You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బుధియా సింగ్: ఏదో రోజు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మారథాన్ కుర్రాడు బుధియా గుర్తున్నాడా? బుధియా కెరీర్ ఎదుగుతున్న దశలో అతని కోచ్ బిరంచి దాస్ హత్యకు గురయ్యాడు. దాంతో బుధియా శిక్షణ నిలిచిపోయి, పోటీల్లో పాల్గొనలేకపోయాడు.
ఆ తర్వాత అతను భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో పదేళ్లు ఉన్నాడు.
''వాళ్లు నన్ను బయటి దేశాలకు తీసుకెళతామని, పోటీల్లో పాల్గొనేలా చేస్తామని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రభుత్వం కూడా నాకు ఎలాంటి సహాయమూ చేయలేదు'' అని బుధియా తెలిపాడు.
అయితే భువనేశ్వర్‌లోని డీఏవీ స్కూల్‌లో అడ్మిషన్ లభించడంతో అతని జీవితం మళ్లీ మలుపు తిరిగింది.
ఇక్కడే బుధియాకు ఆనంద్ చంద్ర దాస్ రూపంలో కొత్త కోచ్ దొరికాడు.
బుధియాకు శిక్షణ ఇస్తుండగా నేనాయనను కలిసాను.
''బుధియాలో చాలా ప్రావీణ్యం ఉంది. అతనిలో చాలా ఉత్సాహం ఉంది. అతణ్ని నేను మారథాన్ పోటీల కోసం సిద్ధం చేస్తున్నాను. రోడ్ల మీద పరిగెత్తడం ప్రాక్టీస్ చేయిస్తున్నాను'' అని ఆయన తెలిపారు.
''బుధియా ఇప్పుడు 15-20 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతున్నాడు. అతనిలో అంతర్గతంగా ఉన్న శక్తి బయటకు రావడానికి ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను'' అని వివరించారు.
ఒలింపిక్స్ కల
చాలా రోజులు శిక్షణకు దూరంగా ఉండడం వల్ల, బుధియా ఇప్పుడు చాలా శ్రమించాల్సి వస్తోంది.
దానికి తోడు అతని తల్లికి వచ్చే రూ.8 వేల ఆదాయం ఎందుకూ సరిపోవడం లేదు.
''క్రీడాకారులకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బలమైన పోషకాహారం, దుస్తులు, క్రీడా సామగ్రి, బూట్లు అన్నీ కలిసి లక్ష వరకు ఖర్చవుతుంది'' అని బుధియా తెలిపాడు.
అందుకే అతను చిన్న చిన్న పోటీల్లో సైతం పాల్గొంటున్నాడు.
బుధియా ఇప్పటికీ తన చిన్ననాటి కోచ్ బిరంచి దాస్‌ను మర్చిపోలేదు. శిక్షణలో కొంచెం విరామం దొరికినా అతను ఆయనను గుర్తు చేసుకుంటాడు.
''నేను ఇక్కడి వరకు రావడానికి కారణం ఆయనే. నన్ను ఒలింపిక్స్‌కు తీసుకెళ్లాలనేది ఆయన కల. నేను ఆయన కలను నిజం చేస్తాను'' అని బుధియా తెలిపాడు.
ఆర్థిక ఇబ్బందులు, వనరుల లేమి కొంతకాలం బుధియాకు ఆటంకాలు సృష్టించాయి.
కానీ ఇప్పుడు బుధియా మరోసారి పోటీల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు.
తన కొత్త కోచ్‌తో కలసి నాలుగేళ్ల వయసులో చేసిన అడ్వెంచర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)