You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్కేటింగ్ సునామీ: ఈ పాప వయసు 6, పతకాలు 64
- రచయిత, భూమికా రాయ్, వీడియో: డెబాలిన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
లబ్ది సురానా వయసు 6. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌కి చెందిన లబ్ది భారత్‌కి ఒలింపిక్స్ పతకాన్ని అందించడమే తన లక్ష్యం అంటోంది.
‘కెరటాలకు భయపడే పడవ సముద్రాన్ని దాటలేదు, ప్రయత్నాన్ని ఆపని వాళ్లు ఎప్పటికీ ఓడిపోలేరు, పడిపోతే లేవడం, మళ్లీ కింద పడటం సహజం, ఈ మాట వినడానికి కరకుగా ఉన్నా ఇదే నిజం’.. లబ్దికి బాగా ఇష్టమైన వాక్యాలివి.
అ మాటల్లో చెప్పినట్టు తన లక్ష్యాన్ని చేరుకునేవరకూ కష్టపడుతూనే ఉంటానంటోంది లబ్ది.
మూడేళ్ల వయసు నుంచే స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన లబ్ది 8 అంతర్జాతీయ పతకాలను సైతం గెలుచుకుంది.
ఇటీవలె రాష్ట్రపతి నుంచీ అవార్డు అందుకున్న లబ్ది, ఆ రోజు జరిగిన కార్యక్రమం గురించి వివరిస్తూ ‘‘ముందు వాళ్లు.. 'కుమారి లబ్ది రానా' అని మన పేరు పిలుస్తారు. తరవాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఆయన మెడల్ వేస్తారు. ఫొటో కూడా తీస్తారు. ఆ తరవాత అందరికీ నమస్తే చెప్పి మా సీట్లోకి వచ్చి కూర్చోవాలి’’ అని చెబుతోంది.
‘రోజూ ఉదయాన్నే 5గం.కి లేచి స్కేటింగ్‌కి రెడీ అవుతా. తరవాత ఇంటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి స్కూల్‌కి వెళ్లిపోతా. సాయంత్రం ఇంటికొచ్చాక కాసేపు చదువుకుంటా. తరవాత జిమ్నాస్టిక్ క్లాస్‌కీ, అక్కడ నుంచి స్కేటింగ్ ప్రాక్టీస్‌కీ వెళ్తా. రాత్రికి ఇంటికొచ్చి తినేసి నిద్రపోతా’ అంటూ తన దిన చర్యను వివరిస్తుంది లబ్ది.
‘తనకు క్రమశిక్షణ ఎక్కువ. ఏదైనా పని చేయాలని చెబితే వెంటనే చేస్తుంది. నా కూతురు నన్ను ప్రెసిడెంట్ నివాసం దాకా తీసుకెళ్తుందనీ, రెడ్ కార్పెట్ పైన నేను నడుస్తాననీ కలలో కూడా ఊహించలేదు’ అంటూ కూతురి విజయాల్ని తలచుకొని గర్వపడతారు లబ్ది తల్లి అంజలి సురానా.
లబ్దికి మేకప్ వేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టమట. ‘స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, మేకప్, చదువంటే నాకు చాలా ఇష్టం. వాటన్నింటికంటే మా అమ్మంటే ఎక్కువ ఇష్టం. ప్రపంచంలో అందరికంటే బెస్ట్ మా అమ్మే’ అంటోందీ బాలిక.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)