You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామన్వెల్త్ డైరీ: ఆ సమయంలో మను భాకర్‌లో ఎలాంటి భావోద్వేగాలు లేవు!
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది బెల్మోంట్ షూటింగ్ రేంజ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడుతున్నవారిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ప్రేక్షకులు చప్పట్లతో వారికి స్వాగతం పలుకుతున్నారు.
ఒక్క మను భాకర్ మినహా అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నారు.
మను భాకర్ మదిలో మరేదో ఆలోచన ఉంది. ఆమె చూపు ఇంకెక్కడో ఉంది.
ప్రేక్షకుల చప్పట్లు, కేకలు ఆమె ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలిగించలేకపోయాయి.
పోటీ జరుగుతున్నంతసేపు మను కనీసం ఒక్కసారి కూడా నవ్వలేదు. చిరునవ్వు చిందించలేదు.
10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె స్వర్ణ పతకం గెలవడం ఖాయమని తెలిసిన తర్వాతే మను మొహంలో తొలి ఎమోషన్ కనిపించింది. మౌనంగా హీనా సిద్ధూని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది.
రెండేళ్ల క్రితమే ఎయిర్ పిస్టల్ పట్టింది!
మను వయసు పదహారేళ్లు. హర్యానాలోని గొరియా స్వగ్రామం. రెండేళ్ల క్రితమే షూటింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది.
ఫైనల్స్‌లో మను ఎడమ చేతిని ప్యాంట్ వెనక జేబులో పెట్టుకుని 24 లక్ష్యాలపై గురిపెట్టింది.
మను గురిపెట్టిన 24లక్ష్యాల్లో 14సార్లు 10కంటే ఎక్కువ పాయింట్లే సాధించింది.
ప్రతీ 8వ షాట్‌కు ఒకసారి ఆమె పక్కనే ఉన్న బాటిల్‌లోని నీళ్లు తాగింది.
10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె స్వర్ణ పతకం గెలిచిన తర్వాత 'సునాయాసంగా విజయం సాధించారు కదా' అని నేను ఆమెను అడిగా. దానికి మను "ప్రతీసారి నేను చాలా ఏకాగ్రతగా ఉండేందుకు ప్రయత్నించా" అని చెప్పింది.
బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. బయట కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు. గెలవడం ఏమంత పెద్ద కష్టం కాదని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ విజయం సాధించడం అనుకున్నంత సులువు కాదు.
పిస్టల్‌తో కాల్చే సమయంలో శరీరం ఎంత స్థిరంగా ఉంది అన్న అంశంపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మను ఆరితేరింది.
"మనుకు ఎంతో ప్రతిభ ఉందని, అంతర్జాతీయ వేదికలపై గెలవాలంటే ఆమె మరింత స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉందని" మను కోచ్ జెస్పాల్ రానా, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా అభిప్రాయపడ్డారు.
హీనా సిద్ధూ.. రజత పతక విజేత
ఇక హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించారు.
కానీ ఒక సమయంలో హీనా ఏడో స్థానంలో ఉంది. పోటీ నుంచి తప్పుకోవడానికి అడుగు దూరంలో ఉంది.
అలాంటి సమయంలో హీనా చాలా అప్రమత్తంగా ఆడింది.
నిలకడగా, స్థిరంగా 10 ప్లస్ పాయింట్లు సాధించి రెండోస్థానానికి చేరింది.
ట్రిగర్ నొక్కే వేలుకు గాయమైందని హీనా తర్వాత నాకు చెప్పింది. దాంతో ట్రిగర్ నొక్కే సమయంలో చికాకు అనిపించిందని తెలిపింది.
గతేడాది కూడా హీనాకు ఇలాంటి సమస్యే వచ్చింది. అప్పుడు ఆమె చూపుడువేలు వణికింది.
కానీ చివరి షాట్స్‌లో ఆమె పూర్తి ఏకాగ్రతతో లక్ష్యంపై గురిపెట్టింది. అందుకే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి.
పసిడి పతకంపై కన్నేసిన మేరీ కోమ్
కామన్వెల్త్ గేమ్స్‌లో మేరీ కోమ్ పతకం ఖాయం చేసుకుంది. 48 కేజీల బాక్సింగ్ విభాగంలో స్కాట్లాండ్‌కు చెందిన మెగన్ గోర్డన్‌పై మేరీ సునాయాసంగా విజయం సాధించి, సెమీ ఫైనల్ చేరుకుంది.
