You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంధుల క్రికెట్: పాకిస్తాన్‌ను ఓడించి వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు
అంధుల క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. షార్జా క్రికెట్ మైదానంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టుకు అజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.
309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ధాటిగా బ్యాటింగ్ చేసింది.
ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఓపెనర్ వెంకటేశ్ 35 పరుగులు చేసి ఔటయ్యారు.
20 ఓవర్లు ముగిసేప్పటికి భారత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు. అప్పటికి మరో 120 బంతుల్లో 159 పరుగులు చేయాల్సి ఉంది.
28వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మన్ సునీల్ రమేశ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
30 ఓవర్లకు భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అప్పటికి మరో 60 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది.
సెంచరీకి దగ్గరైన సునీల్ రమేశ్ 35వ ఓవర్లో అమీర్ ఇష్ఫక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రమేశ్ 93 పరుగులు చేశాడు.
కెప్టెన్ అజయ్ రెడ్డి 36వ ఓవర్లో గాయపడ్డాడు. అతని కుడి కాలుకు దెబ్బ తగిలింది.
ఆ తర్వాతి ఓవర్లోనే అజయ్ రెడ్డి ఔటయ్యాడు. 62 పరుగులతో ఆయన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు విజయానికి చేరువైంది. అప్పటికి 18 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది.
అనంతరం భారత బ్యాట్స్‌మన్ మహేందర్, గణేశ్, సోనులు వరుసగా ఔటవటంతో మ్యాచ్ ఉత్కంఠ మలుపులు తిరిగింది.
అయితే 39వ ఓవర్లో మూడో బంతిని పాకిస్తాన్ బౌలర్ ఇస్రార్ వైడ్ బాల్ వేయటం.. అది బౌండరీ దాటడంతో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. తర్వాతి బంతిని డైవ్ చేసి భారత్ 5వ అంధుల ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.
భారత ఆర్మీకి అంకితం - అజయ్ రెడ్డి
కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు కెప్టెన్ అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గత 50 రోజులుగా ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాం. నేను వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉన్నా. ఈ విజయాన్ని భారత సైనికులకు అంకితం చేస్తున్నా. వాళ్లు.. కుటుంబాలకు దూరంగా.. సరిహద్దుల్లో ఎంతగానో శ్రమిస్తున్నారు. టాస్ గెలిచిన దగ్గర్నుంచి ఈ మ్యాచ్ మేమే గెలుస్తామని బలంగా నమ్మాను. ఆటగాళ్లకు విజయం సాధిస్తామన్న విశ్వాసం చాలా ముఖ్యం. ఇక తర్వాతి టోర్నమెంట్లకు సిద్ధమవుతాం. ఈ టోర్నమెంట్‌లో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చాం. మున్ముందు మరింత మంది కొత్తవాళ్లకు అవకాశాలిస్తాం. విజయానికి సహకరించిన జట్టు సభ్యులకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు.
శుభాకాంక్షలు
కాగా, 5వ అంధుల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును పలువురు ప్రముఖులు, ప్రజలు అభినందించారు. సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు వెల్లువెత్తాయి.
‘‘ప్రపంచ కప్ గెలిచినందుకు అభినందనలు. మీరు జాతి గర్వపడేలా చేశారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- ఒక్క ఆటతో.. అబ్బాయిలకు డ్రగ్స్ దూరం, అమ్మాయిలకు స్వాతంత్ర్యం
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- రోహిట్: ఏంటా వేగం.. ఏంటా బాదుడు?
- రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో భారత్ విజయం
- నెహ్రా నీ స్వింగ్‌ను ఎలా మరిచిపోగలం
- విరాట్ కోహ్లీ: అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)