అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ ప్రసంగం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తన మొదటి ప్రసంగాన్ని చేస్తున్నారు. దీన్నే స్టేట్ ఆఫ్ ద యూనియన్ అని అంటారు. అమెరికా అధ్యక్షుడు ప్రతి సంవత్సరం ఇలా ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
అమెరికా ప్రజల ముందు అధ్యక్షుడిగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడి ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు.
అమెరికా ప్రజలు ఎంతో ధైర్యవంతులు. వారి ధైర్యం కారణంగా దేశం మొత్తం ఎంతో ఆశావహ వాతావరణం ఉంది. వారిని చూసి గర్విస్తున్నా.
ఈ 11 నెలల కాలంలో 2.4 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాం. తయారీ రంగంలో కూడా ఎన్నో కొత్త ఉద్యోగాలు వచ్చాయి. వేతనాలు పెరిగాయి. నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి వచ్చింది.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా గణనీయమైన ప్రగతి సాధించాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. తుపానులు, విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఆ సమయంలో కేజున్ నేవీ చూపించిన సాహసం, అందించిన సహాయ చర్యలు అభినందనీయం.
నేను 11 నెలల క్రితం ఇక్కడే ప్రకటించా... పన్నులు తగ్గిస్తాం, ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తాం అని. దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. దీనివల్ల మధ్యతరగతి అమెరికన్లకు ఎంతో మేలు జరుగుతోంది. అమెరికా చరిత్రలోనే ఇవి గొప్ప సంస్కరణలు. చిన్న తరహా పరిశ్రమలు కూడా ఎంతో లాభపడ్డాయి.
అమెరికన్ కంపెనీలు, ప్రజలు ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదు, ఎవరితోనైనా పోటీపడగలరు.
అమెరికన్లు తమ కలలను నిజం చేసుకోవడానికి ఇంతకన్నా మంచి రోజులు రావు.
నిపుణులైన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.

ఫొటో సోర్స్, Pool
ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ విజయం అమెరికన్లందరిదీ. దీనిలో అందరికీ భాగం ఉంది.
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనన్ని కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం. ఇక్కడి ప్రజలు తమ వైద్య చికిత్సలకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించాం.
అమెరికా అంటే గొప్ప గొప్ప నిర్మాణాలను చేసిన నిపుణులకు పెట్టింది పేరు. ఎంపైర్ స్టేట్ భవనాన్ని ఒక్క సంవత్సరంలో నిర్మించాం. కానీ ఓ రోడ్డు నిర్మించడానికి అనుమతులకే పదేళ్లు పట్టడం ఎంతో బాధాకరం. అందుకే 1.5 ట్రిలియన్ డాలర్లతో కొత్త రహదారులు, వారథులు నిర్మించనున్నాం. ఆధునిక మౌలిక సౌకర్యాల కల్పనకు అందరూ రాజకీయాలకు అతీతంగా తోడ్పాటునందించాలని కోరుతున్నా.
ఎక్కడ కొత్త ఉద్యోగాలకు అవకాశముంటుందో ఆ రంగంలోనే పెట్టుబడులు పెడదాం.
అమెరికా ఇప్పుడు మరింత శక్తిమంతంగా మారింది. ఈ శక్తిని ప్రజలందరికీ అందించాలనుకుంటున్నాం.
దక్షిణ అమెరికావైపు గోడ నిర్మిస్తున్నాం. ఇది మన పౌరులను భద్రంగా ఉంచడానికే. అక్రమంగా ప్రవేశించేవారిని, తీవ్రవాదులను నిరోధించడం మరితం సులభమవుతుంది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