ఆమెకు కాంస్య పతకం రావడం ఖాయం. కానీ గోల్డ్ మెడల్ సాధించాలని మేరీ కోమ్ పట్టుదలగా ఉంది.
ఫైనల్స్‌లో చోటు కోసం శ్రీలంకకు చెందిన అనుషాతో ఆమె పోటీ పడుతోంది.
35ఏళ్ల మేరీ కోమ్ ముగ్గురు పిల్లల తల్లి. అంతేకాదు పార్లమెంట్ సభ్యురాలు కూడా.
మేరీ కోమ్‌కు గోల్డ్ కోస్ట్ అంటే చాలా ఇష్టం. ఆమెపై తీసిన సినిమాతో మేరీ కోమ్ ఇక్కడ చాలా ఫేమస్ అయ్యారు.
క్రీడా గ్రామం దాటి బయటికి వస్తే చాలు ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు అంటూ ఆస్ట్రేలియాలోని అభిమానులు అమె చుట్టూ చేరుతారు.
ఆస్ట్రేలియాలోని ప్రముఖ పత్రిక 'ది ఆస్ట్రేలియన్' కూడా మేరీ కోమ్‌పై కథనం రాసింది.
ఎక్కడ చూసినా భారత్-పాకిస్తాన్ ట్యాక్సీ డ్రైవర్లే!
గోల్డ్ కోస్ట్‌లో ట్యాక్సీ డ్రైవర్లలో ఎక్కువ మంది భారత్, పాకిస్తాన్‌కు చెందిన వారే ఉన్నారు.
గోల్డ్ కోస్ట్‌లోనే కాదు.. సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాల్లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్ల సంఖ్య ఎక్కువ.
అందులోనూ పంజాబ్ నుంచి వచ్చిన డ్రైవర్లే అధికం.
ట్యాక్సీ ఎక్కగానే వారు హిందీ లేదా పంజాబ్‌లో మాట్లాడటం మొదలుపెడతారు.
అడక్కుండానే గోల్డ్ కోస్ట్ గురించి టిప్స్ చెప్తారు. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, ఏం కొనాలి.. ఎక్కడ కొనాలి.. ఏం తినాలి..ఎక్కడ రుచికరమైన ఆహారం దొరుకుతుంది.. ఇలా అన్ని విషయాలు చెప్తారు.
మా ట్యాక్సీ డ్రైవర్ రూపిందర్ సింగ్ చాలా మంచి వ్యక్తి.
మేం కారు దిగుతున్న సమయంలో వర్షం పడుతోంది. వెంటనే అతను మాకు గొడుగు ఇచ్చాడు. గొడుగు ఎలా తిరిగివ్వాలని మేం అడిగాం. మీరు గొడుగు మళ్లీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని అతను చెప్పాడు.
ఆస్ట్రేలియాకు వచ్చిన చాలామంది భారతీయులు మొదట ట్యాక్సీ డ్రైవర్లుగానే జీవితం ప్రారంభిస్తారు. తర్వాత ఇతర వృత్తుల్లోకి మారిపోతారు.
ట్యాక్సీ డ్రైవర్‌గా మారాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. పంజాబ్‌లోని గ్రామాల నుంచి వచ్చే వారికి ఇంగ్లిష్ సరిగా రాదు.
కానీ త్వరలోనే ఇంగ్లిష్‌లో మాట్లాడటం వారు నేర్చుకుంటారు. కొందరు అదనపు ఆదాయం కోసం కూడా ట్యాక్సీలు నడుపుతారు.
మేం వారి ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వారు సున్నితంగా తిరస్కరించారు.
"మేము ఆస్ట్రేలియాలో ట్యాక్సీ నడుపుతున్నామని భారత్‌లో ఉన్న బంధువులకు తెలిస్తే బాధపడతారని" వారు చెప్పారు.
చాలా ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్స్‌కు చేరాయి.
అప్పుడు "ట్యాక్సీ డ్రైవర్లు వర్సెస్ ట్రామ్ డ్రైవర్ల"కు పోటీ అని ఒక ఆస్ట్రేలియా పత్రిక హెడ్‌లైన్ పెట్టి కథనం ప్రచురించింది. ఈ విషయం నాకు బాగా గుర్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)