You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ మిరపకాయ తింటే ఆసుపత్రిపాలే!
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను తిన్న వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తి మిరపకాయలను తినే పోటీలో పాల్గొని ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు.
పోటీలో భాగంగా ఆ వ్యక్తి ఒక 'కరోలినా రీపర్' మిరపకాయను పూర్తిగా నమిలేశాడు. దీంతో వికారం, ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి రావడంతో అతణ్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ తలనొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగిందని, మిరపకాయలు తిని ఆసుపత్రి పాలైన సంఘటన మొదటి కేసు ఇదేనని బీఎంజే కేస్ రిపోర్ట్స్ వెబ్‌సైట్ ఈనెల 9వ తేదీన ప్రచురించిన నివేదికలో పేర్కొంది.
'థండర్‌క్లాప్' అని పేర్కొనే ఇలాంటి తీవ్రమైన తలపోటు వల్ల వాంతి వచ్చినట్లుగా ఉండడంతో పాటు, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుంచించుకుపోతాయి. వైద్య పరిభాఫలో దీనిని 'రివర్సిబుల్ సెరిబ్రల్ వాసోకన్‌స్ట్రిక్షన్ సిండ్రోమ్' (ఆర్‌వీఎస్‌వీ) అని పేర్కొంటారు.
ఆసుపత్రిలో చేరాక కొద్ది రోజుల పాటు ఆ వ్యక్తి మెడనొప్పితోపాటు, తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు.
అతనికి వివిధ న్యూరోలాజికల్ పరీక్షలు, సీటీ స్కాన్ నిర్వహించగా, మెదడులోని పలు రక్తనాళాలు కుంచించుకుపోయినట్లు వాటిలో తేలింది.
ఏంటీ కరోలినా రీపర్?
- ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పేరొందిన కరోలినా రీపర్ నుంచి సగటున 15,69,300 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ (ఎస్ హెచ్ యూ) ఉత్పత్తి అవుతాయి.
- 2013లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పేర్కొంది.
- దక్షిణ కరోలినాలోని పకర్‌బట్ పెప్పర్ కంపెనీకి చెందిన ఎడ్ కర్రీ దీని సృష్టికర్త. దీనిని సృష్టించడానికి ఆయనకు పదేళ్లు పట్టింది.
- మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్‌లో క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు ఉన్నాయని గుర్తించడంతో ఆయన వీటిని సృష్టించారు. తన ఆదాయంలో సగాన్ని ఆయన క్యాన్సర్ పరిశోధనకు విరాళంగా ఇస్తున్నారు.
అయితే ఆ వ్యక్తిలో కలిగిన ఈ మార్పులు వాటికవే మెల్లగా తగ్గిపోయాయి. ఐదువారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో అతని రక్తనాళాలు సాధారణ స్థితికి చేరినట్లు తేలింది.
డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కులోతుంగన్ గుణశేఖరన్, ఈ మిరపకాయను తినే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మిరపకాయను తిన్న సందర్భంలో తలనొప్పి వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)