర్చిపోతానేమో అని ఇంటి అడ్రస్ జీపిఎస్ లింకును పంపమని అడిగాడు అడమ్.
కానీ, ఎలాంటి సమస్య లేకుండా పిల్లలను స్కూలు దగ్గర విడిచిపెట్టి వచ్చాడు.
ఆడమ్ ఇప్పుడు చాలా విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు. మూడేళ్ల కిందటి అనేక తీపి గుర్తులు, రకీల్‌ను పెళ్లి చేసుకున్న విషయం మాత్రం గుర్తులేదు.
2013లో తన కుటుంబాన్ని అత్యంత ప్రియమైన డిస్నీల్యాండ్‌కు తీసుకెళ్ళింది కూడా అతనికి గుర్తు లేదు.
వైద్యులు తమకు బోలెడు పరీక్షలు చేశారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్, ఎకో కార్డియోగ్రామ్స్ వంటివన్నీ చేశారు. కానీ రెండోసారి ఆడమ్‌కు మెమొరీ లాస్ ఎందుకు అయ్యిందో మాత్రం నిర్ధారించలేకపోయారు.
ఈ కుటుంబం ఇప్పుడు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది. అడమ్ తిరిగి పనిలో చేరారు. ప్రస్తుతం చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నారు.
తమ ముగ్గురు పిల్లల్లో ఒకరు కాలేజీ చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లారు.
ఇప్పుడు తమ వైవాహిక జీవితం చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోందని అంటున్నారు రకీల్.
"నమ్మకం, విశ్వాసం ఉంటే జీవితంలో ఎంత క్లిష్టమైన సమస్యలనైనా అధిగమించగలం అన్న విషయం నేర్చుకున్నా" అని అంటారు ఆడమ్.
"మా పెళ్లి ఒక పెద్ద గాలివానను తట్టుకుని నిలబడింది. ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది" అంటారు రకీల్.
ఇవి కూడా చదవండి:
- పొడవుంటే కేన్సర్ రిస్క్ ఎక్కువా?
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్'లు.. ఓ అంతర్జాతీయ సమస్య!
- బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అందులో ఏమేం ఉన్నాయో తెలుసా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)